తుపాను హెచ్చరికల్లో ప్రభుత్వం విఫలం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తుపాను హెచ్చరికల్లో ప్రభుత్వం విఫలం

తుపాను హెచ్చరికల్లో ప్రభుత్వం విఫలం

Written By news on Saturday, July 4, 2015 | 7/04/2015

♦ వేట నిషేధ సాయం అందించడంలో నిర్లక్ష్యం
♦ {పభుత్వ తీరుపై ఆగ్రహం
♦ మత్స్యకార కుటుంబాలకు జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శ


 సాంబమూర్తినగర్ (కాకినాడ) :  సముద్రంలో తుపాను, అల్పపీడన ద్రోణి వంటి ఉపద్రవాలు ఏర్పడినప్పుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సముద్రంలో చేపల వేటకు వెళ్లి అల్పపీడనం కారణంగా సముద్రంలో చిక్కుకుని గల్లంతైన మత్స్యకార కుటుంబాలను శుక్రవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, కరప మండలాల్లో ఆయన పర్యటించారు. జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం తుపాను హెచ్చరికలు చేయకుండా జిల్లాలో తొమ్మిది మంది మత్స్యకారులను హత్య చేసిందని ఆరోపించారు.

మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడంలో ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు. ఈ ఏడాది 60 రోజుల పాటు వేట నిషేధాన్ని అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు సాయం అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. వేట నిషేధం ముగిసిన వెంటనే పొట్ట చేత పట్టుకుని సముద్రంపై చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల్లో జిల్లాకు చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారుల కుటుం బాలను పార్టీ తరఫున ఆదుకుంటామన్నారు.

 నిరుద్యోగ భృతి మాటేమైంది..?
 ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఆ మాటే మరిచారని జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. జాబు కావాలంటే బాబు రావాలని ఆర్భాటంగా ప్రచారాలు చేశారని, చంద్రబాబు నాయుడు ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలు, రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. చేసిన అప్పులు తీరక, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగానే ఇటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. పర్యటనలో భాగంగా స్థానికులు ఎక్కడికక్కడ కాన్వాయ్‌ను ఆపి తమ సమస్యలు విన్నవించుకున్నారు. పింఛన్లు రావడం లేదని, రేషన్ కార్డు లేదని, డ్వాక్రా రుణ మాఫీ చేయలేదని ప్రజలు ఆయనకు చెప్పుకున్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.

 బాధిత కుటుంబాలకు పరామర్శ
 కాకినాడ పర్లోపేటలోని కంటుముర్చి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని శుక్రవారం ఉదయం పరామర్శించారు. మృతుడి భార్య కుమారి, కుమారుడు రాజు, కుమార్తెలు ఐశ్వర్య, స్వాతిలను ఓదార్చారు. పిల్లలు చిన్నవారు కావడంతో వారిని చదివించే బాధ్యత చూడాల్సిందిగా వైఎస్సార్‌సీపీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి చలమలశెట్టి సునీల్‌కు సూచించారు.

 అక్కడి నుంచి కరప మండలం ఉప్పలంకలోని బొమ్మిడి పెద కామేశ్వర రావు కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాకినాడ రూరల్ మండలం పగడాలపేటలోని గేదెల తాతారావు, చెక్కా బుజ్జిబాబు, కామాడి నూకరాజు, కర్రి రాజు, దరిపల్లి సింహాద్రి, తిర్రి సత్తిబాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కాకినాడ సిటీ, రూరల్ మండలాల్లో పర్యటించిన జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు.
Share this article :

0 comments: