ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు అక్కడ మీ మంత్రులు ఎందుకు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు అక్కడ మీ మంత్రులు ఎందుకు?

ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు అక్కడ మీ మంత్రులు ఎందుకు?

Written By news on Thursday, June 4, 2015 | 6/04/2015


మోసం రుజువైంది... సమరం మొదలైంది...!
చంద్రబాబు మోసాలపై దీక్ష
♦ బాబు ఏడాది పాలనపై సమర దీక్షలో వైఎస్ జగన్
♦ కత్తి లేకుండానే మహిళలను వెన్నుపోటు పొడిచారు
♦ రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారు
♦ ఉన్న ఉద్యోగాలే ఊడబెరుకుతున్నారు
♦ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చక ముందే విభజనకు ఓటేశారు
♦ రాజధాని నిర్మాణానికి బలవంతంగా భూములు లాక్కోవడమా..
♦ చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ ఆగ్రహం
♦ మంగళగిరిలో రెండు రోజుల దీక్ష ప్రారంభం

 
ప్రజా బ్యాలెట్ సాక్ష్యం..
ఎన్నికల అప్పుడు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిల్లో వంద హామీలు తీసుకుని ప్రజాబ్యాలెట్‌ను రూపొందించాం. ఆ ప్రజా బ్యాలెట్‌ను మీకు పంపిణీ చేస్తాం. ఏడాదిలో ఎన్ని హామీలను అమలు చేశారు.. చంద్రబాబుకు ఎన్ని మార్కులు వేస్తారన్నది మీ ఇష్టం. ఈ ప్రజా బ్యాలెట్‌ను పేపర్లలో వేయండి.. టీవీల్లో చూపించండి.. ప్రజలకు అందించండి.. ఏడాది పాలనలో చంద్రబాబుకు ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారనడానికి ప్రజా బ్యాలెట్ సాక్ష్యం..
 
సమర దీక్ష ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో ప్రజలకు ఎలాంటి మంచీ జరగలేదని, పైగా, రాష్ట్ర ప్రజల్ని బాబు అన్యాయమైన పరిస్థితుల్లోకి నెట్టివేశారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు మోసాలను చాటి చెప్పడానికే ఈ దీక్షకు ‘సమర దీక్ష’గా నామకరణం చేశామని, ఆయనపై పోరాటానికి ఈ దీక్షనే ఒక వేదికగా చేసుకున్నామని తెలిపారు.
ఇక చంద్రబాబు మోసాలపై సమరం మొదలైందని జగన్ అన్నారు. రాష్ట్రంలోని డ్వాక్రా అక్క చెల్లెమ్మలను పట్ట పగలే ఏ కత్తీ లేకుండా వెన్ను పోటు పొడిచిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్ర చరిత్రలో మిగిలి పోతారని, రైతుల పరిస్థితిని ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి దిగజార్చిన ఘనత కూడా ఆయనదేనని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏడాది మోసాల పాలనకు, నయవంచనకు నిరసనగా బుధవారం ఆయన మంగళగిరిలోని ‘వై’ జంక్షన్ వద్ద సమర  దీక్షకు పూనుకున్నారు.

రెండు రోజుల నిరాహార దీక్షను ప్రారంభించడానికి ముందు ఆయన వేదికపై నుంచి ప్రసంగిస్తూ చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలపై మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబునాయడు చెప్పిందేమిటి? ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చేస్తున్నదేమిటి? అని జగన్ ఈ దీక్షలో సూటిగా ప్రశ్నించారు. తాను సమర దీక్ష చేస్తోంది.. ప్రధానంగా 1. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ, 2. రైతన్నలకు వ్యవసాయ రుణాలమాఫీ, 3. ఇంటింటికీ ఉద్యోగం, లేదా ఒక్కొక్కరికి నెలకు రూ.2 వేలు నిరుద్యోగభృతి, 4. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, 5. రాజధాని పేరుతో బలవంతంగా భూసమీకరణ.. అంశాలపైన అని జగన్ వివరించారు.
     
♦ దీక్ష ఎందుకో తెలియని ఒకే ఒక వ్యక్తి
‘ఈ దీక్షను ఎందుకు చేస్తున్నాం. ఇన్ని వేల మంది మండుటెండలను సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి సంఘీభావం ఎందుకు ప్రకటిస్తున్నారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తె లుసు. కానీ, ఈ దీక్ష ఎందుకో తెలియనే తెలియని ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు’ అని జగన్ సభికుల కేరింతల మధ్య అన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన మాటలేమిటి, ఇప్పుడు ఆయన చేస్తూ ఉన్నదేంటి అనే విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు.
   
♦ రుణమాఫీ చేస్తానని ఊదరగొట్టారు

ఎన్నికల వేళ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు మాటలు నమ్మి ఇప్పుడు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తానొస్తే రుణ మాఫీ చేస్తానని ఊదరగొట్టిన చంద్రబాబు మాటలను రైతులు కూడా నమ్మారని, ఆ తరువాత తీవ్రంగా నష్ట పోయారని చివరకు రైతుల పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే దాకా దిగజారిందని పేర్కొన్నారు.
     
♦ బాబు వచ్చాడు.. జాబు ఏదీ?
ఎన్నికలకు ముందు టీడీపీ వారి ఏ నోట విన్నా, ఏ మీటింగ్‌లో చంద్రబాబు మాటలు విన్నా, ఎప్పుడు టీవీలు చూసినా మనకు వినిపించిన మాట ఒక్కటే ‘జాబు కావాలంటే.. బాబు రావాలి’ అని, మరి ఇవాళ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఉద్యోగాలు వచ్చాయా? కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు! ఉన్న ఉద్యోగాలను ఊడ బెరికే కార్యక్రమం ఇవాళ్టికీ కొనసాగుతోంది’ అని జగన్ దుయ్యబట్టారు.

ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తానన్నారు, ఇవ్వలేక పోతే నెలకు రూ.2000లు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీలిచ్చారు. ఉద్యోగాలివ్వడానికి ఆలస్యం అవుతున్న ప్రస్తుత తరుణంలో నిరుద్యోగ భృతి ఇస్తారని రాష్ట్రంలోని 1.75 కోట్ల ఇళ్లు ఎదురు చూస్తున్నాయని జగన్ అన్నారు. అలా ఎదురు చూస్తున్న వారికి నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తావు చంద్రబాబూ... అని గట్టిగా నిలదీసే రోజు ఇది అని ఆయన పేర్కొన్నారు.
     
♦ ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు అక్కడ మీ మంత్రులు ఎందుకు?
పునర్విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా (స్పెషల్ స్టేటస్) అంశాన్ని చేర్చక ముందే టీడీపీ ఎంపీలతో విభజన అనుకూలంగా చంద్రబాబు ఓటు వేయించారు. ప్రత్యేక హోదా అనే పదం చట్టంలో చేర్చక ముందే అదే పనిగా ఓటు వేసి మరీ రాష్ట్రాన్ని విడదీయడానికి చంద్రబాబు కారకుడయ్యారని జగన్ మండిపడ్డారు. ఆ తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే తప్ప బాగుపడదని అప్పుడు చెప్పారు.

మరి ఈ రోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఎందుకు సాధించలేక పోతున్నారని సమదీక్ష వేదికను సాక్ష్యంగా చేసుకుని అడుగుతున్నామని జగన్ నిలదీశారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వనపుడు మీ మంత్రులను కేంద్ర మంత్రిమండలిలో ఎందుకు కొనసాగిస్తున్నావు చంద్రబాబూ అని తాను ఈ దీక్షా వేదిక నుంచి ప్రశ్నిస్తున్నానన్నారు.
     
♦ రాజధాని పేరుతో వికృత చేష్టలా!
రాజధాని అందరికీ కావాల్సిందే... అయితే, ఆ పేరుతో చంద్రబాబు పాల్పడుతున్న వికృతమైన చేష్టలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని గట్టిగా చెబుతున్నానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రైతులకు ఇష్టమున్నా లేక పోయినా రాజధాని నిర్మాణానికని వారి నుంచి బలవంతంగా భూములను లాక్కోవడాన్ని సమర దీక్ష వేదిక సాక్షిగా వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు ఏడాది పాలనలో ఈ ఐదు అంశాలపైనే గట్టిగా ప్రశ్నిస్తున్నామన్నారు.
     
♦ తరలి వచ్చిన జనవాహిని
చంద్రబాబు ఏడాది పాలనలో జరిగిన మోసాలను తూర్పారబడుతూ జగన్ చేపట్టిన దీక్షకు అశేష జనవాహిని కదలి వచ్చింది. యువకులు, మహిళలు, వయోవృద్ధులు సైతం మండుటెండలను లెక్క చేయకుండా సమరదీక్ష ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. అశేష జనవాహిని మధ్య హర్షధ్వానాలు చేస్తూండగా జగన్ నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఈ దీక్ష గురువారం సాయంత్రం వరకూ సాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
     
♦ సమరదీక్షలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
మంగళగిరి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళగిరిలో చేపట్టిన సమరదీక్షలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీగా హాజరయ్యారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాద్‌లతో పాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  పాల్గొన్నారు.
 
సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ కోసమే సమర దీక్ష చేస్తున్నారని దీక్షలో పాల్గొన్న పలువురు ‘సాక్షి’తో చెప్పారు.
 
జగనన్నా వెనకడుగు వేయొద్దు
‘అన్నా...జగనన్నా... నేను చెప్పే ఒక్కమాట విను. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనుకడుగు వేయొద్దు. ప్రజల కోసం ఉద్యమపథాన్ని వీడొద్దు.  నీ వెంటే. నీకు తోడూ నీడగా మేమున్నాం. జనానికి మంచి చేస్తావన్న నమ్మకం మాకుంది. ముందుకు సాగు. ఇక నీదే విజయమంటూ’ పెదకాకాని మండలం నంబూరుకు చెందిన ఎ. లక్ష్మీసంధ్య  జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. సోదరిగా నిండు మన సుతో క్షేమాన్ని కోరుకుంటున్నానని జగన్ నుదుట కుంకుమ బొట్టు పెట్టారు.దీక్షకు విచ్చేసిన లక్ష్మీసంధ్య జగన్‌ను కలిసి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆ మాటలను ఆలకించిన జగన్ తప్పకుండా సూచనలు పాటిస్తానన్నారు.
 
మూడు వేలూ ఇవ్వలేదు
ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్నారు. అసలూ లేదు.. వడ్డీ లేదు. మొన్న జగన్ దీక్ష చేస్తున్నారని ప్రకటించగానే రూ.3 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. అది ఇంతవరకూ ఎవరికీ రాలేదు. మహిళలు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాలు పోయాయి. హామీ అమలు చేయకపోతే మహిళల ఆగ్రహం తప్పదు.
-భూక్యా రమాదేవి, తూములూరు, గుంటూరు జిల్లా
 
భూములు లాక్కుంటున్నారు
మూడు పంటలు పండే మా భూముల్ని బలవంతంగా లాక్కుంటున్నారు. ప్రభుత్వం తీరుపై ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఒకసారి జగన్ మా ఊళ్లకు వచ్చి ధైర్యాన్నిచ్చారు. మళ్లీ ఇప్పుడు ఇక్కడే దీక్ష చేస్తుండడంతో మద్దతుగా ఇక్కడకు వచ్చా. ఈ దీక్షతోనైనా ప్రభుత్వం దిగివచ్చి రైతులపై వేధింపులు మానుకుంటుందని భావిస్తున్నా.
- భీమవరపు సాంబిరెడ్డి, నిడమర్రు, రాజధాని రైతు
 
మా కోసమే దీక్ష.. అందుకే వచ్చా
చంద్రబాబు దయవల్ల కౌలు రైతుకు కష్టాలు తప్పలేదు. ధాన్యానికి మద్దతు ధర లేకపోగా.. మరోపక్క పెట్టుబడి బాగా పెరిగింది. రైతులను ఆదుకునేందుకు ఇప్పుడున్న ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదు. అందుకే కౌలు సాగు చేయడం కూడా మానేశా. కూలీ చేసుకుని బతుకుతున్నా. మా కోసమే జగన్ దీక్ష చేస్తున్నడు.. అందుకే ఇక్కడకు వచ్చా.
 - జంగం సుదర్శనం, పిడపర్రు, గుంటూరు జిల్లా
Share this article :

0 comments: