అనంతలో వైఎస్ఆర్ సీపీ శ్రేణుల ఆందోళన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అనంతలో వైఎస్ఆర్ సీపీ శ్రేణుల ఆందోళన

అనంతలో వైఎస్ఆర్ సీపీ శ్రేణుల ఆందోళన

Written By news on Wednesday, April 29, 2015 | 4/29/2015

అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యానంతరం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో ప్రసాద్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. ప్రసాద్ రెడ్డి హత్యను నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ప్రసాద్ రెడ్డి మృతదేహంతో ఆస్పత్రి నుంచి ఎస్పీ కార్యాలయం వైపునకు ర్యాలీగా వెళ్లేందుకు వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రయత్నించారు. పోలీసులు వైఎస్ఆర్ సీపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతపురం జిల్లా రాప్తాడు తాహసీల్దార్ కార్యాలయంలో పట్టపగలు ప్రసాద్ రెడ్డిని దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే.  ఈ రోజు ఉదయం ఆరుగురు దుండగులు  ఎమ్మార్వో కార్యాలయంలోకి ప్రవేశించి... అక్కడే ఉన్న ప్రసాద్ రెడ్డిపై వేట కొడవళ్లతో దాడి చేసి దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
అనంతపురం జిల్లా రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఉదయం వైఎస్ ఆర్ సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ప్రసాద్ రెడ్డిని దుండగులు హత్యచేసిన తీరు ఇలా ఉంది..

ప్రసాద్ రెడ్డిని బుధవారం ఉదయం 11 గంటల 40 నిమిషాలకు తహసీల్దార్ కార్యాలయంలో దుండుగులు హత్య చేశారు. ప్రసాద్ రెడ్డిని పథకం ప్ర్రకారమే హత్య చేసేందుకు దుండగులు పూనుకున్నట్టు ఈ హత్య జరిగిన తీరుతో స్పష్టమవుతోంది. అందులో భాగంగానే... అనుకున్నట్టుగా తహసీల్దార్ కార్యాలయంలోకి దుండగులు ప్రవేశించారు. ప్రసాద్ రెడ్డి కంప్యూటర్ రూంలోకి వెళ్లగానే దుండగులు తలుపులన్నీ మూసేశారు. దాంతో భయపడిపోయిన తహసీల్దార్, ఇతర ఉద్యోగులు వెంటనే బయటకు పారిపోయారు. ప్రసాద్ రెడ్డిపై మూకుమ్మడిగా 10 మంది దుండగులు వేటకొడవళ్లతో దాడి చేసి, అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఇంతలో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి రావడంతో దుండగులు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. దుండగులంతా బైకులపై వచ్చి ప్రసాద్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. అయితే పథకం ప్రకారమే ముందుగా వేటకొడవళ్లను తహసీల్దార్ కార్యాలయంలో దాచిపెట్టినట్టుగా సమాచారం.

ఈ హత్యకేసులో రాప్తాడు ఎస్ ఐ నాగేంద్రప్రసాద్ పాత్ర ఉండొచ్చని ప్రసాద్ రెడ్డి అనుచరులు అరోపిస్తున్నారు. ప్రసాద్ రెడ్డి మృతదేహం వద్ద నాగేంద్రప్రసాద్ నేమ్ బ్యాడ్జి ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రస్థాయిలో నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి.  ఇదిలా ఉండగా, ప్రసాద్ రెడ్డి హత్య వెనుక మంత్రి పరిటాల సునీత హస్తముందని ప్రసాద్ రెడ్డి సోదరుడు మహానందరెడ్డి ఆరోపించారు. మంత్రి సునీత సోదరుడు మురళి, కుమారుడు శ్రీరాంల హస్తం ఉందని ఆరోపణలు వెలువెత్తున్నాయి. కొన్నిరోజులుగా ఎస్ ఐ నాగేంద్రప్రసాద్ వైఎస్ ఆర్ సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ మహానందరెడ్డి ఆరోపిస్తున్నారు.


Share this article :

0 comments: