రూ.1000 కోట్ల భూ దందా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రూ.1000 కోట్ల భూ దందా!

రూ.1000 కోట్ల భూ దందా!

Written By news on Saturday, April 18, 2015 | 4/18/2015


రూ.1000 కోట్ల  భూ దందా!
► విద్యాసంస్థల స్థాపన పేరుతో జగ్గీ వాసుదేవ్‌కు నజరానా
► కారుచౌకగా త్రిలోచనాపురం అటవీ భూముల విక్రయానికి సిద్ధం
► ఇషా ఫౌండేషన్‌కు కట్టబెట్టేందుకు యత్నాలు
► ప్రతిపాదనలు సిద్ధం చేయిస్తున్న మంత్రి గంటా
► కేంద్ర ప్రభుత్వ ఆమోదం రావడమే తరువాయి


నగర సమీపంలో రూ.1000 కోట్ల భూదందాకు రంగం సిద్ధమైంది. విద్యాసంస్థల స్థాపన పేరుతో యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు అటవీ భూమిని ధారాదత్తం చేసేందుకు ఫైళ్లు సిద్ధం చేశారు. ప్రభుత్వ పెద్దలు దగ్గరుండి మరీ ఈ తంతు నిర్వహిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ : వెయ్యి కోట్ల రూపాయల విలువైన అటవీ భూమిని కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు వ్యూహం పన్నారు. ఇందుకు విద్యా సంస్థల స్థాపన పేరు సాకుగా చెబుతున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు ధారాదత్తం చేసేందుకు ఫైళ్లు సిద్ధం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురం అటవీ భూమిని ఇందుకు ఎంచుకున్నారు. చదునైన భూమి కావడం, పచ్చని చెట్ల మధ్య ఉండడం, చల్లని వాతావరణానికి అనుకూలమైన ప్రాంతం కావడంతో ఈ భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు.

నాలుగు రోజుల కిందట పరిశీలన...
త్రిలోచనాపురంలోని అటవీ భూములను ఈ నెల 15న మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ బాబు.ఎ, అటవీ శాఖ జిల్లా అధికారి రాజశేఖర్‌తో పాటు పలువురు రెవెన్యూ, అటవీ అధికారులు, యోగా గురువు జగ్గీ వాసుదేవ్ కలిసి పరిశీలించారు. వాసుదేవ్ ఈ భూమిని తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు గంటా ప్రకటించారు. ఆయన ఇషా ఫౌండేషన్ పేరుతో తమిళనాడులోని కోయంబత్తూరులో పలు విద్యా సంస్థలు నడుపుతున్నారు.

విద్యా సంస్థలు కొత్త రాజధాని ప్రాంతానికి కావాలని, అందుకు వాసుదేవ్ ముందుకు వచ్చారని మంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికే విజయవాడ పరిసరాల్లో ఎన్నో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా కాలేజీలు ఉన్నాయి. ఇంత మొత్తంలో స్థలం ఇస్తే కాలేజీలు పెట్టేందుకు ముందుకు వచ్చేవారు ఎంతోమంది ఉన్నారు. పైగా ఇషా ఫౌండేషన్ వారు పెడుతున్నది కొత్త కోర్సులేమీ కావు. లా కాలేజీ, ఎంబీఏ, సీఏ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు స్వయంగా వాసుదేవ్ చెప్పుకొన్నారు.

500 ఎకరాలు అప్పగించేందుకు ప్రతిపాదనలు...
ఇక్కడ చదునైన భూమి 400 ఎకరాలు ఉంది. మరో 100 ఎకరాలు కొండ ప్రాంత భూమి కలిపి ఇవ్వాలని అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు, మంత్రి గంటా శ్రీనివాసరావు అటవీ భూమిని పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయించే పనిలో ఉండడంతో ఎలాగైనా వాసుదేవ్‌కు ఈ భూమిని అప్పగించేందుకు పావులు కదుపుతున్నారని అర్థమవుతోంది. అటవీ భూముల్లో అనుమతుల్లేకుండా చెట్లు కొట్టకూడదు. త్రిలోచనాపురం అటవీ ప్రాంతంలో భూమిని మాత్రం పూర్తిస్థాయిలో చెట్లు కొట్టి చదును చేశారు. ఎందుకు ఇలా జరిగిందంటే అటవీ శాఖ అధికారుల వద్ద సమాధానం లేదు.

ఎకరా రూ.2 కోట్లు...
ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. ఇబ్రహీంపట్నానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ భూమి ఉంది. ఇంత విలువైన భూమిని ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలకు ఇచ్చేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తోందనేది చర్చనీయాంశంగా మారింది. ఇందులో లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయనేది సుస్పష్టమని పలువురు పేర్కొంటున్నారు.

ఇంకా ఫైనల్ కాలేదు -డీఎఫ్‌వో రాజశేఖర్‌బాబు
త్రిలోచనాపురంలోని అటవీ భూములను ప్రైవేటు వారికి ఏ నిబంధన ప్రకారం ఇస్తున్నారనేది ఇంకా ఫైనల్ కాలేదని డీఎఫ్‌వో రాజశేఖర్‌బాబు చెప్పారు. ఇషా ఫౌండేషన్‌కు అటవీ భూములు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండడాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా.. మంత్రి, ఇతర అధికారులు వచ్చి చూసి వెళ్లారని తెలిపారు. అటవీ భూములు తీసుకోవాలనుకునేవారు ఆన్‌లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని  వివరించారు.
Share this article :

0 comments: