‘పచ్చ’ డొంక కదులుతోంది ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘పచ్చ’ డొంక కదులుతోంది !

‘పచ్చ’ డొంక కదులుతోంది !

Written By news on Sunday, June 7, 2015 | 6/07/2015


‘పచ్చ’ డొంక కదులుతోంది !
* ఎమ్మెల్యేకు లంచం కేసులో తీగలాగుతున్న ఏసీబీ
తుమ్మలను ఓడించేందుకు మాజీ ఎంపీని రంగంలోకి దించిన చంద్రబాబు
మంత్రికి కేటాయించిన ముగ్గురు ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలకు ఎర
వారితో సంప్రదింపులు జరిపిన సండ్ర వెంకటవీరయ్య
ఎమ్మెల్యేల అనుచరులు, సన్నిహితులతో టీటీడీపీ నేతల బేరసారాలు
ఏసీబీ దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వాంగ్మూలం నమోదుకు నిర్ణయం
కాల్ డేటా ఆధారంగా ఇతర ఎమ్మెల్యేలనూ ప్రశ్నించే అవకాశం
కేసుపై నివేదికను ఎల్లుండి కేంద్ర హోంమంత్రికి సమర్పించనున్న గవర్నర్

 
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సాగించిన బేరసారాల డొంక కదులుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి లక్ష్యంగా చంద్రబాబు పెద్ద ఎత్తున పావులు కదిపారు. ఇందుకోసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తుమ్మలకు ఓటేసేందుకు టీఆర్‌ఎస్ కేటాయించిన ఎమ్మెల్యేల జాబితాను సంపాదించారు. దాని ఆధారంగా ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు భారీ వ్యూహరచన చేశారు.
 
 వారికి బంపర్ ఆఫర్లు ఇచ్చి లోబర్చుకునే బాధ్యతను అదే జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ అయిన టీడీపీ నేతకు అప్పగించారు. ఆ నేత ఆదేశానుసారమే ఆ ముగ్గురితో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సంప్రదింపులు జరిపినట్లు ఏసీబీకి స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. తుమ్మలతో తొలి నుంచి ఉన్న వైరాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు మాజీ ఎంపీ విశ్వప్రయత్నం చేశారు. పదేళ్ల పాటు శాసనసభ్యులుగా ఉన్నా సంపాదించలేనంత సొమ్ము ముట్టజెప్పుతామంటూ సదరు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు వర్తమానం పంపారు. ఓటేయడానికి ఒప్పిస్తే రూ.కోటి ఇస్తామంటూ ఓ ఎమ్మెల్యే అనుచరునికి అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు ముట్టజెప్పారు. ఇలాగే మరో ఎమ్మెల్యే సన్నిహితుడికి కూడా రూ.50 లక్షలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు టీటీడీపీ నేతలు అన్ని అడ్డదారులు తొక్కారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తనకు బంపర్ ఆఫర్ ఇచ్చారని ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పోలింగ్‌కు ముందే తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన సదరు ఎమ్మెల్యేను వెంటబెట్టుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దగ్గరకు వెళ్లి బేరసారాల సంగతిని విడమర్చి చెప్పారు.
 
 దీంతో తుమ్మలకు ఓటేయాల్సిన ఎమ్మెల్యేలను కేసీఆర్ మార్చేశారు. ఈ వ్యవహారంలో టీటీడీపీ నేతల పాత్రను బయటపెట్టేందుకు సెక్షన్ 161 కింద ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వాంగ్మూలాన్ని కోర్టులో రికార్డు చేయించనున్నట్లు అత్యున్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ కేసుకు ఆ సాక్ష్యం కీలకంగా మారుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్యేల మనసు తెలుసుకునేందుకు టీడీపీ నేతలు ప్రాథమిక స్థాయిలో సంప్రదింపులు జరిపిన వారి వివరాలను కూడా ఏసీబీ సేకరించింది. ఇక ఓ ఎమ్మెల్యేను ఓటేసేందుకు ఒప్పిస్తానని ముందుకు వచ్చి రూ.10 లక్షలు తీసుకున్న అనుచరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
 ఇతర ఎమ్మెల్యేలపైనా ఏసీబీ దృష్టి
 ఇతర జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన టీటీడీపీ నేతలకు సంబంధించిన వివరాల కోసం ఎమ్మెల్యేలను ప్రశ్నించాలని ఏసీబీ భావిస్తోంది. ఇప్పటికే సేకరించిన కాల్‌డేటా ఆధారంగా వారు ఎవరితో మాట్లాడారు.. ఓటేస్తే డబ్బు ఇస్తామని ఆఫర్ చేసిం దెవరు.. మధ్యవర్తిత్వం కోసం ఎవరిని పంపారు.. వారిని ఎక్కడ కలిశారు.. వంటి వివరాలను ఎమ్మెల్యేల నుంచి రాబట్టనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఒకరికి రూ.50 లక్షలు ముట్టజెప్పినట్లు ఏసీబీ దృష్టికి వచ్చింది. ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన కాల్ డేటాను కూడా ఏసీబీ విశ్లేషిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
  అడ్వాన్స్ తీసుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటేస్తారని భావించి భంగపడ్డామని తెలుగుదేశం ఎమ్మెల్యే ఒకరు శాసనసభ ఆవరణలో బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను కూడా ఏసీబీ సీరియస్‌గా తీసుకుంది. శనివారం ఉదయం సెబాస్టియన్‌ను విచారించిన సందర్భంలో దీనికి సంబంధించిన ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యేలతో సంప్రదింపుల వ్యవహారానికి ఓ టీడీపీ నేత తన గన్‌మెన్ ఫోన్ వాడుకున్నారు. కాల్‌డేటా ద్వారా ఈ విషయాన్ని పసిగట్టిన దర్యాప్తు బృందం ఆ గన్‌మెన్‌ను కూడా విచారించనుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ నేత తన అనుచరుల ఫోన్‌ల ద్వారా కనీసం పది మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. రెండు నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఇస్తామంటూ బేరసారాలు సాగించారు.
 
 బెంబేలెత్తుతున్న టీటీడీపీ నేతలు
 ఎమ్మెల్యేలతో బేరసారాలకు సంబంధించి డొంక కదులుతుండటంతో ఇందులో ప్రమేయమున్న టీటీడీపీ నేతలు బెంబేలెత్తుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఓ ఎమ్మెల్యే గత మూడు రోజులుగా తన రెండు సెల్‌ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నారు. నియోజకవర్గంలో పార్టీ అనుచరులకు కూడా ఆయన అందుబాటులో లేకుండా పోయారు. ‘మా నాయకుడు అనవసరంగా అత్యాశకు పోయి మమ్మల్ని ఇరుకున పెట్టిండు’ అని ఓ టీటీడీపీ సీనియర్ నేత తన సన్నిహితుల వద్ద వాపోయారు. ఏసీబీ కస్టడీలో ఉన్న రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహ ఏం చెబుతారోనని నేతలు ఆందోళనలో ఉన్నారు.
 
 9న ఢిల్లీకి గవర్నర్
కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రేవంత్ ఎపిసోడ్‌పై గవర్నర్ నరసింహన్ నివేదిక రూపొందించే పనిలో పడ్డారు. ఈ నెల 9వ తేదీన ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి ఆయన నివేదిక అందజేస్తారని సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయన ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్, నిఘా విభాగం బాస్ శివధర్‌రెడ్డి నుంచి సమాచారం తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా రాజ్‌భవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేసు పురోగతి వివరాలను గవర్నర్‌కు తెలియజేశారు.
Share this article :

0 comments: