సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్

సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్

Written By news on Tuesday, May 12, 2015 | 5/12/2015


నాతో రా... రైతుల బాధలు చూపిస్తాఅనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో సోమవారం రాత్రి జరిగిన బహిరంగ సభకు హాజరైన జనం. ప్రసంగిస్తున్న వైఎస్ జగన్
నాతో రా... రైతుల బాధలు చూపిస్తా

సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్

⇒ రుణమాఫీ చేస్తామని రైతులకు పంగనామాలు పెట్టారు
⇒ బాబు పుణ్యమాఅని ఒక్క అనంతపురం జిల్లాలోనే 66 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
⇒ మరో 11 మంది చేనేత కార్మికులు ఉసురు తీసుకున్నారు
⇒ ప్రభుత్వ వైఫల్యాలపై గుంటూరులో రెండు రోజుల దీక్ష
⇒ అనంతపురం జిల్లా తోపుదుర్తి సభలో మండిపడ్డ వైఎస్ జగన్


అనంతపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నాతో రా... రాష్ట్రంలో రైతుల కష్టాలు, కన్నీళ్లు, ఈతి బాధలు చూపిస్తా... అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సవాలు విసిరారు. రుణమాఫీ చేస్తానని రైతన్నల ఓట్లను కొల్లగొట్టుకుని... అధికారం చేపట్టాక పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. 2013 సంవత్సరంలో మూడు తుపానులు, కరువు రైతుపై ముప్పేట దాడిచేస్తే...2014లో ముఖ్యమంత్రిగా ఆదుకోవాల్సిన చంద్రబాబు ఇన్‌పుట్ సబ్సిడీని ఎగ్గొట్టి చావుదెబ్బ కొట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు పుణ్యమా అని ఒక్క అనంతపురం జిల్లాలోనే 66 మంది రైతులు, మరో 11 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక్క ఈ జిల్లా నుంచి మూడు లక్షల మంది పనుల కోసం కర్ణాటకకు వలస వెళుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా ఉంటే... రైతులందరూ ఆనందంగా ఉన్నారని, తమకు సన్మానాలు, శాలువాలు కప్పుతున్నారని ముఖ్యమంత్రి వెటకారమాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల ఇంట్లోకి ఒక్కసారి తొంగిచూస్తే వారు పడుతున్న బాధలు అర్థమవుతాయని హితవు పలికారు. రెండో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన రాప్తాడు నియోజకవర్గంలోని తోపుదుర్తి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతపురంలో మొదలైన తమ పోరాటం చంద్రబాబును బంగాళాఖాతంలో పడేసేవరకూ కొనసాగుతుందని హెచ్చరించారు.

చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు గుంటూరులో రెండు రోజులపాటు దీక్ష చేపట్టనున్నట్టు చెప్పారు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకూ చంద్రబాబు చేస్తున్న మోసాలు, ద్రోహాలు దేశానికి అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. చంద్రబాబు సర్కారు పోలీసులను ఉపయోగించి వైఎస్సార్‌సీపీ నాయకులను హతమారుస్తోందని దుయ్యబట్టారు. ఈ అన్యాయాన్ని పై నుంచి దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇంకా ఆయనేమన్నారంటే...

⇒ బ్యాంకులో ఉన్న మీ బంగారం ఇంటికి రావాలన్నా, రైతుల రుణాలన్నీ మాఫీ కావాలన్నా, జాబు రావాలన్నా... చంద్రబాబు సీఎం కావాలని ఎన్నికల ముందు అన్ని టీవీల్లోనూ హోరెత్తించారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. తీరా ఎన్నికలు అయిపోయాక అన్ని వర్గాల ప్రజలనూ గాలికి వదిలేశారు. మాట ఇచ్చి తప్పడం, నమ్మిన వారికి వెన్నుపోటు పొడవడం, నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడటం చంద్రబాబుకే చెల్లింది.
⇒ రూ.లక్షకోట్ల రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని హామీలిచ్చి ఓట్లు వేయించుకుని... ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.4,300 కోట్లు కేటాయించారు. చివరకు రైతుల అకౌంట్లలోకి చేరింది కేవలం రూ.2,400 కోట్లు మాత్రమే. ఈ డబ్బులు వడ్డీకి కూడా సరిపోవు. గతంలో లక్షలోపు రుణాలకు వడ్డీ లేని రుణాలు, లక్ష నుంచి మూడు లక్షలలోపు రుణాలకు పావలా వడ్డీకే రైతులకు రుణాలు లభించేవి. అయితే, చంద్రబాబు పుణ్యమా అని రుణమాఫీ కాకపోవడంతో ఇప్పుడు రైతుల వద్ద నుంచి బ్యాంకులు ముక్కుపిండి 14 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. రైతులకు పంటల బీమా కూడా అందే పరిస్థితి లేదు.
⇒ డ్వాక్రా అక్కా చెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ముష్టి వేసినట్లు రూ. 3 వేలు, రూ.4 వేలు ఇస్తానంటున్నారు. ఇంతకుముందు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు వచ్చేవి. చంద్రబాబు పుణ్యమా అని ఇప్పుడు వారు 18 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది.
⇒ ఎన్నికల ముందు బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకున్నారు. ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ బాబు వచ్చాక.. ఉన్న జాబులు కూడా ఊడగొడుతున్నారు. అనంతపురం జిల్లాలోనే 93 మందిని తొలగించారని ఏపీ హౌసింగ్ బోర్డు ఉద్యోగులు నా దృష్టికి తీసుకువచ్చారు. ఇక నిరుద్యోగ భృతి దమ్మిడీ ఇచ్చిన పాపాన పోలేదు. దానికోసం 1.75 లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.
⇒ ఆర్టీసీ కార్మికులకు కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ గత ఐదారు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా పట్టించుకోవడంలేదు. తాను ఇచ్చిన హామీని నెరవేర్చే ఆలోచనే చేయడంలేదు.
⇒ ఆత్మహత్యలు పరిష్కారం కాదు అని రైతులకు భరోసా కల్పించేందుకే తమ నేత జగన్‌మోహన్‌రెడ్డి రైతు పరామర్శ యాత్ర చేస్తున్నారని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేసేందుకు అధికార పార్టీ హత్యల పరంపర కొనసాగిస్తోందని... అధికార పార్టీ దౌర్జన్యాలకు ఈ జిల్లా ప్రజలు భయపడరని స్పష్టం చేశారు. కంటికి కన్ను, పంటికి పన్ను అంటూ మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక మూర్ఖుడని రాప్తాడు నియోజకవర్గ ఇంచార్జి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇంచార్జీ ఉష, పెనుగొండ నాయకురాలు మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: