అడుగులో అడుగులై.. కదన సింహాలై.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడుగులో అడుగులై.. కదన సింహాలై..

అడుగులో అడుగులై.. కదన సింహాలై..

Written By news on Saturday, April 18, 2015 | 4/18/2015


అడుగులో అడుగులై..  కదన సింహాలై..
జనం తోడుగా.. అన్నదాత వెంట నడవగా..అభిమాన సంద్రం ఉప్పొంగింది. ప్రభుత్వ  తీరును ఎండగట్టగ ఊరూవాడా ఒక్కటైకదిలింది. ఆ ఒక్క అడుగుకు వేలాది అడుగులు జతకట్టగా.. ‘పట్టి’సీమ వెనుక ధనయజ్ఞాన్ని జనం గొంతుక ఎలుగెత్తింది.రైతన్న వెన్నెముకగా.. ప్రజల కష్టాలను పాల్పంచుకునే నేస్తంగా.. జగమంత కుటుంబంలో ఒకనిగా సీమ వాకిట కాలిడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా  నీరాజనం లభించింది.  జల‘విఘ్నా’లపై  బాణం ఎక్కుపెట్టిన నేత ఆశయ సిద్ధికి
 అశేష జనం సలాం చేసింది.
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సుయాత్ర అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. యాత్ర ప్రకటించిన తర్వాత రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి జిల్లాలో రెండు పర్యాయాలు పర్యటించడమే ఇందుకు నిదర్శనం. పార్టీ ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి శుక్రవారం జిల్లాలో జగన్ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతమైంది. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఆయన అడుగడుగునా ఎండగట్టారు. ప్రతి ప్రాజెక్టుకు ఎంత మేర నిధులు అవసరం? బడ్జెట్‌లో ఎంత కేటాయించారనే వివరాలను ఆయన మాట్లాడిన ప్రతీ చోట వివరించే ప్రయత్నం చేశారు.
 
  రాయలసీమలోని ప్రాజెక్టులను పూర్తిచేయాలనే సంకల్పం చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని ఆయన విశదీకరించారు. జిల్లాలోని సిద్దాపురం, బానకచర్ల క్రస్ట్‌గేట్లు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీతో పాటు మల్యాల వద్ద ఉన్న అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి(ఏవీఆర్‌హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టులను ఆయన శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకూ సందర్శించారు. అక్కడున్న రైతులతో ముచ్చటించారు. జిల్లాలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం యాత్రలో రోడ్డుపొడవునా జనం నీరాజనం పలికారు.
 
 హడావుడిగా మంత్రి పర్యటన
 జగన్‌మోహన్‌రెడ్డి బస్సుయాత్ర ప్రారంభిస్తున్నారనే ప్రకటన వెలువడగానే రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి జిల్లాలో రెండు పర్యాయాలు పర్యటించారు. ప్రాజెక్టులను పూర్తి చేస్తామని నమ్మబలికే ప్రయత్నం చేశారు. అయితే నిధుల కేటాయింపుపై ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానం లేకపోయింది. కేవలం మంత్రి పర్యటనలతో లాభం లేదనుకున్న ప్రభుత్వం.. హడావుడిగా ప్రాజెక్టుల వద్ద పెండింగ్ పనులను ప్రారంభించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ కెనాల్ విస్తరణ పనులను నామమాత్రంగా రెండు జేసీబీలు, మూడు ట్రిప్పర్లతో హడావుడి చేసింది.
 తెలివితక్కువోళ్లం కాదన్న రైతులు
 జగన్ పర్యటన సందర్భంగా మాట్లాడిన రైతులు ప్రాజెక్టులపై చంద్రబాబు చూపిన అలసత్వం, నిర్లక్ష్యాన్ని తమ అనుభవ పూర్వకంగా ఎండగట్టారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు నిధులివ్వని చంద్రబాబు ప్రభుత్వం.. పట్టిసీమ నుంచి సీమకు నీళ్లు ఇస్తామంటే నమ్మేందుకు తెలివితక్కువోళ్లమా అని ప్రశ్నించారు. రాయలసీమపై చంధ్రబాబుది కపట ప్రేమ అని రైతులు ఘాటుగా విమర్శించారు.
 
  వైఎస్ ఉన్నప్పుడు ఎస్‌ఆర్‌బీసీ నుంచి మూడుకార్లు పంట పండించుకున్నామని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు ఒక్క పంటకు కూడా సరిగ్గా నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై చేసే పోరాటంలో కలిసి వస్తామని ఆయన పర్యటన మొత్తం కదలివచ్చిన జిల్లా ప్రజలు హామీనిచ్చారు. ఉదయం 11 గంటలకు సిద్ధాపురం చెరువు వద్ద మొదలైన ఈ యాత్ర రాత్రి 10 గంటలకు హంద్రీనీవా వద్ద ముగిసింది. అనంతరం ఆయన బ్రహ్మణకొట్కూరులోని గౌరు వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు.
 
 అక్కడి నుంచి నేరుగా ఆయన హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, గౌరు చరితారెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, భూమా అఖిలప్రియ, మణిగాంధీ, ఐజయ్య, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి జగన్మోహన్ రెడ్డి, బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి కాటసాని రాంరెడ్డి, పార్టీ నేతలు బుడ్డా శేషారెడ్డి, సీఈసీ సభ్యుడు హఫీజ్ ఖాన్, తెర్నేకల్లు సురేందర్ రెడ్డి, డీకే రాజశేఖర్, నర్శింహులు యాదవ్, కృష్ణారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, భరత్‌కుమార్ రెడ్డి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: