పార్టీ పతాకాన్ని ఎగురవేయనున్న జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ పతాకాన్ని ఎగురవేయనున్న జగన్

పార్టీ పతాకాన్ని ఎగురవేయనున్న జగన్

Written By news on Thursday, March 12, 2015 | 3/12/2015


ప్రజా సంక్షేమమే పరమావధి
* వైఎస్సార్‌సీపీ నాలుగేళ్ల ప్రస్థానం
* నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం
* పార్టీ పతాకాన్ని ఎగురవేయనున్న జగన్

 
 సాక్షి, హైదరాబాద్:  ప్రజా సమస్యలపై నిరంతరం పోరు సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటికి తన నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించడమే ప్రధాన ఎజెండాగా ఆవిర్భవించిన ఈ పార్టీ తొలి నుంచీ ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. వైఎస్ మరణానంతరం సంభవించిన రాజకీయ మార్పుల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీగా ఉండిన  ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల అధిష్టానవర్గం వివక్ష చూపుతూ వచ్చింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించడం ధర్మంగా భావించి నల్లకాలువ(వైఎస్ మృతి చెందినచోటు) వద్ద ఇచ్చిన మాటను అనుసరించి ఓదార్పు యాత్రను చేపడతానని జగన్ ప్రకటించారు.
 
 కాంగ్రెస్ అధిష్టానం ఈ యాత్రను అడ్డుకోవాలని చూసింది. వివక్షను జీర్ణించుకోలేకపోయిన జగన్ ఆ పార్టీని వీడారు. మార్చి 12, 2011 సంవత్సరంలో ప్రజాసంక్షేమమే పరమావధిగా ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించారు. అదే ఏడాది మే లో కడప లోక్‌సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ రికార్డు స్థాయిలో 5.43 లక్షల మెజారిటీతో గెలుపొందారు. అదే సందర్భంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పులివెందుల నుంచి 85 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఓదార్పు యాత్రను ఓ వైపు కొనసాగిస్తూనే మరోవైపు ప్రజాసమస్యలపై పోరాటాన్ని జగన్ సాగించారు.
 
ప్రతిబంధకాలను అధిగమిస్తూ: జగన్ వల్ల తమ పార్టీ పునాదులు కదులుతూ ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయిన కాంగ్రెస్ అధిష్టానం సీబీఐని ఉసిగొల్పి కేసులతో ఇబ్బందులకు గురిచేసింది. రాజకీయంగా జగన్ ఎదుగుదలను ఓర్వలేని టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై అడుగడుగునా వైఎస్సార్‌సీపీకి ప్రతిబంధకాలు కల్పిస్తూ వచ్చాయి. 2012 మే నుంచి 16 నెలలపాటు జగన్‌ను జైల్లో ఉంచి వైఎస్సార్‌సీపీపై ఉక్కుపాదం మోపేయత్నం చేశారు. జైల్లో ఉన్నా అక్కడినుంచే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ జగన్.. పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. తాను ప్రజలమధ్య లేని లోటును తన తల్లి విజయమ్మ ద్వారా పూడ్చే యత్నం చేశారు. వైఎస్ తరువాత సీఎంలైన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ మహానేతకున్న మంచిపేరును తుడిచి వేయాలన్న దురుద్దేశంతో ఆయన ప్రారంభించిన  పథకాలకు తూట్లు పొడిచినప్పుడు జగన్  ప్రతిఘటిస్తూ వచ్చారు. రైతులు, విద్యార్థుల సమస్యలపై నిరాహార దీక్షలు చేస్తూ పోరాటాన్ని సాగించారు. తనను జైల్లో పెట్టిన తరువాత ఇవే ప్రజా సమస్యలపై తన తల్లి విజయమ్మతో దీక్షలు చేయించారు.  
 
రెండు ప్లీనరీలతో పార్టీ పటిష్టం: మార్చి 12, 2011న స్థాపించిన వైఎస్సార్‌సీపీ తొలి ప్లీనరీ ఇడుపులపాయలో అదే ఏడాది జూలై 8, 9 తేదీల్లో జరిగింది. రెండో ప్లీనరీ 2014 ఫిబ్రవరి 2న నిర్వహించారు. ఎన్నికల్లో గెలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేపట్టబోయే సంక్షేమపథకాలను ప్రకటించారు. పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకుంటూనే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల ను సవాలుగా తీసుకుని వైఎస్సార్‌సీపీ పోరాడింది. గణనీయమైన సంఖ్యలో పంచాయతీలను గెల్చుకుంది. 2014 సాధారణ ఎన్నికల్లో విజయపు అంచులవరకూ చేరుకున్న  అనూహ్య రీతిలో ఓటమి పాలైంది. ప్రజాభిమానం జగన్ వైపే ఉన్నా టీడీపీ ఆచరణకు సాధ్యంగాని హామీలు ఇవ్వడంతో మోసపోయిన రైతాంగం, ఇతర వర్గాలు చంద్రబాబువైపు మొగ్గుచూపాయి.
 
 అబద్ధపు హామీలతో వైఎస్సార్‌సీపీకన్నా కేవలం 1.9% ఓట్లతో టీడీపీ విజయం సాధించింది. 2011లో 1 ఎంపీ, 1 ఎమ్మెల్యే స్థానాలతో  బోణీ కొట్టిన వైఎస్సార్‌సీపీ క్రమంగా బలాన్ని పెంచుకుంది. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఏపీలో 17 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాలను గెల్చుకుంది.  సాధారణ ఎన్నికల్లో ఉభయ రాష్ట్రాల్లోనూ కలపి 70 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. ఎన్నికల ఫలితాలు కొంత నిరాశకు గురిచేసినప్పటికీ.. ఆ మరుక్షణమే తేరుకుని ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన జగన్ పోరాటపంథానే ఎంచుకున్నారు. గత 9 నెలల్లో  క్రియాశీల ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీని తీర్చిదిద్దుతూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను జాగృతం చేస్తున్నారు.
 
 నేడు ఆవిర్భావ దినోత్సవం: గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాలుగో ఆవిర్భావ దినోత్సవం జరుగ నున్నది. వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ పతాకాన్ని ఎగురవేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Share this article :

0 comments: