బాబు వచ్చాక రుణాలు మాఫీ కాలేదు.. పైగా వడ్డీ తడిసి మోపెడైంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు వచ్చాక రుణాలు మాఫీ కాలేదు.. పైగా వడ్డీ తడిసి మోపెడైంది

బాబు వచ్చాక రుణాలు మాఫీ కాలేదు.. పైగా వడ్డీ తడిసి మోపెడైంది

Written By news on Monday, February 23, 2015 | 2/23/2015

* వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు
హామీలు నెరవేర్చని ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు
* అనంతపురం జిల్లాలో తొలి విడత ‘రైతు భరోసా యా
త్ర’ ప్రారంభం
రుణమాఫీ అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్నో ఆశలు చూపారు..
కానీ బాబు వచ్చాక రుణాలు మాఫీ కాలేదు..  పైగా వడ్డీ తడిసి మోపెడైంది
రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది
ఫలితంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు
రాష్ట్రవ్యాప్తంగా వందమందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
ఆత్మహత్య చేసుకున్నవాళ్లను కూడా ప్రభుత్వం కనీసం గుర్తించడం లేదు
రుణమాఫీ పుణ్యమా అని రైతులు బీమా, ఇన్‌పుట్ సబ్సిడీని కోల్పోయారు
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని బాబు విస్మరించారు
తోలుమందం బాబుపై ఎంత ఒత్తిడి తెచ్చినా రైతుల బాధలు పట్టడం లేదు
హిందూపురం సభలో నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత
హంద్రీ-నీవా, గాలేరు-నగరి పనులు చేపట్టిన ఘనత వైఎస్‌దేనని ఉద్ఘాటన
అనంతపురం జిల్లాలో ఆరంభమైన తొలివిడత ‘రైతు భరోసా యాత్ర’

(రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి): ‘‘ఎన్నికలకు ముందు పంట రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నారు. బాబు వస్తే బ్యాంకు నుంచి బంగారం ఇంటికి వస్తుందన్నారు. అప్పు మొత్తం మాఫీ అవుతుందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. లేదంటే 2 వేల రూపాయల నిరుద్యోగభృతి ఇస్తామన్నారు. ఇవన్నీ టీవీల్లో చూపించారు. రైతులంతా ఆశపడ్డారు. బాబు వచ్చాడు. కానీ రుణాలు మాఫీ కాలేదు. పైగా చేసిన అప్పుపై వడ్డీ తడిసి మోపెడైంది. దీంతో రైతులు ఆత్మహత్యలకు తెగించారు. కానీ ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఎన్నికలకు ముందు ఒకమాట... తర్వాత ఒకమాట మాట్లాడి రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణమైంది. ఇలాంటి మోసపూరిత మాటలతో రైతులకు అన్యాయం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పాడదాం’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

అప్పుల బాధకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడంలో భాగంగా ఆదివారం అనంతపురం జిల్లాలో తొలి విడత ‘రైతు భరోసాయాత్ర’ను జగన్ ప్రారంభించారు. బెంగళూరు నుంచి రోడ్డుమార్గం ద్వారా ఉదయం 11.14 గంటలకు చిలమత్తూరు మండలం కొడికొండచెక్‌పోస్టుకు చేరుకున్నారు. అక్కడినుంచి చిలమత్తూరు మీదుగా లేపాక్షి మండలం మామిడిమాకులపల్లికి చేరుకున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కురుబసిద్ధప్ప(65) కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం లేపాక్షి మీదుగా హిందూపురానికి చేరుకుని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే...
 
 బాబును నమ్మి మోసపోయారు..
 ‘‘లేపాక్షి మండలం మామిడిమాకులపల్లిలో సిద్ధప్ప కుటుంబాన్ని పరామర్శించాను. అక్కడ వారి మాటలు వింటుంటే గుండె బరువెక్కింది. వారికి ఎకరా పొలం ఉంది. బ్యాంకులో రూ.20 వేలు అప్పు తెచ్చుకున్నారు. పంటసాగుకు సరిపోలేదు. సిద్ధప్ప భార్య, కూతురు మెడలోని బంగారునగలను తాకట్టుపెట్టి మరో రూ.50 వేలు అప్పు తెచ్చుకున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద మరో రూ.లక్ష అప్పు తెచ్చుకున్నారు. పంట చేతికి రాలేదు. చంద్రబాబు వస్తే రుణాలన్నీ మాఫీ అవుతాయని ఆశపడ్డారు. 9 నెలలవుతోంది. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. రుణమాఫీ జరగలేదు. బ్యాంకులోని బంగారాన్ని వేలం వేస్తామని బ్యాంకర్లు నోటీసులు పంపారు. అప్పులు చెల్లించలేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక సిద్ధప్ప ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం అధికారులు సిద్ధప్ప ఇంటివద్దకు వెళ్లలేదు. సిద్ధప్పది రైతు ఆత్మహత్య కాదని ప్రభుత్వం చెబుతోంది. సాక్షాత్తూ సీఎం బావమరిది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించే హిందూపురం నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి.
 
 నా యాత్రతో బాబు గుండెల్లో గుబులు..
 అనంతపురం జిల్లాలో 46 మంది రైతులు, 8 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో అడిగా! ఆ రోజుకు రాష్ట్రంలో 86 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం తన పాలనలో ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోలేదని నిస్సిగ్గుగా చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న ప్రతీరైతు ఇంటికి వెళ్లి భరోసా కల్పిస్తానని నేను ప్రకటించా! కనీసం నేను వెళ్లిన తర్వాతైనా అవి ఆత్మహత్యలో..కావో టీవీల్లో కన్పిస్తుందని చెప్పా! ప్రభుత్వం మెడలు వంచి పరిహారం ఇప్పిస్తామన్నా! నేను అనంతపురానికి వచ్చేందుకు తేదీలు ఖరారవుతుంటే.. అప్పుడు చంద్రబాబు గుండెల్లో గుబులు పుట్టింది. 29మంది చనిపోయారని చెక్కులు పంపిణీ చేసేందుకు ఉపక్రమించారు. అదీ సక్రమంగా పంపిణీ చేయలేదు. సిద్ధప్ప ఆత్మహత్యను పరిగణనలోకి తీసుకోలేదు.
 
 ఒక్క హామీనీ బాబు నిలుపుకోలేదు..
ఎన్నికలకు ముందు ఎలాగైనా అధికారంలోకి రావాలని బాబు అబద్ధాలు చెప్పాడు. రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, రూ.2వేల నిరుద్యోగభృతి ఇస్తామన్నారు. 9 నెలలైంది. ఒక్కహామీని నిలుపుకోలేదు. ఇదేంటని నిలదీస్తే... నేనెప్పుడు చెప్పాను ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని అంటూ నిస్సిగ్గుగా చెబుతున్నాడు. అధికారంలోకి వస్తే రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పినరోజు రాష్ట్రంలో రూ.87 వేల కోట్ల వ్యవసాయరుణాలు, రూ.14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు కలిపి రూ.లక్ష కోట్లకుపైగా బకాయిలున్నాయి. బాబుమాటలు నమ్మి ప్రజలు ఓట్లేసి, రుణాలు చెల్లించలేదు. దీంతో వడ్డీభారం పెరిగింది. ఇప్పుడు పంటరుణాలపై రూ.12 వేల కోట్ల వడ్డీ భారం పడింది. వ్యవసాయ రుణాల బకాయిలే రూ.99 వేల కోట్లు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాఫీ చేసింది కేవలం రూ. 4,600 కోట్లు మాత్రమే! ఈ డబ్బులు వడ్డీకి కూడా సరిపోలేదు. రాష్ట్రం లో కరువొచ్చింది. రుణాలు మాఫీ కాలేదు. కొత్త రుణాలు రాలేదు. దీంతో పంటలబీమా, ఇన్‌పుట్ సబ్సిడీ రాని పరిస్థితి. చివరకు ప్రైవేటుగా తెచ్చుకున్న అప్పులకు 2-5 రూపాయలు వడ్డీని రైతులు చెల్లించాల్సిన దుస్థితి. బ్యాంకులోని బకాయిలకు 14 శాతం అపరాధరుసుంతో చెల్లించాలి. అలాగే డ్వాక్రా మహిళలకు రూ.14 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెవిలో కాలీఫ్లవర్ పెట్టారు.
 
 బాబు చర్మం మందం ఎక్కువ...
 చంద్రబాబు చర్మం కాస్త మందం ఎక్కువ! ఏం చెప్పినా వినే పరిస్థితి లేదు. నిజం చెప్పి అధికారంలోకి రాలేదు. దీంతో మళ్లీ మళ్లీ అబద్ధాలు చెప్పి తాను చెప్పిందే నిజం అని ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నాడు. చంద్రబాబుకు ఓ మునిశాపం ఉంది. చంద్రబాబు నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని శాపం ఉంది. అందుకే పదేపదే అబద్ధాలు చెబుతున్నాడు. ప్రస్తుతం చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో వందమందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతీ జిల్లాకు వెళతాను. ప్రతీ కుటుంబాన్ని పరామర్శిస్తాను.

చంద్రబాబు వైఖరిని ఎండగడతాను.’’
 కార్యక్రమంలో జిల్లాలోని పలు నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తిప్పేస్వామి. ఉషాచరణ్, సోమశేఖరరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, వీఆర్ రామిరెడ్డి, రమేశ్‌రెడ్డి,  బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటి సూర్యప్రకాశ్, వైఎస్సార్‌సీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, జిల్లా నేత చవ్వా రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బెంగళూరు నుంచి రోడ్డుమార్గం ద్వారా ఉదయం 11.14 గంటలకు చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టుకు జగన్ వచ్చిన సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, హిందూపురం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు శ్రీధర్‌రెడ్డి, నవీన్‌నిశ్చల్, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితోపాటు పలువురు జగన్‌కు స్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలికేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. జగన్ అందర్నీ ఆప్యాయంగా పలకరించారు.
Share this article :

0 comments: