చుక్క నీరు రాకముందే.. 70 టీఎంసీలు కోల్పోతాం. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చుక్క నీరు రాకముందే.. 70 టీఎంసీలు కోల్పోతాం.

చుక్క నీరు రాకముందే.. 70 టీఎంసీలు కోల్పోతాం.

Written By news on Thursday, April 16, 2015 | 4/16/2015


  • వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
  • ఏడాదికి రూ. 4,000 కోట్ల పనులు చేస్తే పూర్తయ్యే పోలవరానికి బాబు సర్కారు 11 నెలల్లో రూ. 100 కోట్ల పనులే పూర్తి చేసింది
  • పోలవరాన్ని విస్మరిస్తే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు
  • ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పాలి
  • పట్టిసీమ ప్రాజెక్టుతో డెల్టా రైతాంగం అన్ని విధాలా నష్టపోతుంది
  • పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేస్తామన్న మాటల్లో వాస్తవం లేదు
  • జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే రాయలసీమపై బాబు బూటక ప్రేమ
  • పట్టిసీమలో రచ్చబండలో రైతులతో ముఖాముఖిలో జగన్ ధ్వజం
  • పార్టీ ప్రజాప్రతినిధులతో కలసి పోలవరాన్ని సందర్శించిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు.. గోదావరి డెల్టా రైతులకు అండగా ఉంటామని భరోసా
  • పట్టిసీమ ప్రాజెక్టుతో డెల్టా రైతాంగం అన్ని విధాలా నష్టపోతుంది
  • గోదావరి నుంచి చుక్క నీరైనా కృష్ణా డెల్టాకు చేరకముందే 70 టీఎంసీల కృష్ణా నికర జలాలను రాష్ట్రం కోల్పోయే ప్రమాదముంది
  • 21.9 శాతం ఎక్కువకు టెండరు కోట్ చేసిన పట్టిసీమ కాంట్రాక్టరుకు..
  • ఏడాదిలో పూర్తి చేస్తే 16.9 శాతం బోనస్ హామీ డబ్బులెత్తే కార్యక్రమమే
 ‘‘పోలవరం పూర్తయితే 194 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని గోదావరి డెల్టాకు రెండో పంటకు నీళ్లు ఇచ్చుకునే వెసులు బాటు ఉన్నపుడు పట్టిసీమ వల్ల ఏం ప్రయోజనం ఉందో అర్థం కావడం లేదు? నిల్వ సామర్థ్యం లేని పట్టిసీమ ప్రాజెక్టు వల్ల డెల్టా రైతాంగం అన్ని విధాలా నష్టపోవడం ఖాయం. రెండో పంటకు నీళ్లు అందకపోతే భూములు ఉప్పుతేలి చౌడుబారతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే పట్టించుకునే స్థితిలో బాబు లేరు. ... గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి వచ్చింది కాబట్టి 35 టీఎంసీలు, పట్టిసీమ ద్వారా కుడికాల్వకు మళ్లిస్తామని ప్రభుత్వం చెబుతున్న 80 టీఎంసీల్లో మరో 35 టీఎంసీలు.. మొత్తం 70 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలు మన రాష్ట్రానికి దక్కే కృష్ణా నికర జలాల నుంచి తీసుకోవడానికి స్వేచ్ఛ లభిస్తుంది. అంటే.. గోదావరి నుంచి చుక్కనీరు కృష్ణా డెల్టాకు చేరకముందే.. 70 టీఎంసీల కృష్ణా నికర జలాలను ఎగువ రాష్ట్రాలకు కోల్పోయే ప్రమాదం ఉంది.’’

సాక్షి, విజయవాడ బ్యూరో: కాంట్రాక్టర్ల ద్వారా దక్కే కోట్ల రూపాయల కమీషన్ల కోసమే చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని.. రైతుల ప్రయోజనాలను తుంగలో తొక్కి ధనార్జనే ధ్యేయంగా ముందుకు పోతున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పోలవరం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం చేకూరితే.. పట్టిసీమ వల్ల కాంట్రాక్టర్ల ద్వారా లబ్ధి పొందే చంద్రబాబుకు మాత్రమే ప్రయోజనమని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును విస్మరిస్తే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు.

చంద్రబాబుకు బుద్ధొచ్చేలా పట్టిసీమపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగంగానే ప్రాజెక్టుల యాత్ర చేపట్టామని చెప్పారు. జగన్ బుధవారం ఉదయం 11 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీకి చేరుకున్నారు. అక్కడ సర్ అర్థర్ కాటన్, వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంత రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. సాయంత్రం 5 గంటలకు పట్టిసీమ రేవు దగ్గర ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు.

డెల్టా రైతాంగం అన్ని విధాలా నష్టపోతుంది...
పోలవరం ప్రాజెక్టును పట్టించుకోకుండా పట్టిసీమను భుజాన వేసుకోవడం వెనుక బాబు ధనార్జన దాగి ఉందని ధ్వజమెత్తారు. పట్టిసీమపై పెట్టిన శ్రద్ధలో పదో వంతైనా పోలవరంపై పెడితే ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందని పేర్కొన్నారు. ఏడాదికి రూ. 4,000 కోట్ల పనులు చేస్తే పూర్తయ్యే పోలవరం పనులను చంద్రబాబు ప్రభుత్వం 11 నెలల్లో రూ. 100 కోట్ల పనులే పూర్తి చేసిందని.. దీన్నిబట్టి పోలవరంపై బాబుకున్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతుందని విమర్శించారు. నెలనెలా పోలవరం గడువును పెంచుతూ పోతున్న చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టును విస్మరిస్తే భవిష్యత్తులో చరిత్ర హీనుడిగా మిగలడం ఖాయమన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల 194 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని గోదావరి డెల్టాకు రెండో పంటకు నీళ్లు ఇచ్చుకునే వెసులు బాటు ఉన్నపుడు పట్టిసీమ వల్ల ఏం ప్రయోజనం ఉందో అర్థం కావడం లేదని జగన్ పేర్కొన్నారు. నిల్వ సామర్థ్యం లేని పట్టిసీమ ప్రాజెక్టు వల్ల డెల్టా రైతాంగం అన్ని విధాలా నష్టపోవడం ఖాయమన్నారు.

చుక్క నీరు రాకముందే.. 70 టీఎంసీలు కోల్పోతాం...
‘‘గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోని 7(ఇ) ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి లభించిన వెంటనే, కుడికాల్వకు ఎప్పుడు నీటిని మళ్లిస్తారనే విషయంతో సంబంధం లేకుండా.. 80 టీఎంసీల్లో 35 టీఎంసీల కృష్ణా నీటిని ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వాడుకొనే స్వేచ్ఛ ఉంటుంది. అదేవిధంగా 7(ఎఫ్) ప్రకారం.. కుడికాల్వకు మళ్లించే 80 టీసీఎంలకు అదనంగా మళ్లించే నీటిలోనూ ఎగువ రాష్ట్రాలకు వాటా ఉంటుంది. అదనంగా మళ్లించే నీటిలోనూ 7(ఇ)లో పేర్కొన్న దామాషా ప్రకారం వాటా పొందే హక్కు ఎగువ రాష్ట్రాలకు ఉంటుంది. దీని ప్రకారం చూస్తే.. పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి వచ్చింది కాబట్టి 35 టీఎంసీలు, పట్టిసీమ ద్వారా కుడికాల్వకు మళ్లిస్తామని ప్రభుత్వం చెబుతున్న 80 టీఎంసీల్లో మరో 35 టీఎంసీలు.. మొత్తం 70 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలు మన రాష్ట్రానికి దక్కే కృష్ణా నికర జలాల నుంచి తీసుకోవడానికి స్వేచ్ఛ లభిస్తుంది. అంటే.. గోదావరి నుంచి చుక్కనీరు కృష్ణా డెల్టాకు చేరకముందే.. 70 టీఎంసీల కృష్ణా నికర జలాల్ని ఎగువ రాష్ట్రాల కు కోల్పోయే ప్రమాదం ఉందని’’ ఆందోళన వ్యక్తంచేశారు.

టెండర్లలోనూ డబ్బులెత్తే మోసమే...
పట్టిసీమ టెండర్లలోనూ మోసాలే జరిగాయని జగన్ దుయ్యబట్టారు. కేవలం ఇద్దరే ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారనీ, దగ్గరుండి మిగతా కాంట్రాక్టర్లు రాకుండా భయపెట్టారని ధ్వజమెత్తారు. 21.9 శాతం ఎక్కువకు టెండరు కోట్ చేసిన పట్టిసీమ కాంట్రాక్టరుకు.. ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తే 16.9 శాతాన్ని బోనస్‌గా ఇస్తామని సర్కారు హామీ ఇవ్వడం మమ్మూటికీ డబ్బులెత్తే కార్యక్రమాన్ని తేటతెల్లం చేస్తోందని వివరించారు. పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామంటున్న ప్రభుత్వ మాటల్లో వాస్తవం లేదన్నారు. మిగిలి ఉన్న పోలవరం కుడికాల్వ పనులు, 1,800 ఎకరాల భూ సేకరణ, రామిలేరు, తమ్మిలేరు వాగులపై ఆక్విడెక్టుల నిర్మాణం వంటి మేజర్ పనులకే రెండేళ్ల సమయం పడుతుందన్నారు.

గోదారి ఎడారే..
గోదావరి మీద తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులు పూర్తయితే 70 వేల క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తారని, పట్టిసీమ ద్వారా మరో 8,500 క్యూసెక్కుల నీటిని తోడితే.. మొత్తం 80 వేల క్యూసెక్కుల నీటిని తోడినట్లువుతుందని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ వివరించారు. వరద లేనప్పుడు గోదావరిలో 5,000 క్యూసెక్కుల ప్రవాహమే ఉంటుందని.. అలాంటపుడు భారీగా నీరు తోడిస్తే గోదారి ఎడారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కుడికాల్వ ద్వారా పారి శ్రామిక అవసరాలకు నీరిస్తామని బాబు ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. ఇది ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమరు. ఇది తప్పకుండా చంద్రబాబు నీటిచౌర్యమేనని, మన ఇళ్లల్లో దొంగలు పడితే ఎలా కాచుకుంటామో, ఇప్పు డూ నీటి దొంగను కాచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు సుబ్బారాయుడు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కడం వైఎస్ పుణ్యమేనని చెప్పారు. గోదావరి డెల్టా రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమను సంఘటితంగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. పార్టీ నేతలు తెల్లం బాలరాజు, కారుమూరు నాగేశ్వరరావు, రైతు సంఘం నేత త్రినాథరెడ్డి తదితరులు ప్రసంగించారు.

సీమపై కపట ప్రేమ...
జగన్‌ను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోనే రాయలసీమకు నీరంటూ ప్రభుత్వం లేనిపోని ప్రేమను ఒలకబోస్తోందని ఆయన విమర్శించారు. ‘‘వాస్తవంగా సీమకు నీరిచ్చే వారైతే పోతిరెడ్డిపాడు దిగువన ఉన్న పెండింగ్ పనులకు ఇప్పటి వరకూ దమ్మిడీ ఖర్చు పెట్టలేదేం?’’ అని ప్రశ్నించారు. గాలేరు - నగరి ప్రాజెక్టుకు వాస్తవంగా రూ. 2,600 కోట్లు అవసరం కాగా, బడ్జెట్‌లో కేవలం రూ. 169 కోట్లు కేటాయించడం ఏమిటని జగన్ అడిగారు. రూ. 5,800 కోట్లతో పూర్తి చేయాల్సిన హంద్రీ - నీవా ప్రాజెక్టుకు 9 ఏళ్ల చంద్రబాబు హయాంలో కేవలం రూ. 13 కోట్లు మాత్రమే ఖర్చు చేశారనీ, మిగతా పనులు పూర్తి చేసేందుకు ప్రస్తుతం రూ. 1,100 కోట్లు అవసరమైతే, బడ్జెట్‌లో కేవలం రూ. 200 కోట్లు కేటాయించారని ఎండగట్టారు. దీన్నిబట్టి సీమపై ప్రేమ ఏపాటిదో ప్రజలకు తెలుస్తూనే ఉందన్నారు. అసలు పట్టిసీమకు కేటాయింపులను బడ్జెట్‌లో చూపనే లేదన్నారు. పట్టిసీమకు పరిపాలనా అనుమతులు ఇచ్చిన జీవోలో రాయలసీమ గురించి కనీస ప్రస్తావన కూడా లేదని, రైతుల పేరూ లేదని పేర్కొన్నారు. రుణ మాఫీ సంగతెలాగున్నా వడ్డీ మాఫీ కూడా జరగలేదని.. కానీ రైతులు, డ్వాక్రా మహిళలకు అన్నీ చేసేశాననీ, అందుకే శాలువాలు కప్పుతున్నారని బాబు సంబరపడిపోవడం విస్మయం కలిగిస్తోందని జగన్ ఎద్దేవా చేశారు.

పట్టిసీమతో మాకు కష్టాలే
విపక్ష నేతవద్ద గోడు వెళ్లబోసుకున్న రైతులు
పట్టిసీమ నుంచి సాక్షి ప్రతినిధి: బస్సుయాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం పట్టిసీమకు చేరుకున్నారు. రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ప్రతిపక్ష నేతకు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

రెండో పంటకు నీళ్లందవు
పోలవరం వస్తే ఉభయగోదావరి జిల్లాలకు సాగు, తాగు నీరు సమృద్ధిగా అందుతాయి. రెండో పంటకూ పుష్కలంగా నీరొస్తుంది. పట్టిసీమ ఎత్తిపోతల వల్ల రెండోపంటకు నీళ్లందవు. కయ్యల్లో ఉప్పు తేలుతుంది. అలా జరిగితే మా భూములు సాగుకు పనికిరావు.    - రామకృష్ణ, ఉంగుటూరు నియోజకవర్గం

గోదావరి డెల్టా రైతుల పొట్ట కొట్టినట్టే
నాకు ఐదెకరాల పొలం ఉంది. సీలేరు నుంచి వస్తున్న నీరు రెండోపంటకు చాలడం లేదు. పట్టిసీమ ప్రాజెక్టుకట్టి ఉన్న ఈ కాసిని నీళ్లూ తీసుకెళితే.. గోదావరి డెల్టా రైతుల పొట్టగొట్టినట్లే. ఉభయగోదావరి ఎమ్మెల్యేలకు సిగ్గుంటే.. పట్టిసీమను ఆపండి.     - శ్రీనివాస్, రాయవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా

కడదాకా పోరాడతాం
ఎత్తిపోతల పథకం కావాలా? ఎత్తుకొనిపోయే మూటలు కావాలా చంద్రబాబూ? రాయలసీమను రతనాలసీమ చేస్తానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలను కరువు సీమగా మార్చడం మాత్రం నిజం. తుది వరకు పోరాడి పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకుంటాం.
     - రామచంద్ర, బంగారంపేట, పట్టిసీమ

సరైన పద్ధతి కాదు
 పట్టిసీమ జీవో బూటకం. 11 మీటర్ల వద్ద ఫుట్‌వాల్వ్ వేసి నీటిని లిఫ్ట్ చేస్తే ధవళేళ్వరం వద్ద నిల్వ ఉన్న 3 టీఎంసీల నీటిలో 2.5 టీఎంసీల నీటిని తోడేయడానికి అవకాశం ఉంటుంది. ఇది సరైన పద్ధతి కాదు.
 - రాజేశ్వరరావు, రిటైర్డ్ ఈఎన్‌సీ
Share this article :

0 comments: