కేంద్రంపై ఎందుకీ మౌనం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్రంపై ఎందుకీ మౌనం?

కేంద్రంపై ఎందుకీ మౌనం?

Written By news on Monday, February 9, 2015 | 2/09/2015


కేంద్రంపై ఎందుకీ మౌనం?
  • రాష్ట్రాన్ని అథోగతిలోకి నెట్టడంలో తొలి ముద్దాయి కాంగ్రెసే
  • సీఎం చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టిన వైఎస్సార్ సీపీ
సాక్షి, హైదరాబాద్: విభజన చట్టం ప్రకారం ఏపీ రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలను అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నప్పటికీ సీఎం చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. తాను సీఎం అయితేనే.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఇంకెవరికి ఓటేసినా అభివృద్ధి సాధ్యం కాదని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కేంద్రం ఏ మాత్రమూ సాయం చేయకపోయినా మాట్లాడకపోవడానికి కారణం తెలియడం లేదని దుయ్యబట్టింది.

ఈ మేరకు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘ఇంత వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, ఇచ్చే అవకాశం లేదని స్పష్టంగా చెబుతున్నప్పటికీ మీరు(చంద్రబాబు) కిమ్మనకుండా ఎందుకు ఉంటున్నారు? మీ పార్టీ ప్రయోజనాల కోసం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కే్రందానికి తాకట్టు పెడుతున్నారు తప్ప గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. దీనిపై కనీసం ఒక్క లేఖ అయినా రాశారా? ఇస్తే ఇచ్చారు.. లేకపోతే లేదు అనే ధోరణితో మీరున్నారు. అడగలేకపోవడానికి.. మీపై ఏమైనా విచారణ చేస్తారని భయమా? లేక వారి నుంచి దూరంగా జరిగితే ప్రమాదం ఉందనుకుంటున్నారా?’ అని బాబుపై నిప్పులు చెరిగారు.

‘విభజన చట్టం ప్రకారం.. కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన మొదలు 6 మాసాల వ్యవధిలోనే వైఎస్సార్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అవకాశాలను సెయిల్ పరిశీలించాలి. ఏపీ గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై పరిశీలన చేసి కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాలి. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ అవకాశాలను పరిశీలించాలి. వంటి హామీలు స్పష్టంగా ఉన్నాయి’ అని గుర్తుచేశారు. ‘రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై మాటాడొద్దంటూ సహచర మంత్రులకు చెబుతున్న మీరు.. వారు మాట్లాడితే వచ్చే ప్రమాదమేమిటో చెప్పాలి’ అని ప్రశ్నించారు.

వెంకయ్య ఏమీ చేయలేకపోతున్నారు


విభజన హామీలు అమలు చేసే విషయంలో ఎన్నికలకు ముందుకు బ్రహ్మాండంగా మాట్లాడిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అధికారంలోకి వచ్చాక అంతే బ్రహ్మాండంగా పనులు చేయలేకపోతున్నారని అంబటి దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు తిరుపతిలో జరిగిన ప్రచార సభలో ‘స్వర్ణాంధ్ర కావాలంటే చంద్రబాబును సీఎం చేయండి. మీ కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం’ అని వేంకటేశ్వరస్వామి సాక్షిగా మోదీ చెప్పారన్నారు. ‘ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ చేసిన బాసలు, ఊసులు ఇప్పుడు మర్చిపోయారు. ఇది సరైన పద్ధతి కాదు’ అని అన్నారు.
 
సోనియా మాట్లాడరేం?

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ నేతలు కోటి సంతకాల సేకరణ మొదలు పెట్టారు కానీ, విభజన బిల్లులో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదో, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ దీనిపై కేంద్రంలో ఎందుకు ఒత్తిడి తీసుకురావడంలేదో చెప్పాలని అంబటి అన్నారు. తెలుగు ప్రజలను అగాథంలోకి నెట్టడంలో ప్రథమ ముద్దాయి కాంగ్రేసేనని, దానికి బీజేపీ , టీడీపీ కూడా వంత కలిపాయని దుయ్యబట్టారు. పీఆర్సీ విషయంలో సీఎం వైఖరి సహేతుకంగా లేదన్నారు.
Share this article :

0 comments: