‘రాజధాని’ రైతులపై నిఘా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘రాజధాని’ రైతులపై నిఘా!

‘రాజధాని’ రైతులపై నిఘా!

Written By news on Tuesday, February 10, 2015 | 2/10/2015


‘రాజధాని’ రైతులపై నిఘా!
అన్నదాతల ఫోన్ల ట్యాపింగ్
స్వయంగా రంగంలోకి దిగిన జాయింట్ కలెక్టర్
కృష్ణాయపాలెంలో రైతుల నుంచి భూ సమీకరణ పత్రాల సేకరణ


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంత రైతులను నిఘా నేత్రం వెన్నాడుతోంది. వారి కదలికలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. వారిని కట్టడి చేసేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతోంది. ప్రభుత్వానికి తమ భూమిని ఇవ్వబోమని నిరాకరిస్తున్న రైతులతోపాటు వారికి నాయకత్వం వహించే వారి ఫోన్లపై నిఘా పెట్టింది. వారి ఫోన్లను ట్యాప్ చేస్తోంది. గుంటూరు జిల్లాలో రాజధానికి ఎంపిక చేసిన గ్రామాల్లో గత కొద్ది రోజులుగా రైతుల నుంచి నిరభ్యంతర పత్రాలను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.

అయితే, రాజధానికి భూ సమీకరణను పూర్తిచేసేందుకు నిర్దేశించిన గడువు పూర్తవుతున్నా ఆశించిన స్పందన రావడం లేదు. దీంతో పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ రైతులతో చర్చలు జరిపారు. కొందరు అంగీకరించి తమ భూమి పత్రాలను అందచేశారు. కొందరు మాత్రం తమకు ప్రభుత్వం అందించే పరిహారం సరిపోదని.. ఆ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క దశలో ఆందోళనలకు సైతం దిగుతున్నారు.

దీంతో ఆందోళనలకు దిగిన రైతులతో పాటు వారికి నేతృత్వం వహించిన వారిపై ప్రభుత్వం నిఘా పెట్టింది. వారి కదలికలను ఎప్పటికపుడు తెలుసుకుంటోంది. వారి ఫోన్లపై నిఘా పెట్టి ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అనే అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుంటోంది. వెంటనే వారికి ఫోన్ చేసి మీరు ఫలానా వారికి ఫోన్ చేసి ఇంతసేపు, ఫలానా అంశాలను మాట్లాడారని రాజధాని భూ సమీకరణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న పెద్దలు చెబుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

గ్రామాల్లో తాము ఎవరినీ ఎలాంటి ఇబ్బందీ పెట్టకుండా సాధారణ జీవితం గడుపుతుంటే ఈ బెదిరింపులు, భయాందోళనలకు గురిచేయడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన మల్లెల హరీంద్రనాథ్ చౌదరి, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన కారుమంచి అనిల్, ఇంద్రనీల్ తదితరులతో పాటు చాలా మంది రైతులు భూమిని అప్పగించేందుకు విముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిడులు వచ్చినా భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో ఇలాంటి వారిని ఎంపిక చేసుకుని ప్రభుత్వం నిత్యం వెంటపడుతోంది.

కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన బోయపాటి సుధారాణి అనే మహిళ భూ సమీకరణపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో గుంటూరు జిల్లాకు చెందిన నిఘా విభాగం పోలీసులు కృష్ణాయపాలెం గ్రామంలో ‘ఆమె ఎవరు?’ అంటూ ఆరా తీశారు. 2 రోజుల క్రితం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ స్థానిక ఎమ్మార్వోను ఆమె నివాసానికి పంపి.. గుంటూరుకు పిలిపించుకున్నారు. గుంటూరులో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొంటున్న ఆయన.. సుధారాణి కలెక్టరేట్‌కు వచ్చిన విషయం తెలుసుకుని మధ్యలో లేచి వచ్చి ఆమెతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఏం జరిగిందో కానీ సోమవారం భూ సమీకరణకు సమ్మతిస్తూ ఆమె నిరభ్యంతర పత్రం ఇచ్చినట్టు సమాచారం.

ఈ నిరభ్యంతర పత్రం స్వీకరించేందుకు సోమవారం జాయింట్ కలెక్టర్ స్వయంగా కృష్ణాయపాలెం గ్రామానికి వచ్చారు. ఇప్పటి వరకూ డిప్యూటీ కలెక్టర్లు మాత్రమే ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇదిలావుండగా, ఆయా గ్రామాల్లో భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతుల ఆందోళనలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధుల ఫోన్లపైనా నిఘా అధికారులు పెట్టారు.
Share this article :

0 comments: