మళ్లీ అవే రోజులు పునరావృతం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మళ్లీ అవే రోజులు పునరావృతం..

మళ్లీ అవే రోజులు పునరావృతం..

Written By news on Saturday, March 21, 2015 | 3/21/2015


అదే బాబు.. అదే పాలన
  • ఉద్యోగుల్లో అభద్రత.. రైతుల్లో భయం
  • మళ్లీ అవే రోజులు పునరావృతం..
  • ఎవరి మేలు కోసం ఈ బడ్జెట్?
  • రైతుల కోసం కాదు.. డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం కాదు...
  • కాంట్రాక్టర్ల మేలుకే రూపొందించారు
  • యూజర్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ చార్జీలతో వాతలు
  • పెట్రోల్‌పై ఇంత పన్ను ఎక్కడైనా ఉందా?
  • చంద్రబాబు పాలనను, రాష్ట్ర బడ్జెట్‌ను తూర్పారబట్టిన వైఎస్ జగన్

సంక్షోభం ఉంటేనే తనకు చాలా ఇష్టమని చంద్రబాబే చెప్పారు.. అందుకే ఆయన సీఎం అయ్యాక రైతుల్లో, డ్వాక్రా అక్కచెల్లెమ్మల్లో, చదువుకుంటున్న పిల్లల్లో ఫీజుల కోసం, నిరుద్యోగుల్లో ఉద్యోగాల కోసం, అవ్వా తాతల పింఛన్లలో సంక్షోభం పుట్టించారు. గృహనిర్మాణ రంగంలోనూ, చివరకు రాజధాని నిర్మాణంలోనూ సంక్షోభం పుట్టించారు.
 - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

‘‘మళ్లీ అదే విజన్, మళ్లీ అవే కన్సల్టెన్సీలు, మళ్లీ అవే దావోస్ ట్రిప్పులు, మళ్లీ అవే జీరో బేస్డ్ బడ్జెట్ మాటలు, మళ్లీ అవే సింగపూర్ పర్యటనలు, మళ్లీ అవే గోబెల్స్.. మళ్లీ అవే రెవెన్యూ డెఫిసిట్లు.. మళ్లీ అదే యూజర్ చార్జీలు, అదే కరెంట్ చార్జీలు, అదే ఆర్‌టీసీ చార్జీల వాతలు.. ఉద్యోగుల్లో అదే అభద్రతాభావం, రైతుల్లో అదే భయం!’’

‘‘ఈ బడ్జెట్ రైతులకు మేలు చేసేదా? డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు, విద్యార్థులకు కూడా మేలు చేసే బడ్జెట్ కూడా కాదు.. నిరుద్యోగ భృతికీ కేటాయింపులు లేవు.. మరి ఎవరికి మేలు చేయడానికి ఈ బడ్జెట్? ఒక్క కాంట్రాక్టర్లకు మాత్రమే మేలు చేసేదే ఈ బడ్జెట్.’’

‘‘సంక్షోభం ఉంటేనే తనకు చాలా ఇష్టమని చంద్రబాబే చెప్పారు.. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రైతుల్లో, డ్వాక్రా అక్క చెల్లెమ్మల్లో, చదువుకుంటున్న పిల్లల్లో ఫీజుల కోసం, నిరుద్యోగుల్లో ఉద్యోగాల కోసం, అవ్వా తాతల పింఛన్లలో సంక్షోభం పుట్టించారు. గృహనిర్మాణ రంగంలోనూ, చివరకు రాజధాని నిర్మాణంలోనూ సంక్షోభం పుట్టించారు.’’

సాక్షి, హైదరాబాద్: ‘‘అదే బాబు.. అవే మాటలు.. చరిత్ర పునరావృతం అవుతోంది! చంద్రబాబు వచ్చారు.. ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి.. రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు తన మార్కు పాలనకు తెరతీశారు. నాటి చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎలాంటి చేదు అనుభవాలను చవిచూశామో పదేళ్ల తర్వాత ఇప్పుడు అలాంటివే పునరావృతమవుతున్నాయి’’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యూజర్ చార్జీలు పెంచారని.. ఈ బడ్జెట్ తర్వాత విద్యుత్ చార్జీలు, ఆర్‌టీసీ చార్జీలు కూడా పెంచుతారని అందరూ భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పెట్రోల్‌పై 31 శాతం పన్ను 4 రూపాయల వ్యాట్, డీజిల్‌పై 22.25 శాతం పన్ను 4 రూపాయల వ్యాట్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు... ఇలా అన్ని వర్గాలను చంద్రబాబు ఎలా మోసం చేస్తున్నదీ సోదాహరణంగా వివరించారు. వాస్తవిక అవసరాలకు బడ్జెట్ కేటాయింపుకు పొంతన లేకపోవడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చారు. ఆయన నోట నాటి తొమ్మిదేళ్ల పాలనలో వచ్చిన మాటలే ఇపుడూ వస్తున్నాయి.

చరిత్ర పునరావృతమవుతోంది. మళ్లీ విజన్ అంటున్నారు. గతంలో విజన్ 2020 అనేవారు. ఇప్పుడు విజన్ 2029 లేదా విజన్ 2050 అనో అంటున్నారు. మళ్లీ కన్సల్టెన్సీలకు తెరతీశారు. కన్సల్టెన్సీలకు 100 కోట్లు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. కాకపోతే కన్సల్టెన్సీల పేర్లు మాత్రమే మారుతున్నాయి. చంద్రబాబు మళ్లీ ప్రతి ఏటా దావోస్ పర్యటనలకు శ్రీకారం చుట్టారు. చల్లగా ఉంటుంది కాబట్టి స్విట్జర్లాండ్ వెళుతున్నారు. ‘జీరో బేస్డ్’ బడ్జెట్... ‘లెవెల్  ప్లేయింగ్’ అంటూ మళ్లీ అవే మాటలు వినిపిస్తున్నాయి. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమవుతుందనే విధంగా మళ్లీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఇదంతా చూసినపుడు చంద్రబాబు పాలన రాష్ట్రంలో పునరావృతం అయిందన్నది స్పష్టమవుతోంది’’ అని జగన్ తూర్పారబట్టారు. గతంలో చంద్రబాబు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పాలన అంతా రెవెన్యూ లోటుతోనే నడిచిందని.. ఆయన దిగిపోయే నాటికి మైనస్ 21,000 కోట్ల రూపాయల మేరకు రెవెన్యూ లోటు ఉండేదని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పదేళ్లు వరుసగా రెవెన్యూ మిగులు కనిపించిందని వివరించారు. చంద్రబాబు వచ్చారు కనుక ఇపుడు మళ్లీ రెవెన్యూ లోటు ఏర్పడిందని ఎద్దేవా చేశారు.

వ్యవసాయ వృద్ధి రేటు తగ్గిపోయింది..
‘‘వ్యవసాయ, అనుబంధ రంగాల్లోనూ చంద్రబాబు రాగానే వృద్ధిరేటు తగ్గి పోయింది. ఆయన రావడానికి ముందు ఏడాది 7.9 శాతం ఉన్న వృద్ధి రేటు.. ఆయన వచ్చాక 5.9కి పడిపోయింది. రైతులకు బ్యాంకులు రుణాలిచ్చే పరిస్థితి.. కనీసం వాళ్లు బ్యాంకుల్లో అడుగుపెట్టే పరిస్థితి కూడా లేకుండాపోయింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో.. రైతు రుణాల పంపిణీకి నిర్దేశించిన లక్ష్యంలో కనీసం 30 నుంచి 40 శాతం కూడా ఎక్కువ రుణాలు ఇవ్వలేకపోతున్నట్లు అధికారులు చెప్తున్నారు’’ అని జగన్ వివరించారు. ‘‘వరదలు, కరువు వచ్చినా దిక్కు లేదు. రైతులకు పంటల బీమా వచ్చే పరిస్థితి లేదు. ధాన్యం అమ్మాలంటే రైతులు కష్టపడే రోజులొచ్చాయి. వరి ధాన్యం కనీస మద్దతు ధర రూ. 50 మాత్రమే పెంచారు. అప్పటి మాదిరే ఆస్తులు, అప్పుల నిష్పత్తిలో కూడా బాగా తేడా ఏర్పడింది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి ముందు 1994లో రాష్ట్రం అస్తులు, అప్పుల నిష్పత్తి 101ః100గా ఉంటే ఆయన దిగిపోయే నాటికి ఆస్తులు, అప్పుల నిష్పత్తి 50ః100కు పడిపోయింది. మళ్లీ గత పదేళ్లలో ఆస్తులు, అప్పుల నిష్పత్తి 105ః100గా ఉంటే, ఇపుడు చంద్రబాబు వచ్చాక ఆస్తుల కన్నా అప్పులు పెరిగాయి’’ అని ఆయన వివరించారు.

హుండీలు.. జెట్ ప్రయాణాలు
ఓ వైపు విచ్చలవిడిగా అవినీతి, మరో వైపు విచ్చలవిడిగా తిరగడం ఇలా జరుగుతోంది చంద్రబాబు పాలన అని జగన్ దుయ్యబట్టారు. ‘‘డబ్బులు లేవని, రాష్ట్రం దివాలా తీసిందని ఓవైపు సచివాలయంలో హుండీలు పెట్టి, వందా, యాభై అందులో వేయండి అని చెబుతారు. మరోవైపు మాత్రం చంద్రన్న ప్రయివేట్ జెట్ విమానాల్లోనే ప్రయాణిస్తారు’’ అని ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు తన విమాన ప్రయాణ ఖర్చుల కోసం ఇప్పటికి రూ. 15 కోట్లు ఖర్చు చేశారు. జీవో నంబర్ 30 ద్వారా చంద్రన్న విమాన ఖర్చును విడుదల చేశారు.
చెట్టు కింద నుంచైనా పరిపాలన సాగిస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన చంద్రబాబు.. సచివాలయంలోని తన తాత్కాలిక కార్యాలయానికి మరమ్మతుల కోసం రూ. 20 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక ఇళ్లకు, ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి మరో రూ. 30 కోట్ల నుంచి రూ. 40 కోట్ల వరకూ ఖర్చు చేశారు’’ అంటూ చంద్రబాబు దుబారాను ఎండగట్టారు. ‘‘యోగా క్లాసులని చెప్పి స్టెప్పులు వేసి, డ్యాన్సులు చేశారు. చూసిన వాళ్లు ఆహా.. చంద్రన్న ఏం స్టెప్పులు వేశారని అన్నారు. తన మంత్రులు, అధికారులు, మేయర్లు, చైర్మన్లకు యోగా నేర్పినందుకు రూ. 2 కోట్లు ఖర్చు చేశారట. నా దగ్గర రూ.1.05 కోట్లకు సంబంధించిన జీవో ఉంది. ఒకవైపు ఉచితంగా యోగా నేర్పించడానికి రాష్ట్రంలో ఎం దరో సిద్ధంగా ఉన్నారు. డబ్బుల్లేవంటూనే రూ.2 కోట్లు యోగాపై పెట్టడం సరైనదేనా?’’ అని ప్రశ్నించారు.

రైతులకు సబ్సిడీ ఇవ్వరట.. కాంట్రాక్టర్లకు ఎక్సెస్ ఇస్తారట...
‘‘ఇంటికో ఉద్యోగం లేకుంటే నిరుద్యోగభృతి ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దానం చేశారు. రాష్ట్రంలోని 1.75 కోట్ల ఇళ్లకు ప్రతి నెలా రూ. 2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే రూ. 3,500 కోట్లవుతుంది. సంవత్సరానికి రూ. 42,000 కోట్లు కావాలి. ఇందుకు బడ్జెట్‌లో ఎక్కడా నిధులు కేటాయించినట్లు కనబడలేదు’’ అని జగన్ ఎండగట్టారు. ‘‘రాష్ట్రంలో 2013లో సంభవించిన పైలిన్, హెలెన్, లెహెర్ తుపాన్లలో జరిగిన నష్టాలకు సంబంధించి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇమ్మంటే అప్పటి మొత్తం ఇవ్వడానికి మాకేం సంబంధం అని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చెప్పింది. అయితే కాంట్రాక్టర్లకు మాత్రం 2013 సంవత్సరం నుంచి అదనపు (ఎక్సెస్) చెల్లింపులు చేయడానికి జీవో నంబరు 22ను జారీ చేశారు’’ అని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరచి ప్రతిపక్ష వాణిని విని తప్పులను సవరించుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు.

శాసనసభలో ప్రజలకు న్యాయం జరగకపోయినా..
మీడియా ద్వారా మేలు జరగాలి...
సాధారణంగా బడ్జెట్‌పై ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా సరే అన్ని అంశాలనూ ప్రస్తావిస్తూ కూలంకషంగా విశ్లేషిస్తూ ప్రసంగించటం ఆనవాయితీ. అయితే.. గురువారం నాడు అసెంబ్లీలో విపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బడ్జెట్‌పై ప్రసంగం ప్రారంభించాక 50 నిమిషాల ప్రసంగంలోనే ఆరేడుసార్లు అడ్డుకోవటం.. ఆ తర్వాత రైతుల సమస్యలను ప్రస్తావించగానే.. మైక్ కత్తిరించివేయటం.. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. అవకాశం ఇవ్వకపోవడం విదితమే. ఈ నేపథ్యంలో.. బడ్జెట్‌పై ప్రజల పక్షాన ప్రతిపక్షం విశ్లేషణను అభ్యంతరాలను జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నాడు మీడియా ఎదుట వివరించారు. అసెంబ్లీలో గురువారం నాడు తాను చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలనూ క్లుప్తంగా ప్రస్తావించారు. ‘‘బడ్జెట్‌లో పెరుగుదల కనిపించకపోవటం, ప్రణాళికేతర వ్యయాన్ని ఇష్టారీతిగా పెంచేసి చూపించటాన్ని, అదే 2015-16 సంవత్సరంలో ఈ ప్రణాళికా వ్యయాన్ని ఏకంగా రూ. 11 వేల కోట్లు ఎలా తగ్గించారు అనేది వివరించాను.
సీఎం కార్యాలయంలోని కోర్ డాష్ బోర్డు సమాచారం ద్వారా మార్చి 16వ తేదీ వరకూ ఉన్న ఖర్చుల వివరాలను బట్టి.. బడ్జెట్ ఎట్టి పరిస్థితుల్లో రూ. 80 వేల కోట్లను దాటే అవకాశం లేదు. కాదంటే రూ. 90 వేల కోట్లను మించి ఉండే అవకాశం లేకపోయినా.. కానీ బడ్జెట్‌ను సవరించిన అంచనాల్లో ఏరకంగా రూ. 1,12,000 కోట్లను చూపించారనేది వివరించటం జరిగింది’’ అని తెలిపారు. ‘‘సభలో ప్రజలకు న్యాయం జరక్కపోయినా.. మీడియా ద్వారా అయినా ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నానని పేర్కొంటూ బడ్జెట్‌పై తన విశ్లేషణను కొనసాగించారు. చివర్లో మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
Share this article :

0 comments: