వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి లేదు

వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి లేదు

Written By news on Tuesday, April 7, 2015 | 4/07/2015

 ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డికి లేదని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక వైఎస్ గెస్ట్ హౌస్‌లో వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంపీ సురేష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్, మైనార్టీ నగర అధ్యక్షుడు ఎస్‌ఎండీ షఫీ, బీసీ విభాగం నగర అధ్యక్షుడు మహిమలూరి వెంకటేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టిసీమను అడ్డుకొంటూ వైఎస్ జగన్ రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని సతీష్‌రెడ్డి మాట్లాడటం దారుణమన్నారు.

జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టు ఎందుకు చేపట్టారని మాత్రమే వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నారని, ఇది తెలుసుకోకుండా విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి పదినెలలు కావొస్తున్నా స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేసిన పాపాన పోలేదన్నారు. నిధులేమీ విడుదల చేయకుండా నీళ్లు ఎలా ఇస్తారో సతీష్‌రెడ్డి చెప్పాలన్నారు. నీటి ఎద్దడిని ముందే ఊహించిన ఎంపీ అవినాష్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషాలు నెలరోజులకు ముందునుంచే ఇరిగేషన్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో మాట్లాడి అలగనూరు, వెలుగోడు రిజర్వాయర్‌ల నుంచి నీరు విడుదలయ్యేలా కృషి చేశారన్నారు.

నేడు కడప కార్పొరేషన్‌లో రెండు, మూడు రోజులకు నీరిస్తున్నారంటే  వారి కృషే కారణమన్నారు. మరో వైపు పీబీసీ నీటికోసం వైఎస్ అవినాష్‌రెడ్డి పాదయాత్ర చేయగా, గండికోట ప్రాజెక్టును పూర్తి చేయాలని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి ఆమరణ దీక్ష చేశారని గుర్తు చేశారు. పీబీసీకి ప్రభుత్వం నీటిని విడుదల చేశాక చొంగచాటుగా గండికొట్టిన ఘనత టీడీపీ నేతలకే దక్కుతుందన్నారు. దీనిపై కూడా వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గండికొట్టిన ప్రాంతం వద్ద నిరసన తెలిపి అరెస్ట్ కూడా అయ్యారన్నారు. జిల్లాలో నీటి సమస్యపై చిత్తశుద్దితో పోరాటం చేస్తున్నది వైఎస్‌ఆర్‌సీపీయేనన్నారు.

సతీష్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు మెప్పుకోసం విమర్శలు చేయడం సరికాదన్నారు. పదవుల కోసం టీడీపీ నేతలు పిరికివారిగా మారారని విమర్శించారు. సతీష్‌రెడ్డికి దమ్ముంటే చంద్రబాబును నిలదీసీ జిల్లాకు రావలసిన నీళ్లు, నిధులను సాధించాలని సవాల్ విసిరారు.
Share this article :

0 comments: