మార్చ్ టు పార్లమెంట్ భవన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మార్చ్ టు పార్లమెంట్ భవన్

మార్చ్ టు పార్లమెంట్ భవన్

Written By news on Friday, July 31, 2015 | 7/31/2015


10న ఢిల్లీలో జగన్ ధర్నా
ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్‌తో జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ ఆందోళన
 పాల్గొననున్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
 ధర్నా అనంతరం     ‘మార్చ్ టు పార్లమెంట్ భవన్’
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదాపై తొలి నుంచీ డిమాండ్ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవాలన్న లక్ష్యంతో ఆగస్టు 10వ తేదీన దేశ రాజధానిలో ఒక రోజు ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు, పీఏసీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ధర్నాలో జగన్‌తోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద సంఖ్యలో ఇతర నేతలు పాల్గొంటారని సమావేశం అనంతరం ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ వెల్లడించారు.
 
ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జంతర్‌మంతర్ వద్ద ఆగస్టు 10వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ధర్నా సాయంత్రం 3 వరకూ జరుగుతుందని, ధర్నా ముగిశాక అందులో పాల్గొన్న వారందరితో ‘మార్చ్ టు పార్లమెంట్ భవన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వివరించారు.
 
 ఆ మాటలు ఇప్పుడు ఏమయ్యాయి?
 
 పార్లమెంట్‌లో విభజన బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా చాలదు, పదేళ్ల వరకూ ఇవ్వాలని కోరారని, ఆ మాటలు ఇపుడేమయ్యాయని బోస్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను సాధించాల్సిన బాధ్యత కేంద్రంలోని ఎన్డీయేతో చెలిమి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపైనే ఎక్కువగా ఉందన్నారు. కేంద్రం ప్రత్యేక హోదాను ప్రకటించకపోయినా ఎందుకు మౌనంగా ఉన్నారో, ఈ హామీని సాధించుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. జగన్ ఢిల్లీకి వెళ్లినపుడల్లా ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నారని గుర్తుచేశారు. ప్రధాని, ఇతర మంత్రులను కలిసినపుడు ఆయన ఈ అంశంపై చర్చిస్తున్నారని చెప్పారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని, దీని నిర్మాణానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని బోస్ గుర్తు చేశారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏపీకి అనివార్యంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్‌సీపీ గట్టిగా కోరుతోందని, అదే విషయాన్ని ఢిల్లీలో నినదిస్తుందని ఆయన తెలిపారు. బొత్స సత్యనారాయణ, ఎంవీ మైసూరారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయసాయిరెడ్డి, పినిపె విశ్వరూప్, ఎస్.రామకృష్ణారెడ్డి, పేర్ని వెంకట్రామయ్య, కొడాలి నాని, ఎస్.దుర్గాప్రసాదరాజు, ముఖ్యనేతలు భేటీలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: