బాబు వచ్చారు.. జాబు ఊడింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు వచ్చారు.. జాబు ఊడింది

బాబు వచ్చారు.. జాబు ఊడింది

Written By news on Thursday, July 9, 2015 | 7/09/2015

డీఆర్‌డీఏలోని ఎన్‌పీఎం సిబ్బంది తొలగింపు
* ఎలాంటి ఉత్తర్వుల్లేకుండా కేవలం సెల్ మెసేజ్ ద్వారా వేటు
* రోడ్డున పడిన 10,268 మంది సిబ్బంది
* బకాయిలు కూడా చెల్లించని ప్రభుత్వం
* న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమని బాధితుల ఆవేదన

సాక్షి ప్రతినిధి, కడప:  బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఆర్భాటంగా ప్రచారం చేసింది.

అలా ప్రచారం చేసి.. నిరుద్యోగుల ఓట్లు వేయించుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. దీంతో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశించారు. అయితే కొత్తగా జాబులొచ్చే సంగతి అటుంచి ఉద్యోగాల్లో ఉన్నవారిని ఇంటికి పంపడం మొదలైంది. గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ)లో ఎన్‌పీఎం(నాన్ పెస్టిసైడ్ మేనేజ్‌మెంట్-పురుగుమందులు లేని వ్యవసాయం) విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని ముందస్తు సమాచారం లేకుండా తొలగించారు. 2006 నుంచి విధులు నిర్వర్తిస్తున్న వారిని తొలగిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 22న ‘మీ సేవలు ఇకచాలు.. మిమ్మల్ని తొలగిస్తున్నాం’ అంటూ సెల్ మెసేజ్ వచ్చింది.

ఊహించని పరిణామంతో రాష్ట్రవ్యాప్తంగా 10,268 మంది ఎన్‌పీఎం సిబ్బంది వీధిపాలయ్యారు. పనిచేసిన కాలానికి జీత భత్యాలిచ్చారా.. అంటే అదీ లేదు. సుమారు రూ.18 కోట్లకుపైగా బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది.

ఒక్క సెల్ మెసేజ్‌తో తొలగింపు..
రాష్ట్రవ్యాప్తంగా 392 మండలాల్లో 14,93,824 మంది రైతులు పురుగుమందులు లేని వ్యవసాయం చేస్తున్నారు. వీరిని పర్యవేక్షించేందుకు క్షేత్రస్థాయిలో 7,250 మంది వీఏలు(గ్రామ కార్యకర్త), 1,450 మంది సీఏలు(క్లస్టర్ కార్యకర్త), 1,450 మంది గ్రామ కమిటీ మెంబర్లు, 59 మంది జిల్లా కమిటీ మెంబర్లు, 59 మంది కంప్యూటర్ ఆపరేటర్లు 2006 నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని జీవో నంబర్ 360 కింద కాంట్రాక్టు సిబ్బంది కింద తీసుకున్నారు. వీఏలకు రూ.2 వేలు, సీఏలకు రూ.6 వేలు, ఆపరేటర్లకు సుమారు రూ.7వేలు చొప్పున వేతనం నిర్ణయించారు.

క్షేత్రస్థాయిలో పంటలపై రైతులకు అవగాహన కల్పించడం, పొలం బడుల ద్వారా సూచనలు, సలహాలివ్వడం, అంతరపంట సాగుపై మెళకువలు అందించడం, వ్యవసాయ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసి చైతన్యపరచడం వంటి కీలక బాధ్యతలను వారి పరిధిలో నిర్వర్తించారు. అలాంటి ఎన్‌పీఎం సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా ఒక్క సెల్‌ఫోన్ మెసేజ్‌తో తొలగించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అనూహ్యంగా గత ఏప్రిల్‌లో సెర్ప్ సీఎంఎస్ డెరైక్టర్ సుధాకర్ సెల్ నుంచి ఉద్యోగాలనుంచి తొలగిస్తున్నట్లు వారికి మెసేజ్ అందింది.

బకాయిలు రూ.18 కోట్లు
ఎన్‌పీఎం సిబ్బందికి 2014 ఏప్రిల్ నుంచి ప్రభుత్వం ఎలాంటి వేతనాలు చెల్లించలేదు. చిరుద్యోగాలతో కాలం వెళ్లదీస్తూ వచ్చిన ఈ సిబ్బంది ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఉన్నపళంగా తొలగించడంతో వారి పరిస్థితి గందరగోళంగా మారింది. వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు బకాయిలు రావాల్సి ఉంది. ఆ మేరకు వైఎస్సార్ జిల్లా ఉద్యోగులకు రూ.1.20 కోట్లు బకాయిలు రావాలి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.18 కోట్ల బకాయిలు అందాల్సివుంది. జిల్లా స్థాయిలో డీఆర్‌డీఏ పీడీకి వినతిపత్రాలు సమర్పించినా, రాష్ట్రప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఎలాంటి స్పందన కనిపించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యాయం చేయండి
* జగన్‌కు బాధితుల విన్నపం
* అసెంబ్లీలో పోరాడతానని ప్రతిపక్ష నేత భరోసా
ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు బుధవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తమ ఆవేదనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యామ్నాయం చూపకపోగా.. ఉన్నపళంగా ప్రభుత్వం తమను తొలగించడం ఎంతవరకు సబబంటూ కన్నీటిపర్యంతమయ్యారు. మీరే ఆదుకోవాలంటూ విన్నవించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఒక్క వైఎస్సార్ జిల్లాలోనే 820 మంది రోడ్డు పాలైనట్టు వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం ఎన్‌పీఎం సిబ్బందిని కొనసాగిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తమపై వేటు వేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. ఎన్‌పీఎం సిబ్బందికి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని, అసెంబ్లీలో పోరాడతామని జగన్ భరోసానిచ్చారు.స్థైర్యం కోల్పోవద్దన్నారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు కృషి చేస్తామని ధైర్యం చెప్పారు.
http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-fires-on-babu-255591?pfrom=home-top-story
Share this article :

0 comments: