
* పేదల పక్షపాతిగా పనిచేసినందునే మహానేత అయ్యారు
* రంగారెడ్డి జిల్లాలో ముగిసిన పరామర్శ యాత్ర
* 15 కుటుంబాలకు పరామర్శ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మరణించి ఆరేళ్లయినా.. వైఎస్‌ను ప్రజలు తమ గుండెల్లో సజీవంగా పెట్టుకోవడం గర్వంగా ఉందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు.
రాజన్న జ్ఞాపకార్థం ఇప్పటికీ విగ్రహాలను ఏర్పాటు చేయడం సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు. పేదల పక్షపాతిగా పనిచేసినందునే వైఎస్ మహానేత అయ్యారన్నారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు రోజులుగా షర్మిల నిర్వహించిన పరామర్శ యాత్ర గురువారం ముగిసింది. జిల్లాలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 15 కుటుంబాలవారిని ఆమె పరామర్శించారు. ‘రాజన్న బిడ్డగా నా పట్ల చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు’ అని వ్యాఖ్యానించారు.
గురువారం తాండూరు మండలం అడ్కిచర్ల, తట్టేపల్లిలో వైఎస్ విగ్రహాలకు నివాళులర్పించిన షర్మిల.. అనంతరం మర్పల్లి, మోమిన్‌పేట, ఎన్కతలలో మూడు కుటుంబాలను పరామర్శించారు. తొలుత మర్పల్లి మండల కేంద్రంలోని కమ్మరి నారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. ఇంటి దీపం ఆరడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డానని నారాయణ భార్య నీరజ విలపించడంతో షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు. ‘నాన్న గారి కోసం ఆత్మత్యాగం చేసిన మీ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటాం.
ఏ కష్టమొచ్చినా నాకు ఫోన్ చేయండి’ అని భరోసా ఇచ్చారు. అక్కడ్నుంచి మోమిన్‌పేటలోని అరిగే యాదయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఎలాంటి ఉపాధి లేని యాదయ్య కుమారుడికి ఆసరా ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం ఎన్కతలలో ఆలంపల్లి వెంకటేశ్ కుటుంబాన్ని కలిశారు. ‘నాన్న లేరని దిగులు పడకు.. ఆయన ఆత్మశాంతించేలా బాగా చదువు. నీ ఉన్నత చదవులకు ఎలాంటి సాయమైనా చేస్తా’ అని ఆయన కూతురు కృష్ణవేణికి భరోసా ఇచ్చారు.
ఓటుకు కోట్లు కేసులో పట్టుబడ్డ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విషయంలో టీడీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర ముగిసిన అనంతరం మోమిన్‌పేటలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైఎస్‌కు రంగారెడ్డి జిల్లా అన్నా..
ఇక్కడి ప్రజలకు వైఎస్ కుటుంబమన్నా ప్రత్యేకాభిమానం ఉందని, అది పరామర్శ యాత్రలోనూ కనిపించిందని పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నాలుగు జిల్లాల్లో పరామర్శయాత్ర ముగిసిందని, ఈ నెలాఖరులో మరో జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర చేపడతారని చెప్పారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అద్భుత పథకాలను ప్రవేశపెడుతున్నట్లు సీఎం కేసీఆర్ మాటలతో మభ్యపెట్టడం తప్ప.. ఇప్పటికీ ఒక్క పథకం కూడా కార్యరూపం దాల్చలేదన్నారు. పండు వృద్ధులకు సైతం పింఛన్ రావడంలేదని విమర్శించారు.
0 comments:
Post a Comment