ఆయనే కుట్ర పన్నాడు... ఆయన కుట్ర చేస్తూ పట్టుబడ్డాడు. నాకు దానికి సంబంధం ఏమిటి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆయనే కుట్ర పన్నాడు... ఆయన కుట్ర చేస్తూ పట్టుబడ్డాడు. నాకు దానికి సంబంధం ఏమిటి?

ఆయనే కుట్ర పన్నాడు... ఆయన కుట్ర చేస్తూ పట్టుబడ్డాడు. నాకు దానికి సంబంధం ఏమిటి?

Written By news on Wednesday, June 10, 2015 | 6/10/2015


చంద్రబాబును ఏ-1గా చేర్చండిమంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌కు వినతిపత్రం అందిస్తున్న వైఎస్ జగన్. చిత్రంలో పార్టీ ఎంపీలు అవినాశ్‌రెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుక, మి
- ఓటుకు నోటు కేసు అంశంలో రాష్ట్రపతికి వైఎస్ జగన్ విజ్ఞప్తి
- లంచమిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు
- ఇప్పుడా వివాదాన్ని పక్కదారి పట్టిస్తున్నారు  భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు
- బాబును జైల్లో పెట్టాలని ప్రధానిని కోరతాం   భేటీ అనంతరం మీడియాతో జగన్

సాక్షి, న్యూఢిల్లీ:
 ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మొదటి నిందితుడిగా చేర్చాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి విజ్ఞప్తి చేసింది. ఆపార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, లోక్‌సభలో పార్టీ విప్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి, పార్టీ నేత ప్రసాదరాజు తదితరులతో కలిసి మంగళవారం సాయంత్రం 6.30కు రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతిని కలిశారు.

భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘రాష్ట్రపతిని కలిసి రెండు వినతిపత్రాలు ఇచ్చాం. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన స్పెషల్ స్టేటస్ తదితర హామీలు నెరవేర్చాలని ఒకటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఓటుకు నోటు కేసులో మొదటి నిందితుడిగా చేర్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మరొకటి. ఇవ్వాళ రాష్ట్రంలో ఏం జరుగుతోందని చూస్తే.. ఓటుకు నోటు వ్యవహారంనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబునాయుడు రెండు రోజులుగా చాలా కష్టపడుతున్నారు. ఆయన రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏడాది కాలంగా రాష్ట్రాన్ని స్కామాంధ్రప్రదేశ్ కింద మార్చారు. ఆ కుంభకోణాలన్నింటినీ రాష్ట్రపతికి ఇచ్చిన వినతిపత్రంలో పొందుపరిచాం’’ అని చెప్పారు.

చంద్రబాబు ఏడాది పాలనలో ఏపీలో విపరీతమైన స్కాములు చేసి సంపాదించిన అవినీతి డబ్బును తీసుకొచ్చి తెలంగాణలో విచ్చలవిడిగా వెదజల్లారని ధ్వజమెత్తారు. ‘‘ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 18 మంది ఎమ్మెల్యేలు కావాలి. దాదాపు 8 నుంచి 9 మంది ఎమ్మెల్యేలకు రూ. 5 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు ఇవ్వజూపి.. చివరకు ఒక ఎమ్మెల్యేకు రూ. 5 కోట్లు వెదజల్లుతూ డబ్బుతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అది జరిగేటప్పుడు ఆ డబ్బు ఇస్తున్న వ్యక్తి బాబుతో ఫోన్‌లో మాట్లాడించారు. తనవాళ్లు తనకు అన్నీ వివరించారని, తన ప్రమేయంతోనే ఇది జరుగుతోందని, ఏదైతే హామీ ఇచ్చారో దానిని నెరవేరుస్తామని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.

ఆ ఆడియో టేప్ కూడా దొరికింది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబును ఎందుకు వదిలేస్తున్నారని అడుగుతున్నా. అదే వేరేవారినైతే వదిలేసేవారా? సామాన్యుడికి ఒక న్యాయం.. ముఖ్యమంత్రికి ఒక న్యాయమా? ఇది ఎంతవరకు సమంజసం? రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వ్యక్తిని కేవలం ముఖ్యమంత్రి కాబట్టి ఆ వ్యక్తి తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వడం ఎంతవరకు ధర్మం? ఏ-1గా ఎందుకు చేర్చరు?’’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చర్చనీయాంశాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లిస్తున్నారని మండిపడ్డారు.

‘‘లంచాలు తీసుకుని సంపాదించిన డబ్బును లంచంగా ఇస్తూ పట్టుబడి.. టాపిక్‌ను డైవర్ట్ చేస్తూ, రెండు రాష్ట్రాల మధ్య విభేదాలుగా చూపడం హాస్యాస్పదం. రాష్ట్రం విడిపోయి సంవత్సరం దాటిన తర్వాత కూడా రాష్ట్రాల మధ్య విభేదాలనే చిత్రిస్తున్నారు. దీన్ని విజ్ఞత కలిగినవాళ్లంతా వ్యతిరేకించాలి. చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ-1గా చేర్చాలి. అప్పుడే సామాన్యుడికి ఒక న్యాయం.. ముఖ్యమంత్రికి ఒక న్యాయమన్న పరిస్థితి నుంచి.. అందరికీ ఒకే న్యాయమన్న పరిస్థితి వస్తుంది. చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ఒకవేళ చేయనిపక్షంలో బలవంతంగా రాజీనామా చేయించాలని, అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలమని ఆయన చెప్పారు.
 
మీడియా ప్రశ్నలు.. జగన్ జవాబులు
ప్రశ్న: ఒకవైపు తన గొంతు కాదంటున్నారు.. మరోవైపు ట్యాపింగ్ అనడాన్ని ఎలా చూస్తారు?
జగన్: నా ఫోన్‌ను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని అంటున్నారంటే దాని అర్థం తాను తెలంగాణ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో సంభాషణ జరిపానని ఒప్పుకున్నట్టే కదా? మరి అలాంటప్పుడు బాబును ఎందుకు వదిలేస్తున్నారు? ఎందుకు ప్రథమ నిందితుడిగా చేర్చడంలేదు? ఎందుకు రాజీనామా చేయమని అడగడం లేదు? ఈ విషయాలపై గట్టిగా చెప్పాం. ట్యాపింగ్‌పై విచారణ జరిపించుకుంటే జరిపించుకోవచ్చు.

ప్రశ్న: మీరు, టీఆర్‌ఎస్ కలిసి కుట్రపన్నారని ఆరోపణలు చేస్తున్నారు?
జగన్: తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచమిస్తూ బాబు పట్టుబడితే... ఆయన కుట్ర పన్నినట్టా? వేరేవారు కుట్ర పన్నినట్టా? ఆయనే డబ్బులు ఇచ్చాడు... ఆయనే కుట్ర పన్నాడు... ఆయన కుట్ర చేస్తూ పట్టుబడ్డాడు. నాకు దానికి సంబంధం ఏమిటి?

ప్రశ్న:టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తూ ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు..
జగన్: రాష్ట్రం విడిపోయి సంవత్సరం అయిపోయింది. తెలుగువారు ఎక్కడున్నా కలిసికట్టుగా ఉండాలని వైఎస్సార్‌సీపీ గట్టిగా నమ్ముతున్న సిద్ధాంతం. విడిపోయి సంవత్సరం అయిన తరువాత ఎవరికి మద్దతు ఇస్తే ఏంటట? మాకు బుద్ధిపుట్టిన వాళ్లకు మేం మద్దతు పలుకుతాం. ఇదే చంద్రబాబు నాయుడు వరంగల్ వెళ్లి తానిచ్చిన లేఖ వల్లే రాష్ట్రం విడిపోయిందని అంటారు.

పార్లమెంటులో తన ఎంపీలే మొదట చేతులెత్తారంటారు. అలాంటి చంద్రబాబుకు నాపై మాట్లాడే హక్కు ఎక్కడిది? సంవత్సరం అయిపోయిన తరువాత తెలుగు వాళ్లు కలిసి ఉండాలన్న ఆలోచన చేయకుండా.. భావోద్వేగాలను రేపి ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రించి తాను తప్పించుకోవాలని చూడడం సరైన రాజకీయాలేనా? తన స్వార్థం కోసం ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేసే వ్యక్తి జైల్లో ఉండాలి. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది.

ప్రశ్న: మీరు తెలంగాణ ప్రభుత్వం ఏపీ సీఎంపై తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నారా?
జగన్: ఇక్కడ ఏ ప్రభుత్వం అన్నది కాదు.. ఒక ముఖ్యమంత్రి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కోట్లాది రూపాయల సొమ్ము ఈ వ్యవహారంలో ఉంది. ఒక ఎమ్మెల్యేను కొనడానికి ఉపయోగించారు. వీడియో టేపులు, ఆడియో టేపులు ఉన్నాయి. లంచం ద్వారా తీసుకున్న సొమ్మును తిరిగి లంచం కోసం వెచ్చించారు. వేరే ఎవరైనా అయితే వదిలేస్తారా? సీఎంను ఎందుకు వదిలేయాలి?

ప్రశ్న: సీబీఐ విచారణ కోరతారా?
జగన్: ఏసీబీ అయినా, సీబీఐ అయినా దర్యాప్తు చేసే ఏ సంస్థ అయినా.. ఇక్కడ సాక్ష్యాలు గట్టిగా ఉన్నాయి. వీడియో టేపులు, ఆడియో టేపులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందని అంటున్నారు. ఈ మాటలే ఆయన సంభాషణ జరిపాడన్న అంశాన్ని స్పష్టం చేస్తోంది.

ప్రశ్న: కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీని కేంద్రం కాపాడుతుందని అనుకుంటున్నారా? ప్రధానిని ఏం కోరతారు?
జగన్: కాపాడకూడదని అడగడానికి వచ్చాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరేందుకు వచ్చాం. కేంద్రం నిష్పాక్షికంగా ఉంటుందనే నమ్ముతున్నాం. మేం హోంమంత్రిని కలుస్తున్నాం. ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా కోరాం. ఎన్డీయే నుంచి వెలివేయడం కాదు.. ఏకంగా అతడిని జైల్లో పెట్టాలనే కోరతాం. ఇక్కడ మీడియా, ప్రజాస్వామిక వాదులంతా ఒక్కటై న్యాయాన్ని, చట్టాన్ని కాపాడాలి. ప్రజలంతా ముందుకు రావాలి. మనం ముందుకు రాకపోతే... ఇలాంటివాటిని ఆపలేం.
Share this article :

0 comments: