నేటి నుంచి ‘అనంత’లో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుంచి ‘అనంత’లో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర

నేటి నుంచి ‘అనంత’లో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర

Written By news on Sunday, February 22, 2015 | 2/22/2015


రైతన్న వెన్ను తట్టేందుకే..
నేటి నుంచి ‘అనంత’లో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర 

 సాక్షి, హైదరాబాద్: నిరంతర కరువు, ఆర్థిక ఇబ్బందులకుతోడు అప్పుల బాధ, ప్రభుత్వ నిరాదరణ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబాల్లో స్థైర్యం నింపడానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ‘రైతు భరోసా యాత్ర’ అనంతపురం జిల్లాలో ఆదివారం ప్రారంభం కానుంది. గత శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రకటించిన మేరకు జగన్ ఆదివారం నుంచి జిల్లాలో పర్యటిస్తూ.. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా ఆయన ఆదివారం బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు మీదుగా లేపాక్షి మండలంలోని మామిడిమాకులపల్లికి చేరుకుంటారు.

గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న వెనుకబడిన వర్గాలకు చెందిన రైతు కురుబ సిద్ధప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం అక్కడినుంచి హిందూపురానికి చేరుకుంటారు. సాయంత్రం 5గంటలకు హిందూపురంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. తర్వాత పుట్టపర్తి నియోజకవర్గంలోని చెన్నకేశవపురంలో రాత్రికి బసచేస్తారు. 23న పుట్టపర్తి, 24న ఉరవకొండ, శింగనమల, 25, 26 తేదీల్లో గుంతకల్లు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. ఐదురోజులపాటు సాగే ఈ తొలివిడత యాత్రలో 13 రైతు కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని మరుకుంటపల్లి, కొత్తకోటలో ఆత్మహత్య చేసుకున్న కురబకేశప్ప, సురేంద్ర కుటుంబాలను సోమవారం పరామర్శించనున్నారు.

 జగన్ యాత్రతో ప్రభుత్వంలో కదలిక..
 కరువు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల కారణంగా రైతులు, కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని శాసనసభ గత సమావేశాల్లో జగన్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడినవారి జాబితాను కూడా  సమర్పించారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన రాలేదు. బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉందని, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేసినా స్పందించలేదు. సీఎం చంద్రబాబు ఒక సందర్భంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు ఆత్మహత్యలే లేవన్నారు.
అసెంబ్లీ వేదికగా జగన్ నిలదీయడంతో ఎవరైనా ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం సమాధానమిచ్చారు. ప్రభుత్వానికి తెలియజెప్పేలా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తానని జగన్ అసెంబ్లీలోనే ప్రకటించారు. రైతు కుటుంబాల వారిని పరామర్శించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను తెలుసుకుని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ముందుంచుతానని చెప్పారు. ఆ మేరకు రైతు భరోసా యాత్రను ప్రకటించడంతో ప్రభుత్వం హడావుడిగా ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు సహాయాన్ని అందించే జీవోను జారీ చేసింది.

 ప్రభుత్వం పట్టించుకోనందునే ఆత్మహత్యలు: అనంత వెంకట్రామిరెడ్డి
 కరువుతో అల్లాడుతున్న రైతులను రాష్ట్రప్రభుత్వం పట్టించుకోనందువల్లే అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చేస్తానన్న రుణమాఫీ ఊసే లేకపోవడం ప్రధానంగా రైతులను కుంగదీసిందన్నారు. పంటలు పండించే అవకాశం లేక రైతులు స్వయంగా వలస వెళ్లడం ప్రారంభించారని, అనంతపురం జిల్లా నుంచి మూడున్నర లక్షలమంది ఇతర ప్రాంతాలకు వలస పోయారని ఆయన ‘సాక్షి’కి వివరించారు.
నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న రైతులకు ప్రభుత్వ ఆదరణ పూర్తిగా కొరవడిందన్నారు. కుటుంబపెద్దను కోల్పోయిన రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పడంతోపాటుగా నిరాశలో ఉన్నవారికి భరోసా కల్పించేందుకు జగన్ యాత్ర ఉపకరిస్తుందని జిల్లా ప్రజలు గట్టిగా నమ్ముతున్నామని ఆయన అన్నారు. జగన్ యాత్రపై విమర్శలు చేసే మంత్రులకు సిగ్గుండాలని, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే జగన్ తానున్నానని రైతుల పక్షాన నిలబడుతున్నందుకు స్వాగతించాల్సిందిపోయి విమర్శించడం శోచనీయమన్నారు.
Share this article :

0 comments: