ఆస్పత్రి తరలింపు ఆపాల్సిందే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆస్పత్రి తరలింపు ఆపాల్సిందే

ఆస్పత్రి తరలింపు ఆపాల్సిందే

Written By news on Tuesday, February 3, 2015 | 2/03/2015


ఆస్పత్రి తరలింపు ఆపాల్సిందే
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ ఆస్పత్రిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. నిరుపేద వర్గాలకు చెందిన ఛాతీ, ఎయిడ్స్ రోగులకు వరప్రదాయినిగా ఉండటంతోపాటు నగరం నడిబొడ్డు నుంచే సేవలు అందిస్తున్న ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించాల్సిన అగత్యం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఆస్పత్రి తరలింపు జీవో 61ను వ్యతిరేకిస్తూ వైద్యులు, ఇతర సిబ్బంది చేస్తున్న ఆందోళనకు పూర్తిస్థాయిలో సంఘీభావం, మద్దతు తెలిపారు. ఈ మేరకు పార్టీ నేతలతో కలసి సోమవారం ఛాతీ ఆస్పత్రిని ఆయన సందర్శించి ఆందోళన చేస్తున్న సిబ్బందికి సంఘీభావంగా ఆస్పత్రి ప్రాంగణంలో కాసేపు నేలపై కూర్చొని ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేసేలా సచివాలయాన్ని ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలోకి తరలించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రస్తుతమున్న సచివాలయం కేంద్రంగా ఎందరో ముఖ్యమంత్రులు దశాబ్దాల తరబడి రాష్ట్రాన్ని పాలించిన విషయాన్ని మరిచిపోయిన సీఎం కేసీఆర్ వాస్తు పిచ్చితో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని దుయ్యబట్టారు. నిమ్స్ ఆస్పత్రిని ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి బీబీనగర్‌లో నిర్మించిన భవనాలు ఆయన మరణానంతరం దిక్కులేకుండా పడిఉన్నాయని, వాటిని నేటికీ పూర్తిచేయకుండా నిరుపయోగంగా మార్చిన అసమర్ధ పాలకుల నిర్వాకంతో ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే కొన్నేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పూర్తికాగానే సచివాలయం పూర్తిస్థాయిలో తెలంగాణ ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తుందని, అలాంటప్పుడు కొత్త భవనాలు నిర్మించి ప్రజాధనం వృథా చేయాల్సిన అవసరం ఏముందన్నారు. ఆస్పత్రి తరలింపునకు అనుమతిస్తూ జారీ చేసిన జీవో 61ని తక్షణమే ఉపసంహరించుకోవాలని పొంగులేటి డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ సీనియర్ నేత రెహ్మాన్ మాట్లాడుతూ వాస్తుపేరుతో సీఎం నాటకాలు ఆడుతున్నారని, దీనివెనక కుట్ర దాగుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ మహబూబ్‌ఖాన్ ఆస్పత్రి పనితీరును వివరించారు. 62 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆస్పత్రిలో నిత్యం దాదాపు 200 మంది ఛాతీ సమస్యలతో బాధపడే రోగులతోపాటు మరో 150 మంది ఎయి డ్స్ రోగులకు చికిత్స అందిస్తామన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులకు అందుబాటు లో ఉన్న ఆస్పత్రిని మార్చవద్దని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో నాయకులు శివకుమార్, ఆదం విజయకుమార్, శేషురెడ్డి, సురేష్‌రెడ్డి, సూర్యప్రకాశ్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, ముస్త ఫా, జార్జ్, మహిళా నేత మేరీ సహా పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this article :

0 comments: