జగన్ రైతు దీక్ష విజయవంతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ రైతు దీక్ష విజయవంతం

జగన్ రైతు దీక్ష విజయవంతం

Written By news on Monday, February 2, 2015 | 2/02/2015

సంఘీభావంగా రాష్ట్రం నలుమూలల నుంచీ తరలివచ్చిన జనం
పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు
జగన్‌ను కలిసి తమ కష్టాలు వివరించిన రైతులు, డ్వాక్రా మహిళలు
అన్ని సమయాల్లోనూ అండగా ఉంటానంటూ ప్రతిపక్ష నేత భరోసా


రైతు దీక్షా శిబిరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రజా సమస్యలను విస్మరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజల్లో ఎండగట్టడానికి ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పాటు నిర్వహించిన రైతు దీక్ష విజయవంతమైంది. శని, ఆదివారాలు రెండు రోజుల పాటు సాగిన ఈ దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ప్రధానంగా రైతులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని దీక్షకు సంఘీభావం తెలియజేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను జగన్ ఒక్కొక్కటిగా విడమరిచి చెబుతున్నప్పుడు వారంతా శ్రద్ధగా విన్నారు.

ప్రభుత్వ వైఖరిని ఎండగట్టి ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగుతాయని చెప్పినప్పుడు హర్షధ్వానాలతో వేదిక ప్రాంగణం మారుమోగింది. ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వంపై పోరాటం చేయడానికి ముందుకొచ్చిన జగన్‌ను చాలామంది అభినందించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రెండు రోజుల పాటు సాగిన నిరాహార దీక్ష సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలు ఒక్కొక్కరుగా ఆయనతో కలచాలనం చేసి వారు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. వారు చెబుతున్న విషయాలను శ్రద్ధగా విన్న జగన్‌మోహన్‌రెడ్డి అన్ని సమయాల్లోనూ అండగా ఉంటాననీ గుండె నిబ్బరం కోల్పోవద్దని వారికి భరోసా కల్పించారు.

స్వచ్ఛందంగా తరలివచ్చిన
రైతులు, మహిళలు...
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టిన ఈ రైతు దీక్షకు శని, ఆదివారం రెండు రోజులు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో పార్టీ శ్రేణులు, రైతులు, డ్వాక్రా మహిళలు, యువకులు, కళాశాల విద్యార్థులు దీక్షా స్థలికి చేరుకున్నారు. దీక్షా శిబిర ప్రాంతం ఉదయం 9 గంటలకే జనంతో కిక్కిరిసిపోయింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి రైతులు, డ్వాక్రా మహిళలు స్వచ్ఛందంగా ఆటోలు, ట్రాక్టర్లలో తరలిరావడం కనిపించింది.

జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ప్రారంభించే సమయానికి ముందే పెద్ద ఎత్తున అక్కడి చేరుకున్న డ్వాక్రా మహిళలు, రైతులు యువనేతకు సంఘీభావాన్ని తెలిపారు. వెన్నంటి ఉండి ఉద్యమ పథంలో సాగుతామని వేలాది మంది రైతులు స్పష్టం చేశారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీలను ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కేసారని వైఎస్ జగన్ అన్నపుడల్లా రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. చేతులు పెకైత్తి యువనేతకు మద్దతుగా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రుణ మాఫీ అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వ వైఖరిపై డ్వాక్రా మహిళలు, రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

జగన్ ప్రసంగానికి అద్భుత స్పందన...
ఎన్నికల హామీలతో రాష్ట్ర ప్రజలను, రైతాంగాన్ని మోసగించిన బాబు సర్కారుపై పోరు ఆగదని యువనేత జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించిన సందర్భంలో శిబిరంలోని జనం నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం లభించింది. రైతు దీక్ష ఆవశ్యకతను వివరించి, ప్రభుత్వ తీరును ఎండగట్టిన జగన్ ప్రసంగం ఆధ్యంతం స్ఫూర్తిదాయకంగా సాగి దీక్షా శిబిరాన్ని వేడెక్కించింది. ప్రసంగంలోని ప్రతి అంశం ప్రజలందరినీ ఆలోచింపజేసేలా వివరించారు. హైదరాబాద్‌లో ఉంటూ అక్కడే పాన్‌కార్డు, ఆధార్ కార్డు ఉన్న చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా కొనసాగేందుకు ఏ విధంగా అర్హుడని వైఎస్ జగన్ ప్రశ్నించినపుడు, నమ్మి ఓటేసిన డ్వాక్రా మహిళలకు  తీవ్ర అన్యాయం జరిగిందన్నపుడూ రైతులు, డ్వాక్రా మహిళలు హర్షధ్వానాలతో మారుమోగింది.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాశాలల విద్యార్థులు, యువకులు యువనేత జగ న్‌ను కలిసి వెన్నంటే ఉంటామని చెప్పారు. దీక్షా శిబిరంలో ప్రవేశించి యువనేతతో కరచాలనం చేయాలని ఒక్కసారిగా రైతులు, యువకులు ముందుకెళ్లడంతో కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. రైతు దీక్ష ముగిసే వరకూ జనం శిబిరం ప్రాంతం నుంచి కదలకపోవడంతో రహదారిపై రెండు కిలోమీటర్ల వరకూ వాహనాలు నిలిచిపోయాయి.

కన్నీళ్లు తుడుస్తానని.. కారం కొట్టాడు
మా గ్రూపు మొత్తం కలిసి రూ. 2 లక్షల రుణం తీసుకున్నాం. ఇంకా రూ.72 వేలు కట్టాలి. చంద్రబాబు రుణమాఫీ చేస్తానన్నాడని కట్టలేదు. బంగారం బ్యాంక్‌లో పెట్టి మరీ పిల్లలని చదివించుకుంటున్నాం. డ్వాక్రా, బంగారు రుణాలు మాఫీ చేస్తాడని నమ్మి ఓట్లేశాం. మా కళ్లలో కన్నీళ్లు చూడడం తప్ప ఏమీ చేయలేదు. చంద్రబాబుని నమ్మినందుకు మాకు బాగా బుద్ధి చెప్పాడు. ఇప్పుడు మేం వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకే వైఎస్ జగన్ రైతుదీక్షకు మద్దతు ఇవ్వడానికి వచ్చాం.
-తానుకొండ రత్నకుమారి, డ్వాక్రా మహిళ, అత్తిలి మండలం, తాలురుపాలెం

బాబు నయవంచకుడు
సీఎం చంద్రబాబు ఒక నయవంచకుడు. రుణమాఫీ చేస్తానని పదేపదే చెప్పడంతో నమ్మి.. ఓటేశా. దానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నా. మాది కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం పెనమలూరు. నాకు 4 ఎకరాల భూమి ఉంది. రూ.50 వేల వరకు బ్యాంకు అప్పు ఉండగా, తొలిదశ రుణమాఫీ జరిగిందంటే బ్యాంకుకు వెళ్లా. నాకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. ఇదేంటని బ్యాంకు అధికారులను అడుగుతున్నప్పటికీ రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రుణమాఫీ కాదని తెలిసి పశ్చాత్తాప పడుతూ రైతుల కోసం దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా వచ్చా. రుణమాఫీ అనేది బాబు చేసిన మాయ మాత్రమే.
- గండ్రు పరమేశ్వరరెడ్డి, రైతు, పెనమలూరు గ్రామం, ఉయ్యూరు మండలం, కృష్ణాజిల్లా

రుణం.. వడ్డీ తడిసి మోపెడైంది
సీఎం చంద్రబాబు రుణమాఫీ చేస్తామన్నారు. అయినప్పటికీ మాఫీ కాలేదు. రుణం, వడ్డీ కలిపి ఇప్పుడు తడిసిమోపెడైంది. బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. అయితే చంద్రబాబు మాత్రం రుణమాఫీ చేస్తాం.. కట్టవద్దని చెప్పారు. 5వ తరగతి చదివితే సైకిల్ ఇస్తామని, 10వ తరగతి చదివితే ఉద్యోగం ఇస్తామని టీడీపీ వాగ్దానం చేసింది. ఎక్కడ ఇచ్చారు?. ఎవరికీ పింఛను కూడా ఇవ్వడం లేదు.  
- రాములమ్మ(గిరిజన మహిళ), తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురం గ్రామం

గన్నవరంలో వైఎస్ జగన్‌కు వీడ్కోలు
సాక్షి, విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల రైతు దీక్ష నిర్వహించి హైదరాబాద్‌కు తిరుగుపయనమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ నేతలు ఆదివారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. జగన్ దీక్ష ముగించుకుని రోడ్డు మార్గాన కృష్ణా జిల్లా గన్నవరం చేరుకున్నారు. అక్కడినుంచి విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు.

పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, కోన రఘుపతి, మహ్మద్ ముస్తాఫా, పార్టీ నేతలు కొలుసు పార్థసారథి, కొత్తపల్లి సుబ్బారాయుడు, వంగవీటి రాధాకృష్ణ, తలశిల రఘురామ్, మర్రి రాజశేఖర్, ఆళ్ల నాని, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, సామినేని ఉదయభాను, గౌతమ్ రెడ్డి, దుట్టా రామచంద్రరావు, ఉప్పాల రాంప్రసాద్, దూలం నాగేశ్వరరావు, అన్నాబత్తుని శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జగన్‌తో పాటు పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆర్.ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డ్డి తదితరులు హైదరాబాద్‌కు వెళ్ళారు.
Share this article :

0 comments: