బాబు.. డ్వాక్రా మహిళలనూ మోసగించారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు.. డ్వాక్రా మహిళలనూ మోసగించారు

బాబు.. డ్వాక్రా మహిళలనూ మోసగించారు

Written By news on Tuesday, February 24, 2015 | 2/24/2015


బాబు.. డ్వాక్రా మహిళలనూ  మోసగించారు
చంద్రబాబు అధికారంలోకి వస్తే రుణాలన్నీ మాఫీ అన్నారు
 ఇప్పుడు మాఫీ పక్కనపెడితే వడ్డీ తడిసి మోపెడవుతోంది
 ‘రైతు భరోసా యాత్ర’లో వైఎస్ జగన్ మండిపాటు
 
 రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి:
 ‘‘మోసం చేసే వ్యక్తులను చాలామందిని చూశాం. కానీ మోసం చేసిన ముఖ్యమంత్రి మాత్రం చంద్రబాబే. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ కార్యకర్తలు ప్రతి ఇంటికీవెళ్లి ఇదే చెప్పారు. చంద్రబాబు సంతకంతో ఉన్న కరపత్రాలను పంపిణీ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా చంద్రబాబు మహిళలను పూర్తిగా మోసం చేశారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లాలో ఆయన చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’ రెండోరోజు సోమవారం కొనసాగింది. ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు రైతుల కుటుంబాలను పరామర్శించారు. కొత్త చెరువు మండలం మరుకుంటపల్లిలో కేశాని కేశప్ప (50), బుక్కపట్నం మండలం కొత్తకోటలో బోయ సురేంద్ర (24) కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. అంతకుముందు ఉదయం ఆయన కొత్తచెరువు మండలం చెన్నకేశవపురంలో లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి మరుకుంటపల్లికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కేశాని కేశప్ప కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. అక్కడి నుంచి కొత్తచెరువుకు వచ్చారు.
 
 డ్వాక్రా మహిళలతో మాట్లాడారు. జగన్ అక్కడికి చేరుకోగానే డ్వాక్రా మహిళలు ‘జై జగన్’ అంటూ నినదించారు. కొందరు మహిళలు జగన్‌ను చూసి కంటతడి పెట్టారు. మహిళలందరికీ ఆయన ఆప్యాయంగా అభివాదం చేశారు. చంద్రబాబు వైఖరితో తమకు జరిగిన అన్యాయాన్ని ప్రతిపక్ష నేతకు చెప్పుకొనేందుకు భారీగా తరలివచ్చిన డ్వాక్రా మహిళలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..‘‘ఎన్నికలకు ముందు రైతుల రుణాలతో పాటు డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు అన్నారు. టీవీలు, వాల్‌పోస్టర్లలో పదేపదే ఇవే చెప్పారు. ‘బ్యాంకులోని బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి. రుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే బాబు రావాలి. జాబు కావాలంటే బాబు రావాలి. జాబురాని వారికి నెలకు 2 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం’ అంటూ ప్రచారం చేశారు. తన సంతకంతో కూడిన కరపత్రాలను చంద్రబాబు తన కార్యకర్తలతో ఇంటింటికీ పంపిణీ చేయించారు. గోడల మీద రాతలు రాయించారు. కానీ ఇచ్చిన మాటలు ఒక్కటీ నిలుపుకోలేదు. చంద్రబాబు రుణమాఫీ చేస్తారని 5-6 నెలలుగా మహిళలు బకాయిలు చెల్లించలేదు. ఇప్పుడేమో వారిపై భారీగా వడ్డీ పడుతోంది. రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలు, బంగారు రుణాలపై 14 శాతం వడ్డీ పడింది. దీంతో రైతులకు అప్పులు తలకు మించిన భారంగా మారాయి’’ అని అన్నారు.
 
 రైతుల్లో ధైర్యం నింపేందుకే భరోసా యాత్ర
 
 ‘‘అప్పుల బాధ తాళలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలపై బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. దీంతోనే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతో పాటు రాష్ట్రంలోని రైతుల్లో ధైర్యాన్ని నింపేందుకే రైతు భరోసా యాత్ర చేపడుతున్నా. ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా ఒత్తిడి తెస్తాం’’ అన్నారు.
 
 రుణాలు మాఫీ చేయకపోతే బాబు ఇంటి ముందు కూర్చుంటాం
 
 జగన్: ఏం పేరు తల్లీ! ఏ ఊరు?
 మహిళ: సోనీబాయి సార్. బాపనపల్లి తండా.
 జగన్: నీకు డ్వాక్రా రుణం ఎంత ఉంది?
 సోనీబాయి: మా గ్రూపులో 19 మంది ఉన్నాం సార్. తలా 27 వేల రూపాయలు తీసుకున్నాం. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అవుతాయంటే ఎన్నికలకు ముందు నిజంగా ఆశపడ్డాం. ఓట్లేశాం. ఇప్పుడు మాఫీ చేయలేమంటున్నారు. మేం ఆర్నెల్లుగా డబ్బులు చెల్లించలేదు. ఇప్పుడు వడ్డీతో కలిపి చెల్లించాలని అంటున్నారు. పూర్తిగా మోసపోయాం. వానల్లేవు. పంటలు పండలేదు. ఎట్టా డబ్బులు తెచ్చి కట్టేది? పల్లె రఘునాథరెడ్డి భార్య ప్రచారానికి వచ్చి ‘చంద్రబాబును గెలిపిస్తే రుణాలన్నీ మాఫీ అవుతాయి’ అని చెప్పింది. ఇప్పుడు ఎట్టా చేసేది? రుణాలు మాఫీ కాకపోతే పల్లె రఘునాథరెడ్డి ఇంటితో పాటు సీఎం ఇంటిముందు కూర్చుంటాం.
 
 కనిపిస్తే ఎంగిలి మూస్తా
 
 జగన్: ఏం పేరు అవ్వా? ఏ ఊరు?
 వృద్ధురాలు: నారాయణమ్మ బాయి అయ్యా! మాది బాపనపల్లి తండా.
 జగన్: డ్వాక్రా రుణాలు తీసుకున్నావా? మీకు ఎంత అప్పు ఉంది?
 నారాయణమ్మ బాయి: మా గ్రూపులో 4 లక్షల రూపాయలు తీసుకున్నాం. నేను 40 వేలు తీసుకున్నా. మాఫీ అవుతాయని అనుకుంటే కాలేదు. ఇప్పుడేమో వడ్డీతో సహా బాకీ చెల్లించాలని అంటుండారు. బాగా ఇబ్బంది పడతాండాం. బోర్లో నీళ్లు లేవు. పంట పండలేదు. పనుల్లేవు. బతకడానికే ఇబ్బందిగా ఉంది.
 జగన్: ఉపాధి పనులు లేవా అవ్వా?
 నారాయణమ్మ: కరువు పని లేదయ్యా. ఏం పనులూ లేక చేతికి చిల్లగవ్వ రావడం లేదు. కొంతమంది బతికేందుకు వేరే ఊళ్లకు వలస పోతాండారు. మోసం చేసినాడు. ఏం చేద్దాం! చంద్రబాబు కన్పిస్తే ముఖాన తుపుక్కని ఎంగిలి మూస్తా.
 
 హడావుడిగా పరిహారం పంపిణీ
 శింగనమల: అనంతపురం జిల్లా శింగనమల మండలం లోలూరులో అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు గోవిందరెడ్డి కుటుంబ సభ్యులకు సోమవారం సాయంత్రం ప్రభుత్వ విప్ యామిని బాల, అధికారులు పరిహారం చెక్కును అందజేశారు. బాధిత రైతు కుటుంబాన్ని మంగళవారం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్న నేపథ్యంలో వారు హడావుడిగా పరిహారం పంపిణీ చేశారు. రైతు గోవిందరెడ్డి భార్య అనుసూయమ్మకు రూ.3.50 లక్షల చెక్కును అందజేశారు. రూ.1.50 లక్షలు అప్పుల వారికి చెల్లించనున్నట్లు యామిని బాల తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు సుధామణి, ఎంపీడీవో సరోజినీదేవి తదితరులు పాల్గొన్నారు.
 
 మోసపోయాం సార్
 
 జగన్: ఏం పేరు తల్లీ?
 మహిళ: షాహిదాబేగం సార్.
 జగన్: డ్వాక్రా రుణం మీ గ్రూపు ఎంత తీసుకుంది? మీరు వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నారు?
 షాహిదా: మా గ్రూపునకు 5 లక్షల రూపాయలు ఇచ్చారు సార్. నాకు రూ.50 వేలు వచ్చింది.
 జగన్: చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు?
 షాహిదా: డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పాడు. మేం కూడా ఆశపడ్డాం. రుణాలన్నీ మాఫీ అవుతాయని చాలామంది చంద్రబాబుకు ఓట్లేశారు. తీరా ఇప్పుడు సీఎం అయిన తర్వాత  ‘రుణాలు మాఫీ చేసేందుకు వీలుకాదు.. ఆర్థిక సమస్యలున్నాయి.. మీకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు మహిళా సాధికార సంస్థను ఏర్పాటు చేస్తా’ అంటున్నాడు. ఎన్నికలకు ముందు ఒకమాట, ఇప్పుడు ఒకమాట చెబుతున్నాడు. బాబు వైఖరితో నిలువునా మోసపోయాం సార్.
 
 అన్నీ అబద్ధాలని ఇప్పడు తెలిసింది
 మా గ్రూపులో పదిమంది ఉన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే రుణాలన్నీ మాఫీ అవుతాయని అందరం సంబరపడ్డాం. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మా ఇళ్లకు వచ్చి కరపత్రాలు ఇచ్చారు. ఓట్లప్పుడు ఎప్పుడు టీవీ పెట్టినా రుణాలన్నీ మాఫీ చేస్తామనే వచ్చింది. డబ్బులు కట్టొద్దని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడేమో మాఫీ చేయలేదు. బ్యాంకోళ్లు మాత్రం వడ్డీతో కలిపి డబ్బులంతా కట్టాలంటున్నారు. వడ్డీ చానా పడింది. చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని ఇప్పుడు తెలిసింది. మీరు ముఖ్యమంత్రి అయితేనే మా కష్టాలు తీరతాయి సార్.        
 - సరస్వతి, కొత్తచెరువు
 
 దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు
 
 ‘అక్క చెల్లెళ్లందరికీ ఓ విన్నపం. ప్రస్తుతం ప్రభుత్వ వైఖరితో మీరు కష్టాల్లో ఉన్నారు. కష్టాలు అందరికీ వస్తాయి. దయచేసి ఎవ్వరూ ప్రాణాలు తీసుకోవద్దు. ధైర్యంగా ఉండండి. కలసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. మీ తరఫున నేను పోరాడతా. త్వరలోనే మంచి రోజులు వస్తాయి’’ అని మహిళలకు జగన్ ధైర్యం చెప్పారు. ప్రభుత్వ వైఖరితో ఎలా నష్టపోయారో చెప్పాలని మహిళలకు సూచించారు. దీంతో పలువురు మహిళలు ఎన్నికలకు ముందు తాము ఎలా ఆశపడ్డామో, ఇప్పుడు ఎలా మోసపోయామో వివరించారు. రెండోరోజు యాత్రలో జగన్ వెంట రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త సోమశేఖరరెడ్డి, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శ్రీధర్‌రెడ్డి, కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతవెంకట్రామిరెడ్డి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంక ట్రామిరెడ్డి, జిల్లా నేత చవ్వా రాజశేఖరరెడ్డి తదితరులున్నారు. అంతకుముందు జగన్‌ను వైఎస్సార్ జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు కలసి మాట్లాడారు.
Share this article :

0 comments: