బాబూ.. జాబు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబూ.. జాబు!

బాబూ.. జాబు!

Written By news on Thursday, May 28, 2015 | 5/28/2015

♦ పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్య
♦ టీడీపీ ఏడాది పాలనలో డీఎస్సీతో సరి
♦ జన్మభూమి కమిటీల సర్వేలో తేలిన నిరుద్యోగుల సంఖ్య 1,03,000
♦ వాస్తవంలో 8లక్షల పైమాటే
♦ నోటి మాటగా మారిన ఎన్నికల హామీ

 
 కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఇంటికో ఉద్యోగం.. నిరుద్యోగ భృతి రూ.2వేలు.. జాబు కావాలంటే బాబు రావాలనే ప్రచారం నోటి మాటగానే మిగిలిపోతోంది. ఎన్నికల వేళ ఇలాంటి హామీలను ఊదరగొట్టిన టీడీపీ నేతలు ఇప్పుడా ఊసే మరిచారు. ముఖ్యమంత్రి సైతం ఉద్యోగాల మాట మరిచి.. ఉన్న ఉద్యోగులనూ ఇంటికి పంపుతున్నారు. ఏడాది పాలనలో ఒక్క డీఎస్సీ తప్పిస్తే.. ఇతరత్రా నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం హామీల అమలులో ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 8.90 లక్షల కుటుంబాలు ఉన్నాయి.

ఈ కుటుంబాల్లో సుమారు 8 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నట్లు అంచనా. వీరిలో ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్‌లో నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య 92వేలు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కమిటీల ద్వారా చేయించిన సర్వేలో నిరుద్యోగుల సంఖ్య 1,03,000 మందిగా తేలింది. లెక్కల మాటల ఎలాగున్నా యేటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవం. 2014లో ఇంటర్ అర్హతతో నిర్వహించిన వీఆర్వో పరీక్షకు దాదాపు 8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అదే ఏడాది డిగ్రీ క్వాలిఫికేషన్‌తో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి పోస్టులకు 4 లక్షల మంది హాజరయ్యారు. ఈ సంఖ్య నిరుద్యోగ భారతాన్ని తెలియజేస్తోంది.

 నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపు
 జిల్లాలోని నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రమే విడుదల కాగా.. మొత్తం 700 పోస్టుల్లో దాదాపు 500 ఎస్జీటీవే. వీటికి బీఎడ్ అభ్యర్థులకు అర్హత లేకపోవడం నిరుద్యోగులను నిరాశపర్చింది. ప్రధానంగా జిల్లాలోని యువకులు పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 తదితర పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వీటి ఊసే లేకపోవడంతో వయస్సు పైబడిపోతుందని వాపోతున్నారు. వేలకు వేలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకొని నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ తల్లిదండ్రులకు భారమవుతుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ఊడిన ఉద్యోగాలు
 చంద్రబాబు  ముఖ్యమంత్రి అయ్యాక గృహనిర్మాణ, వ్యవసాయశాఖల్లో ఉద్యోగులను ఇంటికి పంపారు. వ్యవసాయ శాఖలో దాదాపు వంద మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, గృహనిర్మాణ శాఖలో 168 మంది ఉద్యోగులను తొలగించారు. వీరంతా ఇతర ఉద్యోగాల్లో చేరేందుకు వయస్సు మీరిపోవడం.. ఉన్న ఉద్యోగం పోవడంతో కుటుంబ పోషణ భారమై దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
Share this article :

0 comments: