భూ సమీకరణ పేరుతో రైతుకు ద్రోహం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భూ సమీకరణ పేరుతో రైతుకు ద్రోహం!

భూ సమీకరణ పేరుతో రైతుకు ద్రోహం!

Written By news on Saturday, May 30, 2015 | 5/30/2015


ఔను..  ప్రైవేటు రాజధానే
రాజధాని నిర్మాణం కేవలం 2 వేల ఎకరాల్లోనే
5,200 ఎకరాలు 99 ఏళ్లపాటు ప్రైవేటు సంస్థలకు లీజుకు
కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకే 34 వేల ఎకరాలు సేకరణ
మాస్టర్ డెవలపర్‌గా రహస్యంగా సింగపూర్ బిడ్ దాఖలు
స్విస్ చాలెంజ్ పేరుతో పనులు కట్టబెట్టనున్న సర్కారు
టీడీపీ మహానాడు తీర్మానంలో వెల్లడైన నిజాలు    

 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని పేరుతో రైతులనుంచి పచ్చని పొలాలు బలవంతంగా గుంజుకుంది కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకేనని స్పష్టమైంది. ప్రజారాజధాని పేరుతో ‘ప్రైవేటు’ రాజధాని రాబోతోందని వెల్లడైంది. మాస్టర్‌ప్లాన్‌ను సింగపూర్ ఉచితంగా రూపొందించడం అబద్ధమేననీ... మాస్టర్ డెవలపర్‌గా పనులు కట్టబెట్టడమే తెరవెనుక విషయమనీ తెలిసిపోయింది. రాజధాని నిర్మించేది మాత్రం కేవలం రెండువేల ఎకరాల్లోనేననీ... అంతకు రెండింతల భూమి 5,200 ఎకరాలు సింగపూరు కార్పొరేటు సంస్థలకు కట్టబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమనీ బట్టబయలైంది. అంతర్జాతీయ స్థాయి రాజధాని, 21వ శతాబ్దపు రాజధాని అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినవన్నీ మాయమాటలేనని... ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చడమే ఆయన అసలు లక్ష్యమనీ వెల్లడైంది. ఆ మాత్రం దానికి 34 వేల ఎకరాల పంటపొలాలను నాశనం చేయడమెందుకని మీరు ప్రశ్నిస్తే... రాజధాని నిర్మాణానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రంకెలేస్తారు. అలాంటివారికి పుట్టగతులుండవని శాపనార్థాలూ పెడతారు. కానీ ‘ప్రపంచస్థాయి నగరంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం’ పేరుతో తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆమోదించిన తీర్మానంలోకి వెళితే చంద్రబాబు ‘మనసులోని మాట’ తెలిసిపోతుంది.
 
భూ సమీకరణ పేరుతో రైతుకు ద్రోహం

‘అమరావతి’ నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులనుంచి అడ్డగోలుగా 34 వేల ఎకరాలు సేకరించిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణానికి అన్ని వేల ఎకరాలు ఎందుకని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే... ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలన్న విజన్‌తో తాము ముందుకుపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు బుకాయించారు. రాజధాని నిర్మాణానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని విమర్శించారు. కానీ నూతన రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలకు రెండువేల ఎకరాలు సరిపోతుందని మహానాడులో ఆమోదించిన తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు. రైతుల నుంచి సమీకరించిన 34 వేల ఎకరాల్లో రోడ్లు, పార్కులు, సామాజిక సదుపాయాలకు కేటాయించగా మిగిలేది 7,200 ఎకరాలు మాత్రమేనని తెలిపారు. అయితే అందులో రెండువేల ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాలకోసం ఉపయోగించి మిగిలిన 5,200 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చేస్తారట. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల కోసం ప్రైవేటు సంస్థలకు భూములను 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు  (జీవో నంబర్-110) జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జీవో ఆధారంగానే రాజధాని నగరంలో 5,200 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టబోతున్నారు. రాజధానిలో వాణిజ్య సముదాయాలు, ఇతర కార్యకలాపాల కోసం ఈ భూమిని కేటాయించాల్సిన అవసరముందని టీడీపీ తీర్మానంలో  పేర్కొన్నారు. అంటే కార్పొరేటు సంస్థలకు మేలు చేసేందుకే ప్రభుత్వం భూసమీకరణ పేరిట పచ్చని పంటపొలాలను లాక్కొందన్నమాట. రాజధాని ప్రాంతంలో భూములు కావాలంటే ప్రైవేటు సంస్థలే కొనుగోలు చేసుకోవచ్చు. కానీ  రైతులకు అధిక ధరలు చెల్లించాల్సి ఉంటుంది. అలాకాకుండా ప్రభుత్వం చవకగా భూములను సమీకరించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం వెనుక పెద్ద మతలబే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు దక్కాల్సిన సొమ్మును తాము దక్కించుకునేందుకే సర్కారు పెద్దలు భూసమీకరణ తతంగం నడిపించారన్న వాదనలు  వినిపిస్తున్నాయి.

34,000  ఎకరాలు

రాజధాని పేరుతో ప్రభుత్వం సేకరించిన భూమి
 
2,000 ఎకరాలు
ప్రభుత్వ కార్యాలయాలకు సరిపోయే భూమి
 
5,200 ఎకరాలు
99 ఏళ్ల పాటు ప్రభుత్వం సింగపూర్ కార్పొరేట్లకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించిన భూమి
 
రహస్యంగా రంగంలోకి మాస్టర్ డెవలపర్
 సింగపూర్ వాణిజ్య మంత్రి ఎస్.ఈశ్వరన్ నాలుగు రోజుల కిందట హైదరాబాద్ వచ్చి రాజధాని రెండో విడత మాస్టర్ ప్లాన్ అందజేసిన సంగతి తెలిసిందే. ఆ రోజుకు కూడా మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయలేదని, స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఉన్నట్టుండి మహానాడులో చేసిన తీర్మానంలో... మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ బిడ్ దాఖలు చేసినట్టు పేర్కొన్నారు. మాస్టర్ డెవలపర్‌గా ఏ ప్రాతిపదికన, ఎలాంటి నియమ నిబంధల ప్రకారం బిడ్ దాఖలు చేశారో, ఆ బిడ్‌లో ఏమేం కోట్ చేశారో ప్రభుత్వం రహస్యంగా ఉంచడం... సింగపూర్ బిడ్ దాఖలు చేసిందనీ, త్వరలోనే స్విస్ చాలెంజ్ విధానంలో త్వరలోనే మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేస్తామని మహానాడు తీర్మానంలో పొందుపరచడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీటికి తోడు సీఆర్‌డీఏ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడానికి జపాన్ ముందుకొచ్చిందని కూడా ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

సీఆర్‌డీఏ పరిధిలో అంటే రాజధాని కోర్ ఏరియా కాకుండా దాని బయట జపాన్ సంస్థలు వస్తాయని స్పష్టమవుతోంది. అలాగే రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి నిధుల సేకరణకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఆ తీర్మానంలో పేర్కొన్నారు. రాజధాని అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1500 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు కూడా అందులో వివరించారు. రాజధాని నిర్మాణం పూర్తిగా ప్రభుత్వ వ్యవహారం. ప్రభుత్వపరంగా పారదర్శకంగా జరగాల్సిన ఇలాంటి విషయాలను తెలుగుదేశం పార్టీ మహానాడులో బహిర్గతపరచడం పలు అనుమానాలకు తావిస్తోంది.
 
‘సాక్షి’ చెప్పిందే నిజమైంది. ‘ప్రైవేట్’ రాజధాని శీర్షికతో సాక్షి ప్రచురించిన వార్త అక్షరసత్యమని టీడీపీ మహానాడు సాక్షిగా వెల్లడైంది. రాజధానికోసం రైతులనుంచి సేకరించిన పంటపొలాల్లో వేల ఎకరాలు ప్రైవేటు కంపెనీలకు 99 ఏళ్లు ధారాదత్తం చేయనుందన్న వాస్తవం నిజమైంది. 5,200 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టనున్నట్లు మహానాడు తీర్మానాల్లో పేర్కొన్నారు.
 
Share this article :

0 comments: