బరాక్‌తో ‘బడాయి’ ఫొటో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బరాక్‌తో ‘బడాయి’ ఫొటో

బరాక్‌తో ‘బడాయి’ ఫొటో

Written By news on Wednesday, May 6, 2015 | 5/06/2015


బరాక్‌తో ‘బడాయి’ ఫొటోవీడియోకి క్లిక్ చేయండి
అమెరికా అధ్యక్షునితో లోకేష్ ఫొటోకు రూ.కోటి
పార్టీకి నిధుల సేకరణకోసం పోర్ట్‌ల్యాండ్‌లో ఒబామా కార్యక్రమం
10 వేల అమెరికా డాలర్లు చెల్లిస్తే ఫొటో దిగే అవకాశం
ఆ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని అమెరికా టూర్ ఖరారు
ఇద్దరు ప్రభుత్వ అధికారులు కూడా వెళ్లేందుకు జీవో జారీ

 
 హైదరాబాద్: పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికాకు లోకేష్... అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అవకాశం... ఇలాంటి వార్తలు నిన్నో మొన్నో చదివినట్లుందా? ప్రచార సాధనాలను మేనేజ్ చేయడంలో మాస్టర్ బ్లాస్టర్ నారా చంద్రబాబు నాయుడు, తన కుమారుడిని ప్రమోట్ చేసుకునేందుకు ఈసారి ఏకంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా పేరునే ఉపయోగించుకునేందుకు రంగం సిద్ధం చేశారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలను పురస్కరించుకుని డెమాక్రటిక్ పార్టీ ఇప్పుడు ఆ దేశంలో ఫండ్ రెయిజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ పార్టీకి చెందిన డెమాక్రటిక్ నేషనల్ కమిటీ (డీఎన్‌సీ) ఈ నెల 7 వ తేదీన పోర్ట్‌ల్యాండ్‌లోని సెంటినల్ హోటల్‌లో 2016 వైట్‌హౌస్ విక్టరీ ఫండ్ పేరుతో నిధుల సమీకరణ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా ఐదు వేల అమెరికన్ డాలర్లు చెల్లిస్తే ఒబామాతో ఫోటో దిగడానికి అనుమతిస్తారు. ఓ 10 వేల డాలర్లు చెల్లిస్తే ఫోటోతోపాటు ఆయనతో కరచాలనం చేసి ఓ రెండు నిమిషాల పాటు పరిచయం చేసుకోవచ్చు. అమెరికాలో నిధుల సమీకరణ కోసం ఇదో మామూలు ప్రక్రియ. సరిగ్గా ఆ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను రంగంలోకి దింపారు.

లోకేష్‌ను ప్రమోట్ చేసే వ్యూహం

అమెరికా అధ్యక్షుడితో ఫోటో దిగే అవకాశాన్ని వినియోగించుకుని, ఆ ఫోటో ఆధారంగా లోకేష్‌ను ప్రమోట్ చేసే ప్రచారానికి చంద్రబాబు పథకం రచించారు. అందుకోసం పక్షం రోజుల కిందటే అమెరికాలోని తన సన్నిహితుల ద్వారా ఏర్పాట్లు పూర్తి చేయించారు. ఆ తర్వాత రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అమెరికా అధ్యక్షుడితో లోకేష్ భేటీ అవుతున్నారంటూ తన అనుకూల పత్రికలద్వారా హడావుడి చేశారు. ఈ నెల 3 నుంచి 12 వ తేదీ వరకు లోకేష్ అమెరికా పర్యటనకే ఏర్పాట్లు చేయించారు. ఆయనతోపాటు ముఖ్యమంత్రి ఓఎస్‌డీ సీతేపల్లి అభీష్ట, పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రాలు వెళ్లేందుకు అనుమతినిస్తూ జీవో-1326 జారీ చేసేశారు. వీరు సరిగ్గా ఏడో తేదీన పోర్ట్‌ల్యాండ్ నగరానికి చేరుకునేలా కార్యక్రమం ఖరారు చేశారు. లోకేష్ తన షెడ్యూలులో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ప్రత్యేక విమానంలో ఆరోజు ఉదయానికి పోర్ట్‌ల్యాండ్ చేరుకుంటారు.

ఫండ్ రెయిజింగ్ కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరిని ఉద్దేశించి సాయంత్రం ఐదు గంటలకు ఒబామా ప్రసంగిస్తారు. అంతకన్నా ముందు నిర్ణీత రేటు పెట్టి టికెట్టు కొనుగోలు చేసినవారు ఒక్కొక్కరితో ఒబామా ఫొటోలు దిగే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే చాలామంది టిక్కెట్లు కొన్నందువల్ల లోకేష్ వంతు ఎప్పుడొస్తుందో తెలీదు. అందుకే ఆరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లోకేష్ సమయాన్ని ఖాళీగా పెట్టుకున్నట్లు సమాచారం. ఒబామాతో ఫొటో దిగేందుకు ఏ టైమ్ ఖరారైనా వెళ్లడానికి వీలుగానే ఈ ఏర్పాటు చేసుకున్నట్లు అమెరికాలోని టీడీపీ వర్గాలు చెప్పాయి. మరోవైపు లోకేష్‌తోపాటు అధికారికంగా వెళ్లిన సీఎం ఓఎస్డీ అభీష్ట, పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రాలకు కూడా ఒబామాతో కలవడానికి టికెట్లు కొనుగోలు చేసినట్టు తెలిసింది. వీరితోపాటు లోకేష్ స్నేహితుడు రాజేష్ అన్న వ్యక్తికి కూడా ఉన్నట్టు సమాచారం. వీరు ఒక్కొక్కరు 10 వేల అమెరికన్ డాలర్లు (రూ.6.10 లక్షలు) పెట్టి టికెట్ కొనుగోలు చేశారు. దీనికి తోడు వీరు ఉండడానికి ప్రత్యేకంగా హోటల్‌లో బస, ప్రత్యేక చార్టర్డ్ విమానం వెరసి కోటి రూపాయలకు పైగా ఖర్చవుతున్నట్టు అంచనా వేశారు. అధికారులిద్దరికీ ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలిచ్చి మరీ పంపిన కారణంగా వారి టికెట్లకయ్యే ఖర్చుతోపాటు ఇతర ఖర్చులన్నీ ఖజానాపై భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

అనుకూల మీడియా అడ్డగోలు ప్రచారం...

నిర్ణీత ఫీజు చెల్లించి ఎవరైనా సరే ఒబామాతో కలిసి ఫొటో తీయించుకునే ఓ సంప్రదాయ కార్యక్రమం ఇది. కానీ దీనికి టీడీపీ అనుకూల మీడియా ఓ మహత్తర కార్యక్రమంలా ప్రచారం మొదలుపెట్టింది. పెట్టుబడులను సమీకరించేందుకే లోకేష్‌బాబు అమెరికాలో పర్యటిస్తున్నారనీ, ఇందులో భాగంగా ఒబామాను కూడా కలవబోతున్నారనీ ఒక పత్రిక ఇప్పటికే కథనాలు రాసేసింది. సోషల్ మీడియాలో ఈ ఒబామా కార్యక్రమం గుట్టురట్టు కాకుండా ఉన్నట్లయితే... ఒబామాతో లోకేష్ ఫొటో దిగిన అనంతరం టీడీపీ అనుకూల మీడియా ఆ ఫొటోకు విశేష ప్రాచుర్యం కల్పించి ఉండేదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఒబామాతో లోకేష్ ఏకాంత భేటీ విజయవంతంగా ముగిసిందనీ, కొత్త రాజధాని నిర్మాణం పనుల గురించి అమెరికా అధ్యక్షుడు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని కూడా 8వ తేదీన తెలుగు మీడియాలో వచ్చి ఉండేదనీ ప్రచారం జరుగుతోంది. తాను చంద్రబాబును ఆదర్శంగా తీసుకునే రాజకీయాల్లో ప్రవేశించానని ఒబామా అన్నట్లు కూడా వార్తలు వస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కూడా సోషల్ మీడియా ఘోషిస్తోంది.
Share this article :

0 comments: