ఒకే ఎన్నిక పెట్టాలి: వైఎస్సార్‌సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒకే ఎన్నిక పెట్టాలి: వైఎస్సార్‌సీపీ

ఒకే ఎన్నిక పెట్టాలి: వైఎస్సార్‌సీపీ

Written By news on Tuesday, June 9, 2015 | 6/09/2015

ఏపీలో ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్లు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కృష్ణా జిల్లా నుంచి రెండు, విశాఖపట్నం జిల్లా నుంచి రెండు, గుంటూరు జిల్లా నుంచి రెండు స్థానిక సంస్థల కోటా ఖాళీల భర్తీకి వేర్వేరుగా ఎన్నిక నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఖాళీలను ఒకే ఎన్నిక ద్వారా భర్తీ చేసేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు చల్లా మధుసూదన్‌రెడ్డి, కరణం ధర్మశ్రీ సోమవారం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

వీటిని మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్.బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. అనంతపురం, తూర్పు గోదావరి, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఒక్కో ఖాళీ భర్తీకి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల నుంచి రెండు చొప్పున ఖాళీల భర్తీకి ఎన్నికల సంఘం నిర్ణయించిందని, ఈ మేరకు ఈ నెల 2న పత్రికా ప్రకటన జారీ చేసిందని, 9న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారని, ఎన్నికల ప్రక్రియ మొత్తం జూలై 19కల్లా పూర్తవుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు.

అయితే కృష్ణా, గుంటూరు విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కో సీటు భర్తీకి వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలన్న ఈసీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమే కాక, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సైతం విరుద్ధమని వివరించారు. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు నిర్వహించేటప్పుడు ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన సీట్లతో సంబంధం లేకుండా ఒక జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకోవాలని తెలిపారు. ఈ లోపాలన్నింటినీ వినతిపత్రం రూపంలో ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇప్పటివరకు లోపాలను సవరించలేదని, అందువల్ల ఈ వ్యవహారంలో హైకోర్టు జోక్యం చేసుకోవాలని వారు కోరారు.
Share this article :

0 comments: