పోలవరం పనుల్లో భారీ ముడుపులపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోలవరం పనుల్లో భారీ ముడుపులపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు

పోలవరం పనుల్లో భారీ ముడుపులపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు

Written By news on Saturday, July 11, 2015 | 7/11/2015


బాబుగారి భారీ స్కెచ్
- పోలవరం పనుల్లో భారీ ముడుపులపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు

సాక్షి, హైదరాబాద్:
 పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతికి పక్కా ప్రణాళిక సిద్ధమైంది. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా రూ.4,800 కోట్లు నొక్కేసేందుకు ప్రభుత్వ పెద్దలు పథకం వేశారు. పోలవరానికి జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయిస్తే కేంద్రం జోక్యం చేసుకుంటుందనే భయంతో టెండర్లు లేకుండానే పనులు పంచేసి భారీగా ముడుపులు దండుకోవడానికి వ్యూహం తయారైంది.

అందుకోసం అంచనా వ్యయాన్ని ఊహలకు అందనంతగా పెంచేసేందుకు అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు ఇక సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిని ఆమోదించడం మాత్రమే మిగిలింది. రూ. నాలుగువేల కోట్ల విలువైన పోలవరం కాంట్రాక్టును రష్యా కంపెనీ ‘ట్రాన్స్‌ట్రాయ్’ భాగస్వామ్యంతో ఇప్పటి టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు దక్కించుకున్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టును నిర్మించే శక్తిసామర్థ్యాలు రాయపాటి కంపెనీకి లేవని, రష్యా కంపెనీ భాగస్వామ్యం కేవలం కాగితాలకే పరిమితమని తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగినా... అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకుండా కాంట్రాక్టును కట్టబెట్టింది.

ఆ కంపెనీ కాంట్రాక్టు పొంది రెండేళ్లు దాటినా ఇప్పటికీ నామమాత్రపు పనులకే పరిమితమైంది. ప్రభుత్వం నుంచి రూ.400 కోట్లకు పైబడి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నప్పటికీ ఆ మేరకు పనులు చేయలేక చతికిలపడింది. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆప్తులైన కంపెనీలకు సబ్‌కాంట్రాక్టు కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. అందుకోసం మళ్లీ టెండర్లు పిలవకుండానే పనికానిచ్చేయడానికి అనుసరించాల్సిన విధానాన్ని సూచించాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి నీటిపారుదల శాఖ అధికారులకు ఇటీవల ఆదేశాలు అందాయి.

రూ.4,800 కోట్లు బొక్కేసేదిలా...
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2011-12 ఎస్‌ఎస్‌ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్) ప్రకారం నిర్ణయించి రూ. నాలుగువేల కోట్ల విలువైన పనులను ‘ట్రాన్స్‌ట్రాయ్’కి అప్పగించారు. వివిధ రకాల మెటీరియల్స్, ఇంధనం, వాహనాలు, యంత్రాల ధరలు, కార్మికుల ఖర్చు.. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎస్‌ఎస్‌ఆర్‌ను ప్రభుత్వం రూపొందిస్తుంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఏటా కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌ను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2015-16 ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం ఈ పని విలువను గణిస్తే 60-70 శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే అంచనా వ్యయాన్ని మరింత పెంచితే ఆ మేరకు ముడుపులు పెంచుకోవడానికి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ట్రాన్స్‌ట్రాయ్‌కి అప్పగించిన పనుల అంచనా వ్యయాన్ని గరిష్టంగా రూ. 12 వేల కోట్లకు పెంచడానికి నీటిపారుదల శాఖలో కసరత్తు సాగుతోంది. ప్రభుత్వం, కాంట్రాక్టర్ మధ్య ఉన్న ఒప్పందంలోని 63వ నిబంధన ప్రకారం.. పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడానికి అవకాశం ఉంది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకొని, ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎంకు కావాల్సిన కాంట్రాక్టర్‌కు సబ్ కాంట్రాక్టు ఇచ్చేసి పనుల విలువను భారీగా పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే మొత్తం పనులను లాక్కుంటే తాను నష్టపోతానని, తన సంగతి కూడా చూడాలని ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ అధినేత, టీడీపీ ఎంపీ రాయపాటి సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు సాగునీటి శాఖలో ప్రచారం జరుగుతోంది. ఈమేరకు రూ. 12 వేల కోట్ల కాంట్రాక్టులో ట్రాన్స్‌ట్రాయ్ రూ. 1000 నుంచి రూ. 1500 కోట్ల మట్టి పనులు విడిచిపెట్టి, మిగతా పనులను సీఎం సూచించే కంపెనీకి ఇవ్వడానికి రంగం సిద్ధమైందని సమాచారం. పని విలువ భారీగా పెంచుతున్న నేపథ్యంలో.. మొత్తం పని విలువలో 40 శాతం వరకు సర్కారు పెద్దలకు ముడుపుల రూపంలో వస్తుందని, అందుకు అనుగుణంగానే పావులు కదులుతున్నాయని అధికారులే చెబుతున్నారు.
 
కేంద్రం జోక్యం చేసుకోకుండా జాగ్రత్తలు
పోలవరానికి జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రమే చూసుకుంటుందని ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. అయితే నిర్మాణ బాధ్యతలు కేంద్రం చేతుల్లోకి వెళితే తాము సొమ్ము చేసుకోవడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతోనే టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఏడాది కాలంగా ఒక్క అంగుళం పని కూడా ముందుకు జరగనివ్వలేదని అన్ని వర్గాలు దుమ్మెత్తిపోసినా ప్రభుత్వంలో చలనం లేని విషయం తెలిసిందే. ఏడాది కాలంగా టీడీపీ ప్రభుత్వ తీరును చూసిన కేంద్రం ఇక లాభం లేదనే ఉద్దేశంతో పోలవరానికి నిధులు ఇవ్వడానికి సానుకూలంగా ఉందనే సమాచారం ఇటీవల వెలువడింది.

ఈ నేపథ్యంలో పోలవరంలో సొమ్ము పిండుకొనే మార్గాల మీద సర్కారు పెద్దలు దృష్టిపెట్టారు. ‘‘ప్రస్తుత కాంట్రాక్టర్‌కు పనిచేసే సత్తా లేదు. పనులు జరిగితే తప్ప నిధులు రావు. ఈ నేపథ్యంలో పనులు చేయగల కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం ద్వారా పురోగతి సాధించడం, ముడుపులు దండుకోవడం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టడానికి వ్యూహం తయారు చేశారు. మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయిస్తే, కేంద్రం జోక్యం చేసుకొని పోలవరం పనులను నియంత్రణలోకి తీసుకుంటుందనే భయం ప్రభుత్వానికి ఉంది. అందుకే టెండర్లు లేకుండా పనికానివ్వడానికి, భారీగా ముడుపులు దండుకోవడానికి పక్కా ప్రణాళిక సిద్ధమైంది’’ అని పోలవరం వ్యవహారాలను సుదీర్ఘకాలంగా పర్యవేక్షిస్తున్న సీనియర్ ఇంజనీర్ ఒకరు ‘సాక్షి’కి వివరించారు.
 
http://www.sakshi.com/news/andhra-pradesh/chandrababus-big-sketch-256188?pfrom=home-top-story

Share this article :

0 comments: