రుణమాఫీతో రైతులు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కోల్పోయారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రుణమాఫీతో రైతులు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కోల్పోయారు

రుణమాఫీతో రైతులు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కోల్పోయారు

Written By news on Friday, February 27, 2015 | 2/27/2015


‘మాఫీ’ మాయపై అసెంబ్లీలో నిలదీస్తా
- రుణమాఫీతో రైతులు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కోల్పోయారు
- రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా ‘ఉపాధి’ చూపడం లేదు
- ‘హంద్రీ-నీవా’ను తానే పూర్తి చేశానని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు
- రైతు సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తా
- ఐదోరోజు రైతు భరోసా యాత్రలో విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- ముగిసిన మొదటి విడత భరోసా యాత్ర


రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి:
‘ఎన్నికలకు ముందు ఒకమాట.. తర్వాత మరోమాట చెప్పి రైతులను చంద్రబాబు పూర్తిగా మోసం చేశారు. రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పారు. బాబు వైఖరితో బ్యాంకుల్లో అప్పు తీరకపోగా రైతులపై 14 శాతం అపరాధ వడ్డీ పడుతోంది. దీంతో రైతులు ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతుల కష్టాలు, ఆత్మహత్యలపై అసెంబ్లీలో చంద్రబాబు సర్కారును నిలదీస్తా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లాలో గురువారం ఐదో రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా పామిడి మండలం రామరాజుపల్లిలో రైతుల చర్చావేదిక నిర్వహించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.
‘‘రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ కావాలన్నా, బ్యాంకులోని బంగారం ఇంటికి రావాలన్నా.. జాబు కావాలన్నా.. బాబు రావాలన్నారు. జాబు లేకపోతే నెలకు 2 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన సీఎం అయ్యి తొమ్మిది నెలలవుతోంది. ఒక్క హామీని అమలు చేయలేదు. 87 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు ఉండేవి. ఇటీవల ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో 99 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని బ్యాంకర్లు చెప్పారు. అంటే వ్యవ సాయ రుణాలపై 12 వేల కోట్ల రూపాయల వడ్డీ భారం పడింది. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 4,600 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తామంటోంది. ఇది కనీసం వడ్డీకి కూడా సరిపోదు.

రాష్ట్రం కరువుతో అల్లాడుతున్నా ఉపాధి లేదు
రాష్ట్రంలో ఈ ఏడాది 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. కరువుతో రాష్ట్రం అల్లాడుతోంది. రుణమాఫీ పుణ్యమా అని ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరె న్స్ వచ్చే పరిస్థితి లేదు. పనుల్లేక ప్రజలు వలస బాట పట్టారు. అనంతపురం జిల్లా నుంచే కర్ణాటకకు నాలుగు లక్షల మంది వలస పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. అయినా ప్రభుత్వం ప్రజలకు ఉపాధి పనులు చూపడం లేదు. డ్వాక్రా రుణాల పరిస్థితి మరీ దారుణం.

రాయలసీమపై బాబుకు ప్రేమ లేదు
రాయలసీమపై తనకు చాలా ప్రేమ ఉందని చంద్రబాబు చెబుతున్నారు. ‘హంద్రీ-నీవా’ను తానే పూర్తి చేశానంటున్నారు. ఆయన సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో కేవలం 13 కోట్ల రూపాయలు విడుదల చేశారు. వైఎస్ సీఎం అయిన తర్వాత 5,800 కోట్ల రూపాయలు విడుదల చేసి 85 శాతం ప్రాజెక్టు పనులను పూర్తి చేశారు. కుళాయి తిప్పితే నీళ్లు వచ్చినట్లు వైఎస్ పూర్తి చేసిన ప్రాజెక్టుకు నీళ్లొస్తే ఆ ఘనత తనదే అని అబద్ధాలు చెబుతున్నారు.
రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు విషయంలోనైనా చంద్రబాబు చేసింది సున్నా. పల్లెల్లో పిక్ పాకెటింగ్ చేస్తే 420 కేసు పెడతారు. మరి అబద్ధాలు ఆడి ఏకంగా సీఎం అయిన చంద్రబాబుపై ఏ కేసు పెట్టాలి? ప్రజలను చంద్రబాబు ఒకసారి మోసం చేశారు. మళ్లీ మోసపోరు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి డిపాజిట్లు కూడా రావు. ఢిల్లీలో ఆప్‌కు 70 సీట్లకు 67 వచ్చినట్లు ఇక్కడా అవే ఫలితాలు వస్తాయి’’ అని చెప్పారు.

ఐదో రోజు రెండు కుటుంబాలకు పరామర్శ
ఐదో రోజు యాత్రలో జగన్ రెండు కుటుంబాలను పరామర్శించారు. పామిడి మండలం పి.కొండాపురం, రామరాజుపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతులు శివారెడ్డి (46), పుల్లారెడ్డి (64) కటుంబ సభ్యులను పరామర్శించి భరోసా ఇచ్చారు. ఆ కుటుంబాలకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. గురువారం ఐదో రోజుతో తొలి విడత రైతు భరోసా యాత్ర ముగిసింది. ఈ నెల 22న ప్రారంభమైన యాత్ర ఐదు రోజుల్లో ఐదు నియోజకవర్గాల్లో 781 కిలోమీటర్లు సాగింది.

ఆత్మహత్య చేసుకున్న 11మంది రైతుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. యాత్ర ముగిసిన అనంతరం హైదరాబాద్‌కు పయనమైన ఆయనకు ‘అనంత’ నేతలు జిల్లా సరిహద్దు వరకు వెళ్లి వీడ్కోలు పలికారు. యాత్రలో ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అత్తార్ చాంద్‌బాషా, ఎస్వీ మోహన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతవెంకట్రామిరెడ్డి, గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి, సీజీసీ సభ్యుడు గురునాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, తాడిపత్రి అదనపు సమన్వయకర్త రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: