కేంద్రం గుర్తిస్తే.. రాష్ట్రం పరువు పోదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్రం గుర్తిస్తే.. రాష్ట్రం పరువు పోదా?

కేంద్రం గుర్తిస్తే.. రాష్ట్రం పరువు పోదా?

Written By news on Friday, March 20, 2015 | 3/20/2015


గొప్పల కోసం తప్పుడు లెక్కలా?
 బడ్జెట్‌పై చర్చలో ప్రభుత్వంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
⇒ గత ఏడాది భారీగా ప్రణాళికేతర వ్యయం.. ఈసారి భారీగా తగ్గింపా?
⇒ జీతాలేమైనా తగ్గాయా?.. లేక వడ్డీలు తగ్గాయా?
⇒ కేంద్రం నుంచి నిధుల కోసం అంకెలు మారుస్తారా?
⇒ వారు పసిగడితే మన పరిస్థితి ఏమిటి?
⇒ రాష్ట్రం పరువుపోదా? ఆత్మాభిమానం దెబ్బతినదా?
⇒ నాయకుడు మంచి నేర్పాలిగానీ... వెన్నుపోటు, మోసం కాదు

⇒ మీకన్నా గవర్నర్ పాలనలోనే వృద్ధి రేటు బాగుంది
⇒ రైతును దగా చేసి.. అభివృద్ధి జరిగిందంటారా?
 
సాక్షి, హైదరాబాద్: గొప్పలు చెప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మాయలు చేసి ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్టుగా చూపిం దని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేవలం కేంద్రం నుంచి నిధులు రాబట్టడమే ఎత్తుగడగా అభూత కల్పనలకు పాల్పడటం రాష్ట్రానికే నష్టమని హెచ్చరిం చారు. దీన్ని కేంద్రం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులుగా ఉన్నవారు ప్రజలకు మంచి నేర్పాలిగానీ.. మోసం, వంచన, వెన్నుపోటు నేర్పకూడదని హితవు పలికారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టకుండానే నేరుగా బడ్జెట్‌పై చర్చ చేపట్టింది.

ఈ సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బడ్జెట్ రూపకల్పనలో ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం 2015-16 సంవత్సరానికి ప్రవేశపెట్టిన రూ.1,13,049 కోట్ల బడ్జెట్‌లో పలు అసత్యాలున్నాయని ఎండగట్టారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాలు రూ. 1,12,067 కోట్లని.. గతంతో పోలిస్తే ఇది వెయ్యి కోట్లు మాత్రమే ఎక్కువని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 8.47 శాతం వృద్ధి రేటు సాధిం చామని గొప్పగా ప్రభుత్వం చెబుతోందని, దేశంలోనే ఇది ఒక శాతం ఎక్కువని చాటుకున్నారన్నారు.

కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధులు 32 నుంచి 42 శాతానికి పెరిగాయని, ఇప్పటికే రూ.6,600 కోట్లిచ్చారని జగన్ గుర్తు చేశారు. అదనంగా నిధులు రావటం, వృద్ధి రేటు 12 శాతానికి పెంచుతామని ప్రభుత్వమే చెబుతున్న నేపథ్యంలో బడ్జెట్‌ను కనీసం రూ. 15 వేల కోట్లయినా పెంచుతారని ఆశిస్తే అలాంటిదేమీ కనిపించలేదన్నారు. బడ్జెట్‌పై చర్చలో జగన్‌మోహన్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
 
ఈ కోతలకు కారణమేంటి?
ప్రణాళికేతర వ్యయంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2014-15లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయాన్ని రూ. 85,151 కోట్లుగా చూపిం చారు. తాజా బడ్జెట్‌లో 14-15 కాలానికి సవరించిన అంచనాలను రూ. 89,318 కోట్లుగా పేర్కొన్నారు. ఏకంగా రూ. 4 వేల కోట్లు పెంచడానికి కారణమేంటి? మరోవైపు 2015-16 బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయాన్ని అనూహ్యం గా తగ్గించారు. రూ. 89,318 కోట్ల నుంచి రూ. 78,636 కోట్లకు అంటే.. రూ. 11 వేల కోట్లు తగ్గించటం ఆశ్చర్యకరం.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గాయా? పెన్షన్లు తగ్గాయా? రుణాలకు చెల్లించే వడ్డీలు తగ్గాయా? ప్రభుత్వ నిర్వహణ వ్యయం తగ్గిందా..? ఏ కారణం వల్ల ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించారు? 2014-15లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను రూ. 29,870 కోట్లుగా చూపించారు. అప్పటికే వారికి మధ్యంతర భృతి 27 శాతం ప్రకటిం చారు. ఆ తర్వాత ప్రభుత్వం వారికి 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. దీంతో 16 శాతం ఉద్యోగుల జీతాల వ్యయం లెక్కల్లోకి వస్తుంది. పెరిగిన రూ. 4,779 కోట్లు కలుపుకుంటే జీతాలకే రూ.34,640 కోట్లు చెల్లించాలి. ఇదేదీ 2015-16 ప్రణాళికేతర వ్యయంలో కనిపించలేదు.

ప్రణాళికేతర, ప్రణాళికా వ్యయం రూ. 57,7167 కోట్లు ఉంటుంది. మార్చి చివరకు లెక్కగట్టినా మొత్తం బడ్జెట్ రూ. 60 వేల కోట్ల నుంచి రూ. 62 వేల కోట్లకు మించే అవకాశమే లేదు. అవిభక్త రాష్ట్రంగా ఉన్న కాలంలో తెలంగాణ వ్యయాన్ని కలుపుకున్నా బడ్జెట్ రూ. 83 వేల కోట్లకు మించదు. ఇంకా అదనంగా  వేసుకున్నా రూ. 90 వేల కోట్లకు ఒక్కపైసా మించే వీల్లేదని లెక్కలు చెబుతున్నాయి. కంప్యూటర్ యుగం లో సీఎం కార్యాలయమే కోడ్-కోడ్ అనే పేరుతో వివరాలు పరిశీలించే ఏర్పాటు ఉండి కూడా బడ్జెట్‌ను అసంబద్ధంగా, అనూహ్యంగా రూ. 22 వేల కోట్లు పెంచడంలో అర్థమేంటి? కేంద్రం నుంచి నిధులు రాబట్టడం కోసమే ప్రణాళికేతర వ్యయాన్ని ఎక్కువ చేసి చూపారు. ఈ అవకాశం లేదు కాబట్టే 2015-16లో దీన్ని రూ.11 వేల కోట్ల మేర తగ్గించారు.
 
చెప్పిందేంటి.. చేస్తున్నదేంటి?
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రతిసారీ చెబుతున్న టీడీపీ సర్కారుకు ఎన్నికలప్పుడు ఈ విషయం గుర్తులేదా? రైతులు, డ్వాక్రా గ్రూపులు అందరి రుణాలు మాఫీ చేస్తామని ఆ సమయంలో చెప్పారు. ఏ చానల్ చూసినా ‘మీ బంగారం తాకట్టు పెట్టారా?.. బాబు వస్తేనే అది బయటకొస్తుంది... బాబు వస్తేనే జాబొస్తుంది... బాబు వస్తేనే రుణాలు మాఫీ అవుతాయి’ అంటూ ప్రకటనలు గుప్పించారు. ఊరూవాడా ఇదే ప్రచారం చేశారు. చంద్రబాబు స్వయంగా రాసినట్టు చెప్పే కరపత్రాన్ని ఇంటింటికీ పంచారు. ఎన్నికల సంఘం అభ్యం తరం వ్యక్తం చేస్తే.. ఆర్థిక వ్యవస్థపై పూర్తి అవగాహన తర్వాతే హామీలు ఇస్తున్నట్టు బాబు లేఖ రాశారు.

ఇప్పుడు మాత్రం ఏ రుణమూ మాఫీ కాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత బాబుకు ఏపీలో రుణాల పరిస్థితిని బ్యాంకర్లు స్పష్టంగా వివరించారు. 2014 మార్చి 31 నాటికి రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు, స్వయం సహాయ సంఘాలకు రూ.14,200 కోట్ల రుణాలున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులు రుణాలు కట్టడానికి సుముఖంగా లేరని బ్యాంకు అధికారులే చెప్పారు. ఇవన్నీ తెలిసి కూడా బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం దారుణం.
 
ఇవన్నీ.. మీరు మాట్లాడొద్దు: స్పీకర్
రుణ మాఫీ అంశంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాన్ని సభ లో అధికారపక్షం అడ్డుకుంది. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంబంధం లేని అంశాలను మాట్లాడటం, విపక్షనేత మైక్‌ను కట్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ సమయంలో మీరు ఇవన్నీ మాట్లాడొద్దని స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు విపక్ష నేతకు స్పష్టం చేశారు. దీన్ని జగన్ వ్యతిరేకించారు. కీలకమైన బడ్జెట్‌పై మాట్లాడే అవకాశం తమ నేతకు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ సభ్యులు స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో అధికారపక్ష సభ్యులు రన్నింగ్ కామెంటరీ చేయటం.. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడం జరిగింది.
 
బాబూ... ఇదీ నీ ప్రోగ్రెస్
గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధి రేటు అద్భుతంగా పెరిగిందని చెప్పారు. కానీ గణాంకాలు 0.04 శాతమే పెరిగినట్లు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది గవర్నర్ పాలన సమయంలో రాష్ట్ర వ్యవసాయం, అనుబంధ విభాగాల వృద్ధి రేటు 7.9% ఉంది. బాబు అధికారంలోకి వచ్చాక 2 శాతం తగ్గి 5.9కి క్షీణించింది. ఒక్క వ్యవసాయాన్ని చూసుకున్నా 9.60 నుంచి 5.6 శాతానికి తగ్గింది. మరి ఈ విషయాలెక్కడా బడ్జెట్‌లో చెప్పలేదేం? రైతులకు రుణమాఫీ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. రైతులకు బ్యాంకులు రుణాలివ్వక అధిక వడ్డీలతో ప్రైవేట్ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవటంతో వ్యవసాయం చితికిపోయింది.

బడ్జెట్‌లో దీన్ని గుర్తించకపోవడం దారుణం. దేశవ్యాప్తంగా 20% కోడిగుడ్ల ఉత్పత్తి రాష్ట్రం నుంచి జరుగుతోందని అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవానికి పదేళ్లుగా మన రాష్ట్రమే 33 శాతం గుడ్లను ఎగుమతి చేస్తోంది. చేపల ఎగుమతిని గొప్పగా చెప్పుకొన్నారు. ఎప్పటి నుంచో మెరైన్ ఎక్స్‌పోర్టులు 50 శాతం వరకూ మన రాష్ట్రం నుంచే ఉన్నాయి. అడవులు, చెట్లు, ఎర్రచందనం అమ్మడంలోనే ప్రభుత్వ పురోగతి, వృద్ధిరేటు కనిపిస్తోంది.

ఎర్ర చందనం వేలం ద్వారా వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది. ధాన్యం సేకరణ విషయంలోనూ ప్రభుత్వం విఫలమైంది. కేంద్రం లెవీని 75శాతం నుంచి 25 శాతానికి తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 14 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణనే గొప్పగా చెప్పుకుంటోంది. ఏపీలో 80 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంటే సేకరించిన ధాన్యం ఏ మూలకు సరిపోతుంది? పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో 75 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నారు. 3 కార్పొరేషన్లను నెలకొల్పారు.
 
కేంద్రం గుర్తిస్తే.. రాష్ట్రం పరువు పోదా?
కేవలం రెవెన్యూ లోటును చూపించి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికేతర వ్యయాన్ని పెంచిందని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ కేంద్ర అధికారులు పరిశీలిస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. తప్పుడు ఖాతాలన్నీ ఢిల్లీకి వెళ్తే.. వారు తప్పుబడితే రాష్ట్ర పరువు ప్రతిష్టలు దిగజారవా? అని జగన్ నిలదీశారు. వారికి ఈ విషయం తెలిస్తే తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతినదా అని నిలదీశారు. అబద్ధం, అన్యాయం, మోసం, వెన్నుపోటు చేసినా ఫర్వాలేదనే ధోరణి సరికాదన్నారు.

రాష్ట్రం పరువు తాకట్టు పెట్టొద్దని కోరారు. రాష్ట్రం.. దేశానికే రోల్‌మోడల్‌గా ఉండేందుకు ప్రయత్నించాలని హితవు పలికారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదన్నారు. అయితే దానికి ఇది పద్ధతి కాదన్నారు. కేంద్రంలో ఉన్నది టీడీపీ మద్దతిస్తున్న సర్కారే కాబట్టి వెళ్లి పోరాడాలని, అవసరమైతే తాము కూడా రావడానికి సిద్ధమేనని ప్రకటించారు.
Share this article :

0 comments: