రాజధాని రైతుల్లో నూతనోత్సాహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజధాని రైతుల్లో నూతనోత్సాహం

రాజధాని రైతుల్లో నూతనోత్సాహం

Written By news on Monday, February 23, 2015 | 2/23/2015

గుంటూరు సిటీ : రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వాలని భావించినవారంతా ఇప్పటికే ఇచ్చేశారు. ఇవ్వలేమని ఆది నుంచి చెపుతున్న రైతుల్లో ప్రస్తుతం నూతన  ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అంతేకాదు వైఎస్సార్ సీపీ అండతో ఎలాంటి ఆందోళనకైనా సిద్ధమని పేర్కొంటున్నారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షం సోమవారం రాజధాని గ్రామాలకు తరలివస్తున్న నేపథ్యంలో జరీబు రైతులు తమ భూములు ఇచ్చేది లేదని ముక్తకంఠంతో చెపుతున్నారు.
 
 అధికారులు చెప్పిన ప్రకారం రాజధాని  ప్రతిపాదిత గ్రామాల్లో ఇప్పటివరకు 23వేల ఎకరాల భూములను సమీకరించారు. ఇప్పుడు బంగారం పండే జరీబు భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ఎత్తులు వేస్తోంది. కొత్త ప్యాకేజీలతో ముందుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. రైతులను లొంగదీసుకునే దిశగా కుయుక్తులు పన్నుతోంది. ఈ అంశాన్నే వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తోంది. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదనీ, ఇవ్వబోమని చెపుతున్న రైతుల భూములను మాత్రం లాక్కోవద్దని గట్టిగా వాదిస్తోంది. అంతేకాక అక్కడి రైతులు,కౌలు రైతులు, కూలీలు, వ్యవసాయాధారిత కుటుం బాల సంక్షేమం కోసం మొదటి నుంచి అలుపెరుగని పోరాటం చేస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) స్వయంగా అక్కడి రైతుల పక్షాన నిలబడి పోరాటానికి నాయకత్వం వహించారు.
 
 వైఎస్సార్‌సీపీ పోరాట ఫలితమే...
 వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని గ్రామాల పరిస్థితులు , రైతుల దుస్థితి, ప్రభుత్వ దమననీతిని గమనించి దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు రాజధాని రైతుల,రైతు కూలీల హక్కుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి బాధిత రైతులకు అండగా నిలిచింది. బెంగపడొద్దని భరోసా ఇచ్చింది. ఈ కమిటీ సాగించిన పోరాట ఫలితంగా జరీబు భూములు మిగిలాయి. లేకుంటే ఇప్పటికే వాటిని కూడా ప్రభుత్వం గుటకాయ స్వాహా చేసి ఉండేదని స్వయంగా రాజధాని ప్రాంత రైతులే వ్యాఖ్యానిస్తున్నారు.
 
 ఆఖరి దశకు చేరిన ఆందోళన...
 ప్రస్తుతం అక్కడి పరిస్థితి ప్రభుత్వం వర్సెస్ వైఎస్సార్ సీపీ అండగా జరీబు రైతాంగం అన్నట్టుగా స్పష్టమవుతోంది. ఈ ఆందోళన ఆఖరి దశకు చేరింది. ఆరు నూరైనా భూములు గుంజుకోవాలన్నది ప్రభుత్వ పన్నాగం. ఆందోళన తీవ్రతరం చేసైనా ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలన్నది వైఎస్సా ర్ సీపీ ఆలోచన. ఈ నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఆ పార్టీ శాసనసభా పక్షం రాజధాని పర్యటనకు రానుండడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు శాసనసభా పక్షం రాకపై మంగళగిరి ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
 
 విజయవంతం చేయండి ....
 వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం పార్టీ శాసన సభాపక్షం రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తుంది. రైతులు, కౌలురైతులు, కూలీలు, వ్యవసాయాధారిత కుటుంబాల బాధలను సావధానంగా ఆలకిస్తుంది. వారి సమస్యలను స్వయంగా సమీక్షిస్తుంది. జరీబు భూముల్లో పంటలను పరిశీలిస్తుంది. వారి ఆందోళనకు అండగా నిలుస్తుంది.
 
 అసెంబ్లీలో వారి గొంతుకై ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నేతలే కాక జిల్లా నలుమూలల నుంచి కూడా రైతు పక్షపాతులు తరలి రావాలి. శాసనసభాపక్షం పర్యటనను జయప్రదం చేయడం ద్వారా రాజధాని ప్రాంత రైతులు, కౌలు రైతులు, కూలీలు, స్థానిక ప్రజలకు తమ సంఘీభావం ప్రకటించాలి.
 - మర్రి రాజశేఖర్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
 
 ఏర్పాట్లు పూర్తి..
 తాడికొండ : రాజధాని గ్రామాలలో సోమవారం వైఎస్సార్ సీపీ శాసన సభాపక్షం పర్యటన  దృష్ట్యా అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. తుళ్లూరులో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని పేరుతో ప్రభుత్వం రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. రైతులకు ఇస్తామన్న ప్యాకేజీపై ఇప్పటివరకు స్పస్టత లేదని తెలిపారు. రైతు కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని పేర్కొన్నారు. భూములు ఇవ్వలేమని అంటున్న రైతులను ప్రభుత్వం బెదిరించడం సమంజసం కాదని చెప్పారు. ఈ సమస్యలపై రైతులకు వెన్ను దన్నుగా ఉండేందుకు వైఎస్సార్ పార్టీ నడుంబిగించినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలంతా రాజధాని గ్రామాలకు వస్తున్నట్టు తెలిపారు. ఆ తరువాత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతులకు సరైన న్యాయం జరిగేలా చూస్తారని తెలిపారు.
 
 మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ రాజధాని రైతుల సమస్యలపై వైఎస్సార్ సీపీ తొలినుంచి పోరాడుతూనే ఉందన్నారు. రైతుల హక్కులను కాపాడేందుకే పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలంతా పర్యటనకు వస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్‌కుమార్ మాట్లాడుతూ శాసనసభాపక్ష సభ్యులు తొలుత తుళ్లూరులోని చెరువు వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి పర్యటన ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు బండారు సాయిబాబు, ప్రచార కార్యదర్శి శ్యామ్, మండలస్థాయి నాయకులు నాయుడు నాగేశ్వరరావు, బత్తుల కిశోర్, కొమ్మినేని కృష్ణారావు, వెంకటశివారెడ్డి, నందిగం సురేష్, చిన వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this article :

0 comments: