అండగా ఉంటాం.. ఆత్మహత్యలొద్దు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అండగా ఉంటాం.. ఆత్మహత్యలొద్దు

అండగా ఉంటాం.. ఆత్మహత్యలొద్దు

Written By news on Monday, May 25, 2015 | 5/25/2015


అండగా ఉంటాం.. ఆత్మహత్యలొద్దు
♦ రైతులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
♦ ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు
♦ రైతు కుటుంబాలకు పరామర్శ
♦ జగన్‌ను కలిసిన పలువురు నేతలు


 సాక్షి, కడప : కష్టాలకు జడిసి ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఏదైనా బతికే సాధించాలని, తాము అండగా ఉంటామని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ధైర్యం చెప్పారు. కరువు నేపథ్యంలో ప్రభుత్వం పట్టించుకోక, చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతు కుటుంబాలను, అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు.

జిల్లాలో రెండవ రోజు పర్యటనలో భాగంగా ఆదివారం పులివెందుల నియోజకవర్గంలో రైతు భరోసా యాత్ర నిర్వహించారు. లింగాల మండలం బోనాలలో ఆత్మహత్య చేసుకున్న రైతు గంగాధర కుటుంబాన్ని తొలుత పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బోనాల గ్రామానికి చెందిన రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం గంగరాజు, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు వెంకటనారాయణరెడ్డి, సర్పంచ్ అనసూయమ్మ ఇళ్లకు వెళ్లి స్నేహపూర్వకంగా మాట్లాడారు.

కామసముద్రం గ్రామంలో ఇటీవలే అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు నాగభూషణం శ్రేష్టి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తర్వాత ఆర్.తుమ్మలపల్లె గ్రామంలో కె.రామచంద్రారెడ్డి అనే రైతు కూడా అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. లింగాల మండలం అంకేవానిపల్లెలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, హరినాథ్, పరమేశ్వర, రవీంద్ర, కాటేశ్వర, జీవేశ్వర, వెంకటనారాయణరెడ్డి, భీముడు తదితరుల ఇళ్లకు వెళ్లి మాట్లాడారు.

 రింగ్‌బండ్ వరకు నీటిని ఉంచండి..
  పులివెందుల మున్సిపాలిటీ ప్రజల తాగునీటి అవసరాల కోసం చిత్రావతి రిజర్వాయర్ నుంచి కామసముద్రం చెరువుకు నీరు వ చ్చిందని, ఆ నీటిని ఎస్‌ఎస్ ట్యాంకుకు మోటార్లతో తరలిస్తున్నారని కనీసం రింగ్‌బండ్ వరకైనా నీటిని ఉంచేలా అధికారులను ఆదేశించాలని కామసముద్రం గ్రామస్తులు వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన చెరువు ప్రతి ఏడాది ఒట్టిపోతోందని.. కనీసం కొంత నీరు ఉంచితే చుట్టుపక్కల పొలాల్లోని బోర్లల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని వారు తెలియజేశారు.

 నూతన జంటలకు ఆశీర్వాదం
 తొండూరు మండలం సంతకొవ్వూరు గ్రామంలో రెండు నూతన జంటలను ఆశీర్వదించారు. మాజీ ఎంపీపీ మునిరెడ్డి, మండల పరిశీలకుడు రామమునిరెడ్డి సోదరుని కుమారుడైన బాలమునిరెడ్డి, వరలక్ష్మిదేవిల వివాహం ఇటీవలే జరిగింది. వారిని జగన్ ఆశీర్వదించారు. ఇటీవలే వివాహమైన ఇదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ గంగా నీలావతి కుమార్తె దేవి, నగేష్‌లను ఆశీర్వదించారు.

 వైఎస్ జగన్‌ను కలిసిన నేతలు  
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆదివారం పలువురు నేతలు కలిసి చర్చించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.బి.అంజాద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, కదిరి ఎమ్మెల్యే అత్తారు చాంద్ బాషా, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఆదిమూలం, గురున్నాథరెడ్డి తదితరులు వివిధ అంశాలపై జగన్‌తో చర్చించారు.

లింగాల మండల నాయకులు కొండారెడ్డి, సుబ్బారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి బిదినంచర్ల బ్రహ్మానందరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ మండల పరిశీలకుడు బలరామిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు వెంగముని, తొండూరు నాయకులు ఎర్ర గంగిరెడ్డి, రామమునిరెడ్డి, మునిరెడ్డిలతోపాటు పలువురు నాయకులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. పెద్దకుడాల, బోనాల చెరువు, అంకేవానిపల్లెలో మహిళలు జగన్‌కు హారతి పట్టారు. పలువురు రైతులు జగన్‌తో మాట్లాడారు. జగన్‌ను చూసేందుకు కామసముద్రంలో జనం మిద్దెలపైకి ఎక్కారు. అనంతరం ఆయన పులివెందులకు చేరుకొని తొండూరు మండలంలోని సంతకొవ్వూరు, పులివెందుల మండలంలోని ఆర్.తుమ్మలపల్లెలకు వెళ్లారు. అనంతరం ఆయన బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.
Share this article :

0 comments: