వైఎస్‌ఆర్‌సీపీ పోరుపథం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్‌సీపీ పోరుపథం

వైఎస్‌ఆర్‌సీపీ పోరుపథం

Written By news on Friday, February 6, 2015 | 2/06/2015


వైఎస్‌ఆర్‌సీపీ పోరుపథం
సాక్షి, ఖమ్మం: నూతన రాష్ర్టంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజా సమస్యలపై ఉద్యమ బాట పట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇంకా అర్హులకు అందని పింఛన్లు, ఆహార భద్రత కార్డులు తదితర ప్రజా సమస్యలపై ఉద్యమ బాట పట్టాలని పార్టీ నేతలు నిర్ణయించారు. సంక్షేమ పథకాలు అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సంకల్పించారు. అర్హుల పింఛన్లు కూడా ప్రభుత్వం తొలగించడంతో ఇప్పటికే వైఎస్సార్‌సీపీ జిల్లాలో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.

ఇంకా వేల మంది అర్హులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండడంతో వారికి భరోసానిచ్చేలా ప్రభుత్వంపై ఉద్యమించేందుకు కేడర్ కదం తొక్కేందుకు సమాయత్తమవుతోంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింతగా బలోపేతం చేసే దిశగా ముందుకెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. స్థానిక సంస్థలు, సార్వత్రిక, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కేడర్ కదం తొక్కడంతో అదే రీతిలో త్వరలో రానున్న ఖమ్మం కార్పొరేషన్  ఎన్నికలపై ఇప్పటి నుంచే కార్యకర్తలను కదిలించాలని పార్టీ యోచిస్తోంది. నెల వారీగా ఏ నిరసన కార్యక్రమాలు తీసుకోవాలో ఈ సమావేశంలో పొంగులేటి నేతృత్వంలో చర్చించనున్నారు. జిల్లాలో పార్టీ చేపట్టేబోయే కార్యక్రమాలు, పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేసేందుకు శుక్రవారం ఖమ్మంలోని ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఇందుకు వేదిక  అవుతోంది.

ఈ సమావేశానికి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. పార్టీ జిల్లా కేడర్‌కు పొంగులేటి భవిష్యత్ ఉద్యమ ప్రణాళికపై దిశానిర్దేశం చేస్తారు.
 పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా స్థాయి సమీక్ష చేస్తుండడంతో జిల్లా నలుమూలల నుంచి నేతలు భారీ ఎత్తున తరలిరావడానికి సిద్ధమయ్యారు.

ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో జిల్లా ప్రజల సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిర్వహించాల్సిన పోరాటాలపై చర్చించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, మండల పార్టీ కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సొసైటి చైర్మన్లు, డెరైక్టర్లు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: