
సాక్షిప్రతినిధి, అనంతపురం : జిల్లాలో వ్యవసాయం ఏటా నష్టాలమయమే అనేది పాలకులకు తెలిసిన సత్యం. ఈ క్రమంలో ప్రభుత్వాలు రైతులకు భరోసా కల్పించి వారిని కష్టాల గండం నుంచి గట్టెక్కించాలి. వాటిల్లిన నష్టాలను కొంతమేరైనా తీర్చాలి. అప్పుడే అన్నదాతకు ప్రభుత్వం దన్నుగా నిలిచినట్లవుతుంది. అయితే చంద్రబాబు సర్కారు దీనికి భిన్నంగా వ్యవహరించింది. మూడేళ్లుగా వరుస కరువులతో ‘అనంత’ రైతులు పూర్తిగా నష్టపోయారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు.
రుణమాఫీతో నిలువునా మోసపోయిన అన్నదాత:
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించారు. తీరా గద్దెనెక్కిన తర్వాత మాట మార్చారు. లేనిపోని సాకులు చెప్పి రైతన్నను నిలువునా ముంచారు. జిల్లా వ్యాప్తంగా 10.24లక్షల ఖాతాల్లో 6,817కోట్ల రూపాయల రుణాలు బకాయిలున్నాయి. సర్కారు చెప్పినట్లు పంటరుణాలు, బంగారు రుణాలు మాఫీ చేయాలన్నా 8.20 లక్షల ఖాతాల్లో 4,994కోట్ల రూపాయలు మాఫీ చేయాలి. అయితే ప్రభుత్వం మాత్రం 6.62 లక్షల ఖాతాల్లో 2,234.5కోట్ల రూపాయలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తొలివిడతలో 780.16కోట్ల రూపాయలను మాత్రమే మాఫీ చేసింది. దీంతో రుణమాఫీపై రైతులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఈ క్రమంలో గతేడాదికి సంబంధించి 227కోట్ల రూపాయల వాతావరణ బీమా రైతులకు రావాలి. ఈ డబ్బులను బ్యాంకర్లు పాతబకాయిల కింద జమ చేసుకున్నారు. పాతబకాయిల్లోకి జమ చేసుకోవాలని ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో జీవోను ఉపసంహరించుకుంది. దీంతో పాటు 2013-14కు సంబంధించి 643 కోట్ల రూపాయల ఇన్‌పుట్‌సబ్సిడీ రావాలి.
ఈ ఏడాదికి సంబంధించి 574 కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ మంజూరు చేయాలి. వీటికి తోడు పాతబకాయిలు మరో 30 కోట్ల రూపాయలు ఉన్నాయి. వీటిలో ఒక్కరూపాయీ మంజూరు చేయలేదు. వీటికి తోడు బ్యాంకుల్లో తాకట్టులోని బంగారు నగలను వేలం వేస్తామని బ్యాంకర్లు నోటీసులు జారీ చేశారు. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం నుంచి అన్నదాతకు ఎలాంటి భరోసా దక్కలేదు. అప్పులు మాత్రం మోయలేని భారంగా మారాయి. బ్యాంకర్ల చర్యలు...అప్పలోళ్ల మాటలతో ఆత్మాభిమానం చంపుకోలేక 45మంది రైతులు ఆత్మహత్యలకు తెగించారు. ఇవన్నీ చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత జరిగిన ఆత్మహత్యలే!
ఆత్మహత్యలపై బుకాయింపు:
జిల్లాలో 45 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రతిపక్షపార్టీ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఆత్మహత్యలపై సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. అసలు ‘అనంత’లో ఆత్మహత్యలే జరగలేదని ప్రభుత్వం బుకాయించింది. ప్రతిపక్షం అనవసరరాద్ధాంతం చేస్తోందని మంత్రులు అన్నారు. అయితే ఆత్మహత్యలపై ససాక్షాలతో జగన్ అసెంబ్లీ స్పీకరుకు నివేదిక సమర్పించారు. జిల్లా కలెక్టర్ ఆత్మహత్యలు జరిగాయని చెబుతుంటే, సీఎం మాత్రం జరగలేదని చెబుతున్నారని ప్రతిపక్షపార్టీ ప్రభుత్వంపై విమర్శలదాడికి దిగింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తానని జగన్ చెప్పారు. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన చంద్రబాబు చివరకు ఆత్మహత్యలు నిజమే! అని ఒప్పుకున్నారు. ప్రతిపక్షాల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.
జాబితాలోనూ మతలబు :
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జిల్లాలో 45 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రకటించింది. ఇందులో 9 మంది రాష్ట్రవిభజనకు ముందు చనిపోయినవారు. అంటే జూన్ 2 తర్వాత ఆత్మహత్య చేసుకున్న 45 మందిలో ప్రభుత్వం గుర్తించింది 21 మాత్రమే! తక్కిన ఆత్మహత్యలు ఎందుకు రైతు ఆత్మహత్యలు కావో ప్రభుత్వం స్పష్టం చేయలేదు. 421 జీవో ప్రకారం అప్పులబాధతో రైతు కుటుంబంలో ఆత్మహత్య చేసుకుంటే, దాన్ని రైతు ఆత్మహత్యగానే పరిగణించాలని స్పష్టంగా ఉంది. ప్రభుత్వం మాత్రం ఆత్మహత్యలను మానవీయ కోణంలో కాకుండా రాజకీయ కోణంలో మాత్రమే చూసి, అర్హుల జాబితాను తగ్గించేస్తోంది.
0 comments:
Post a Comment