అధైర్య పడొద్దు.. మీకు అండగా ఉంటా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధైర్య పడొద్దు.. మీకు అండగా ఉంటా

అధైర్య పడొద్దు.. మీకు అండగా ఉంటా

Written By news on Thursday, February 5, 2015 | 2/05/2015

  • మోరంపూడి రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు జగన్ భరోసా
  • ఏ అవసరమొచ్చినా అందుబాటులో ఉంటానని హామీ
  • కన్నీరుమున్నీరైన బాధితులు..
  • తమ ఆవేదనను జగన్‌తో పంచుకున్న ఆయా కుటుంబాలవారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘అధైర్యపడొద్దు.. నేను అండగా ఉంటాను.. ఏ అవసరమొచ్చినా మీకు అందుబాటులో ఉంటా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజమండ్రి మోరంపూడి జంక్షన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం.. బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇనపకోళ్ల దుర్గాప్రసాద్, శివనేని మహాలక్ష్మి, ర్యాలి వెంకన్న మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ విషాద ఘటనను తెలుసుకుని చలించిపోయిన జగన్ ఆ కుటుంబాల వారిని పరామర్శించేందుకు బుధవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు.
మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో రాజమండ్రి మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్ రాజమండ్రి, కరప మండలాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు. మోరంపూడి రోడ్డు ప్రమాదంలో ఏడోతరగతి చదువుతున్న దుర్గాప్రసాద్ మృతిచెందగా, బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి తల్లి విజయలక్ష్మిని జగన్ పరామర్శించారు. తామంతా అండగా ఉన్నామంటూ భరోసానిచ్చారు. వైద్యులనడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.

విజయలక్ష్మి చేయి, తల, కాళ్లకు శస్త్రచికిత్స చేసినట్టు తెలుసుకుని చలించిపోయారు. జగన్‌ను చూడగానే విజయలక్ష్మికి దుఃఖం కట్టలుతెగింది. ఆమెను అనునయిస్తూ ‘మీకు వెన్నంటి ఉంటామమ్మా’ అని జగన్ ధైర్యం చెప్పారు. విజయలక్ష్మి త్వరగా కోలుకునేందుకు కావాల్సిన చికిత్స విషయంలో ఎలాంటి లోపం రాకుండా చూడాలని వైద్యులను కోరారు. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వెన్నెముక దెబ్బతిన్న విజయలక్ష్మి భర్త శ్రీనివాసరావును మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలించినట్టు వైద్యులు తెలపగా.. అక్కడ ఏ ఆసుపత్రిలో చేర్పించేది తనకు సమాచారమందిస్తే అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యమందేలా చూస్తానని జగన్ చెప్పారు.
 
వెంకన్న కుటుంబానికి పరామర్శ..

అనంతరం రాజమండ్రి గోరక్షణపేటలో ర్యాలి వెంకన్న కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. వెంకన్న తల్లి నాగరత్నం, భార్య వరలక్ష్మి, కుమారుడు మహేష్, కుమార్తె హేమలత తదితర కుటుంబ సభ్యులను పేరుపేరునా పలకరించగా వారంతా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. వడ్రంగం పనిచేసే వెంకన్న ఆరోగ్యం సహకరించక మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడని, వెంకన్న మృతితో ఆధారం కోల్పోయామంటూ వారు బావురుమన్నారు. అద్దె ఇంటిలో ఉంటున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. వెంకన్న పాతచిత్రాలు చూసి జగన్ కళ్లు చెమర్చాయి. ‘‘మీరు అధైర్యపడకండి, మా నాయకులు జ్యోతుల నెహ్రూ, ఆదిరెడ్డి అప్పారావు మీకు అండగా నిలుస్తా’’రని జగన్ వారికి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం మనం ప్రతిపక్షంలో ఉన్నామని అంటూ.. సబ్ కలెక్టర్‌తో మాట్లాడి స్థలం వచ్చే ఏర్పాటు చేస్తారని తెలిపారు.  
 
ఫ్లై ఓవర్ నిర్మాణానికి కృషి చేస్తా..

తర్వాత జగన్ కరప మండలం కూరాడ వెళ్లి శివనేని మహాలక్ష్మి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మహాలక్ష్మి కుమారులు సత్యనారాయణ, నారాయణరావుతోపాటు కుటుంబసభ్యులను పేరుపేరునా పలకరించారు. మృతురాలి మనవరాలు శిరీష మాట్లాడుతూ.. మోరంపూడి జంక్షనంటే భయమేస్తోందని, తమ కుటుంబసభ్యులు ఇద్దరు అక్కడే ప్రమాదంలో మృతి చెందారంటూ కన్నీరుమున్నీరైంది. తమ పరిస్థితి మరొకరికి రాకుండా చూడాలని కుటుంబ సభ్యులన్నారు. జగన్ స్పందిస్తూ ఆ జంక్షన్ వద్ద జరిగే ప్రమాదాలను ప్రభుత్వదృష్టికి తీసుకెళ్లి ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషిచేస్తానని హామీఇచ్చారు. బాధితులకు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయమందేలా అన్నిరకాలుగా ప్రయత్నిస్తానన్నారు.
 
పార్టీ నేతలకు పరామర్శ..  

ఇదిలా ఉండగా వేమగిరిలో మాతృవియోగంతో బాధపడుతున్న పార్టీ నాయకుడు రావిపాటి రామచంద్రరావు, వేంకటేశ్వరరావుల కుటుంబాన్ని ప్రతిపక్ష నేత జగన్ పరామర్శించారు. వారి తల్లి గంగాభవాని చిత్రపటానికి నివాళులర్పించారు. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె తనను ఆత్మీయంగా పలకరించారని గుర్తు చేసుకున్నారు. అనారోగ్యంతో కాకినాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు భార్య వెంకటలక్ష్మిలను కూడా వైఎస్సార్‌సీపీ అధినేత పలకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
 
మరోవైపు కాకినాడలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుమార్తె వివాహవేడుకలకు హాజరైన జగన్.. వధూవరులు అంజని, హర్షవర్ధన్‌రెడ్డిలను ఆశీర్వదించారు. నగరంలోని ఒక ఆస్పత్రిలో ఇటీవల జన్మించిన పెద్దాపురం పార్టీ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు రెండో కుమారుడిని జగన్ ఆశీర్వదించారు. అనంతరం రాజమండ్రి చేరుకుని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో రాత్రి బస చేశారు.

ఈ పర్యటనలో జగన్ వెంట పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, ప్రసాదరాజు, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, అమలాపురం, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ నాయకులు పినిపే విశ్వరూప్, చలమలశెట్టి సునీల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జక్కంపూడి రాజా, కొల్లి నిర్మల కుమారి తదితరులున్నారు.
 
వైభవంగా ద్వారంపూడి కుమార్తె వివాహ రిసెప్షన్

కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుమార్తె అంజని, హర్షవర్ధన్‌రెడ్డిల వివాహ రిసెప్షన్ బుధవారం రాత్రి  తూర్పుగోదావరి జిల్లా కాకినాడ భాస్కరపద్మ కల్యాణ మండపంలో వైభవంగా జరిగింది. రిసెప్షన్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు ముఖ్యనేతలు, అధికారులు, అనధికారులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వైఎస్సార్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ జ్యోతుల నెహ్రూ, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, సాక్షి డెరైక్టర్ కె.ఆర్.పి.రెడ్డి సహా పలువురు ప్రముఖులు రిసెప్షన్‌కు విచ్చేశారు. అలాగే శాసనమండలిలో ప్రభుత్వ విప్ కె.వి.వి.సత్యనారాయణరాజు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వేడుకకు హాజరయ్యారు.
Share this article :

0 comments: