నాలుగు రోజులు గడువిస్తున్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాలుగు రోజులు గడువిస్తున్నా

నాలుగు రోజులు గడువిస్తున్నా

Written By news on Wednesday, May 13, 2015 | 5/13/2015


* ఈలోపు ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త బంద్
ప్రభుత్వానికి వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ అల్టిమేటం
కార్మికుల డిమాండ్లు అంగీకరించకపోతే రాష్ట్రాన్ని స్తంభింపచేస్తాం
అధికారపార్టీ నేతల చేతుల్లో హత్యకు గురైన
పార్టీ నేతల కుటుంబాలకు జగన్ పరామర్శ


అనంతపురం జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నాలుగు రోజుల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. మరో నాలుగు రోజుల్లో ప్రభుత్వం స్పందించి, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు అంగీకరించకపోతే అందరినీ కలుపుకుని రాష్ట్రవ్యాప్త బంద్ చేపడతామని, రాష్ట్రం మొత్తాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో చేపడుతున్న రెండోవిడత రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన మంగళవారం అనంతపురం జిల్లా బస్టాండుకు చేరుకుని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పలికారు. ఆర్టీసీ కార్మికుల 43 శాతం ఫిట్‌మెంట్ డిమాండ్ సమంజసమేనని, దానికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని చెప్పారు. ‘‘చంద్రబాబుగారూ.. ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు ఏం హామీలిచ్చారో ఒక్కసారి గుర్తుచేసుకోండి.

2014 ఏప్రిల్ 16న ఆర్టీసీ కార్మికులకు కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. ఇప్పుడు కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాకపోయినా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వమని ఆర్టీసీ కార్మిక సోదరులు అడుగుతున్నా పట్టించుకోవడంలేదు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ఖాతరు చేయడంలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న మాటెత్తడంలేదు. ఎన్నికల్లో గెలిచాం, ఇప్పట్లో వారి అవసరం లేదనేనా మాట మారుస్తున్నారు? మీ కప్పదాటు వైఖరిని రాష్ట్ర ప్రజలు సహించరు. మీకు నాలుగు రోజులు సమయం ఇస్తున్నాం. ఈలోపు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు తీర్చకపోతే రాష్ట్రం మొత్తాన్నీ స్తంభింపచేస్తాం’’ అని జగన్ అల్టిమేటం జారీ చేశారు.

జగన్ యాత్ర సాగిందిలా...

అనంతపురం జిల్లాలో రెండోరోజు మంగళవారం రైతు భరోసా యాత్ర తోపుదుర్తి నుంచి ప్రారంభమైంది. జగన్ అక్కడి నుంచి నేరుగా బస్టాండులో ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికుల వద్దకు చేరుకుని వారికి మద్దతు ప్రకటించారు. అనంతరం బుక్కరాయసముద్రం మీదుగా ఎల్లుట్లకు చేరుకున్నారు. అక్కడ అధికారపార్టీ నేతల చేతుల్లో హత్యకు గురైన మల్లికార్జున కుటుంబాన్ని పరామర్శించారు. ఎల్లుట్ల నుంచి తిరిగి వస్తుండగా గూగూడు గ్రామ ప్రజలు రోడ్డుపై అడ్డంగా నిల్చున్నారు.. తమ గ్రామానికి రావాల్సిందేనని, గ్రామంలోని కుళ్లాయి స్వామిని దర్శించుకోవాల్సిందేనని పట్టుబట్టారు. ‘సమయం మించిపోతోంది, మరోసారి వస్తాన’ని చెప్పినా గ్రామప్రజలందరూ భీష్మించడంతో జగన్ గ్రామానికి చేరుకుని కుళ్లాయి స్వామిని దర్శించుకున్నారు. అటునుంచి అనంతపురం, గుత్తి మీదుగా అప్పేచర్ల గ్రామానికి వచ్చారు.

ఈ సందర్భంగా పామిడి, అప్పేచర్లకు మధ్యలో ఉన్న గ్రామాల్లో ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. అధికారపార్టీ నేతల చేతుల్లో హత్యకు గురైన సింగిల్‌విండో అధ్యక్షుడు భాస్కరరెడ్డి కుటుంబాన్ని జగన్ ఓదార్చి ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి గుంతకల్ నియోజకవర్గంలోని టి.కొత్తపల్లి గ్రామానికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు సి.ఓబుళరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాష, పార్టీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, శింగనమల నియోజకవర్గ ఇన్‌చార్జి జొన్నలగడ్డ పద్మావతి, తాడిపత్రి నియోజకవర్గ ఇన్‌చార్జి వీఆర్ రామిరెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ అదనపు సమన్వయకర్త రమేష్‌రెడ్డి, పార్టీ నేతలు ధర్మవరం పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి సోదరుడు రెడ్డపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: