‘హోదా’పై నిమ్మకు నీరెత్తారెందుకు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘హోదా’పై నిమ్మకు నీరెత్తారెందుకు?

‘హోదా’పై నిమ్మకు నీరెత్తారెందుకు?

Written By news on Sunday, February 22, 2015 | 2/22/2015


‘హోదా’పై నిమ్మకు నీరెత్తారెందుకు?
బీజేపీ, టీడీపీలపై మేకపాటి మండిపాటు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి బీజేపీని ప్రశ్నించారు.శనివారమిక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని దుర్మార్గమైన రీతిలో కాంగ్రెస్ విభజించిందని, అందుకు బీజేపీ మద్దతునిచ్చిందని, తానే విభజనకు మొట్టమొదటిగా ఓటు వేశానని టీడీపీ చెప్పిందని, అలాంటపుడు విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను నెరవేర్చకుండా గాలికెందుకు వదిలేశారని ప్రశ్నించారు.  
 
 అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఏపీకి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీనిస్తే, ఇప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అధికారంలోకి తామే వస్తాము కనుక పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని మేకపాటి గుర్తు చేశారు. ఇపుడు మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వాలంటే అందరి ఆమోదం కావాలని చెప్పడం, మరలా ప్రత్యేకహోదా కోసం కృషి చేస్తున్నామని చెప్పడం విడ్డూరమని విమర్శించారు. రాష్ట్రం చీల్చేయడానికి  ప్రధాన కారణం సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీయేనని మేకపాటి తప్పుపట్టారు. వారే ఇపుడు ప్రత్యేక హోదాకోసం ఆందోళన చేస్తామనడం విచిత్రంగా ఉందన్నారు. విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తేవట్లేదని దుయ్యబట్టారు.
 
 కృషి చేస్తోంది వైఎస్సార్‌సీపీ ఒక్కటే...
 విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ పోరాడుతోంది వైఎస్సార్‌సీపీ ఒక్కటేనని మేకపాటి అన్నారు. 2014 ఎన్నికలు ముగిసిన వెంటనే మే 19న తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో తాము ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించామని గుర్తుచేశారు. అలాగే జూన్ 11న రెండోసారి, తాజాగా కూడా ఢిల్లీ వెళ్లి  ఆర్థిక, హోం, రైల్వే శాఖల మంత్రులను కలసి రాష్ట్రానికి న్యాయం చేయాలని, రైల్వే ప్రాజెక్టులను అమలు చేయాలని కోరామని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను కూడా ఈ బడ్జెట్‌లో చేర్చాలని విన్నవించామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటుగా విభజన చట్టంలో పొందుపర్చిన అంశాల సాధనకు తమ పార్టీ పార్లమెంటులో కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
Share this article :

0 comments: