రాష్ట్రవ్యాప్తంగా రైతులంతా ఇదే ఇబ్బంది.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రవ్యాప్తంగా రైతులంతా ఇదే ఇబ్బంది..

రాష్ట్రవ్యాప్తంగా రైతులంతా ఇదే ఇబ్బంది..

Written By news on Friday, February 27, 2015 | 2/27/2015

వేదికలో వైఎస్ జగన్‌తో మొరపెట్టుకున్న రైతులు
 
రైతు భరోసా యాత్ర నుంచి సాక్షిప్రతినిధి : ‘‘రైతులందరూ ఆన్‌లైన్ పేపర్లు తీసుకుని ససాక్ష్యాలతో రుణమాఫీపై మోసాన్ని వివరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులంతా ఇదే ఇబ్బంది పడుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం సెల్ఫ్ డబ్బా కొడుతున్నారు. రైతులకు జరిగిన మోసంపై ఉద్యమాన్ని ఆపేది లేదు. చంద్రబాబు దిగివచ్చేదాకా అందరం కలసికట్టుగా నడుం బిగించి పోరాడదాం’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రైతు భరోసా యాత్రలో భాగంగా గురువారం ఆయన అనంతపురం జిల్లా పామిడి మండలం రామరాజుపల్లిలో నిర్వహించిన సదస్సులో రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, జగన్ మధ్య సాగిన సంభాషణ..
 
రూ.60 వేలు అప్పునకు గాను రూ.3,642 మాఫీ అయింది
కేశవరెడ్డి: సార్ నాకు బ్యాంకులో 60 వేల రూపాయల అప్పుంది. అయితే నాకు 3,642 రూపాయలు మాఫీ అయిందని ఇదో ఈ పత్రంలో ఉంది. (మీ సేవా సెంటర్‌లో తీసుకున్న రుణమాఫీ పత్రం చూపిస్తూ)
జగన్: (ఆ పత్రం తీసుకుని) ఇది నా దగ్గరే పెట్టుకుని అసెంబ్లీలో చంద్రబాబుకు చూపిస్తా
 
99 వేలు అప్పుంటే రూపాయి పోలేదు
సుబ్బమ్మ: సార్ 99 వేల రూపాయలు బ్యాంకులో క్రాప్‌లోన్ తీసుకున్నా. ఎనిమిది వేల రూపాయలు పోయింది అన్నారు. అది కూడా పోలేదు సార్.
జగన్: (పత్రాలు చేతికి తీసుకుని) మా సుబ్బమ్మ పరిస్థితి ఇది. 99 వేల రూపాయలు తీసుకుంది. వడ్డీతో కలిపి 1,07,362 రూపాయలైంది. అయితే 8,312 రూపాయలు మాఫీ అయిందని చెబుతున్నారు. అది కూడా పోలేదు. అది వచ్చినా కనీసం వడ్డీకి కూడా సరిపోదు. ఏ విధంగా రుణమాఫీ చేశావు అని చంద్రబాబును నిలదీస్తా అవ్వా..
 
మొదటి సంతకం దీనికే అని మోసం చేశారు
రోశన్న: సార్.. నేను బ్యాంకులో 72 వేల రూపాయలు అప్పు తెచ్చుకున్నా. రూపాయి పోలేదు. మొదటి సంతకం రుణమాఫీపై పెడతా అన్నారు. ఇప్పుడు పావలా ఇవ్వలేదు సార్.
జగన్: రోశన్నకు 4.56 ఎకరాలు ఉంది. 72 వేల రూపాయలు తీసుకుంటే దమ్మిడీ కూడా మాఫీ కాలేదని అసెంబ్లీలో చెబుతాను.
 
చౌడమ్మ: సార్.. నేను డ్వాక్రాలో ఉన్నా. మా ఆయనకు అనారోగ్యం కావడంతో 50 వేల రూపాయలు తీసుకున్నా. నెలకింత కట్టుకుందామనుకున్నా. రుణమాఫీ చేస్తామన్నారు. డబ్బులు కట్టలేదు. ఇప్పుడు అంతా కట్టాలంటాండారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తాడు. కట్టేది లేదన్నాను. అయితే చంద్రబాబునే అడుగండంటున్నారు. మాకు మాత్రం బాకీ కట్టాల్సిందే అని బ్యాంకర్లు నిలదీత్తన్నారు. మాకు పొలం లేదు. ఏం చేసేది మందుతాగి సావాలా?
జగన్: అయ్యో.. అంత మాట అనొద్దు చౌడమ్మవ్వా..
చౌడమ్మ: నాయనా.. మా బిడ్డలాంటోడివి. దేవుడి లెక్క ఈడకి వచ్చినావు. నువ్వు బస్సు పెట్టు. మేమంతా హైదరాబాద్‌కు వస్తాం. చంద్రబాబు ఇంటిముందు ధర్నా చేద్దాం.
జగన్: నువ్వు చేసిన మోసంతో చౌడమ్మవ్వ ఇలా బాధపడుతోందని నేను అసెంబ్లీలో చంద్రబాబును నిలదీస్తా అవ్వా.
 
 
చంద్రబాబు కాలర్ పట్టుకుని అడుగుతా
సుధాకర్: సార్.. మేం బ్యాంకులో 36 వేల రూపాయల రుణం తీసుకున్నాం. వడ్డీతో కలిపి దాదాపు 47 వేల రూపాయలైంది. నాకు ఆ రుణ మొత్తం మాఫీ అయినట్లు అప్లికేషన్ స్టేటస్‌లో ఉంది. చంద్రబాబు సంతకంతో రుణ విముక్తి పత్రం కూడా పంపారు. ఫీల్డ్ ఆఫీసర్ మాత్రం రుణమాఫీ కాలేదంటున్నారు సార్..
జగన్: మాఫీ అయిందని చంద్రబాబు లెటర్ పంపినాడు. కానీ ఫీల్డ్ ఆఫీసర్ కాలేదంటున్నారు. రెండూ నాకివ్వు. అసెంబ్లీలో చంద్రబాబును అడుగుతాను.
సుధాకర్: నన్నూ తీసుకుపోండి సార్.. కాలర్ పట్టుకుని అడుగుతా. నేను ఎంఏ బీఈడీ చేశా. బీఈడీ వాళ్లకు ఎస్జీటీ అవకాశం ఇస్తామని చంద్రబాబు మాట ఇచ్చారు. ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాం. ఇప్పుడు మోసపోయాం. చేతకానప్పుడు తప్పుడు హామీలు ఇవ్వకూడదు సార్.. (ఆవేదనతో ఏడుస్తూ) నా మాదిరి చాలామంది మోసపోయారు. ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. 2వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. దమ్మిడీ ఇవ్వలేదు. పోనీ కాంట్రాక్టు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే టీడీపీ నేతల సిఫార్సు కావాలంటున్నారు సార్. ఏం వాళ్లకు తప్ప మిగతా వాళ్లు అర్హులు కాదా సార్..
జగన్: సుధాకర్.. నీలాగే రాష్ట్రంలో కోటీ డెభ్భైఐదు లక్షల కుటుంబాలు నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నాయి. నీకు రుణమాఫీ కాలేదు. నీ తరఫున నేను అసెంబ్లీలో బాబును నిలదీస్తా. ఆ లెటర్లు నాకు ఇవ్వు.
 
వెంకిరెడ్డి: సార్. నేను 28 వేల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకున్నా. కానీ రూపాయి మాఫీ కాలేదు. 3.5 తులాలు బంగారు పెట్టి మరో 43 వేల రూపాయలు తీసుకున్నా. అదీ మాఫీ కాలేదు. పంటల్లేవు. పనుల్లేవు. డబ్బులు కట్టలేక నిలబడిపోయినా. ఏం చేసేది సార్..
జగన్: ఎన్ని ఎకరాలు ఉంది తాతా..
వెంకటరెడ్డి: ఐదు ఎకరాలు
జగన్: ఆ కాగితాలు నాకు ఇవ్వు వెంకటరెడ్డి తాతా.. పరిస్థితి ఇదీ అని నేను అసెంబ్లీలో బాబును నిలదీస్తా.
జగన్ : మీ అందరి తరఫున నేను అసెంబ్లీలో చంద్రబాబును నిలదీస్తాను. న్యాయం జరిగే వరకు అందరం కలసికట్టుగా పోరాడదాం.
 
ఆ వడ్డీ ఎవరు కట్టాలి సార్
సార్.. నేను 3.60 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నా. 2013 డిసెంబర్ 31 నాటికే ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తామంటోంది. 2014కు, ఈ మూణ్ణెళ్లు ఎవ్వరు వడ్డీ కట్టాలి? రైతులు 15 నెలల వడ్డీ చెల్లించాలి. మీరు అసెంబ్లీలో అడగాలి.     - రామచంద్రారెడ్డి, ఆకులేడు
 
రూపాయి మాఫీ చేయలేదు
మాది దేవి మహిళా సంఘం సార్. 4.50 లక్షల రూపాయల లోను తీసుకున్నాం. మాఫీ అవుతాదని 5 నెలలు కంతులు కట్టలేదు. ఐదు నెలలకు 55 వేల రూపాయలు వడ్డీ అయింది. అట్టాగే నాపేరు, మా ఆయన పేరు మీద 45 వేల రూపాయల క్రాప్‌లోను, 3.5 తులం బంగారం పెట్టి 35 వేలు గోల్డ్‌లోను తీసుకున్నాం. ఇద్దరికీ 11 వేలు పోయిందన్నారు. రూపాయి కూడా మాఫీ కాలేదు. అప్పులు మాఫీ చేస్తానని సీఎం చెప్పారు కదా అంటే ఆయన్నే అడుగు పో అంటున్నారు. ఎన్నికలొచ్చేదాకా ఆయప్ప ఈపక్కకు రారు. మా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. ఎట్టా చేసేది?     - కమలాక్షి, వెదురూరు
 
చేసేది లేక వడ్డీ.. కొంత అసలు కట్టినా
నాకు ఐదెకరాలు ఉంటే ఈ మధ్యనే రెండెకరాలు అమ్మినా. 46 వేల రూపాయలు క్రాప్‌లోను తీసుకున్నా. రూపాయి కూడా మాఫీ కాలేదు. వేలం వేస్తామని నోటీసులు పంపినారు. వడ్డీ, కొంత అసలు కట్టినా సార్. ఏం చేసేది?     - సుంకిరెడ్డి కాసేపల్లి
Share this article :

0 comments: