మీ అక్రమాలను అడ్డుకుంటే దాడులా?! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీ అక్రమాలను అడ్డుకుంటే దాడులా?!

మీ అక్రమాలను అడ్డుకుంటే దాడులా?!

Written By news on Tuesday, July 14, 2015 | 7/14/2015


మీ అక్రమాలను అడ్డుకుంటే దాడులా?!
వైఎస్సార్‌సీపీ నేత బొత్స ప్రశ్న
 
హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులపై అధికారపక్షం రెచ్చిపోయి దాడులు చేయడం ఏమిటి? ప్రజాస్వామ్యంలో ఇదేం పద్ధతి? మీ అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని వైఎస్సార్  కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో జరుగుతున్నన్ని అరాచకాలు, నీచాతి నీచమైన కార్యక్రమాలు ఎన్నడూ జరగలేదన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై అక్రమ కేసు నమోదు చేయడంపై ధ్వజమెత్తారు. తమ పొలాల్లో టీడీపీ వారు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టారని రైతులు వచ్చి ఎమ్మెల్యే రాజాకు ఫిర్యాదు చే యడంతో ఆయన అక్కడకు వెళ్లి జరుగుతున్న అక్రమాలను ఎమ్మార్వో, ఎస్‌ఐకి ఫోన్ చేసి చెప్పారన్నారు.

ఫోన్ చేసిన మూడు గంటల తరువాత గాని వారు స్పందించలేదని, ఈలోపు టీడీపీ వారు ఎమ్మెల్యేపై దౌర్జన్యం చేసి తమ వాహనాలను తీసుకెళ్లిపోయారన్నారు. ఎమ్మెల్యేపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని బొత్స డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వారు దాడులు చేయడం, తిరిగి దాడికి గురైన వారిపైనే ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టడం అలవాటుగా మారిపోయిందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, రాజాల విషయంలో ఎమ్మార్వో వనజాక్షి విషయంలో ఇదే అక్రమం జరిగిందన్నారు. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే ఆర్.కె.రోజాపై కూడా ఇదే చట్టం కింద అక్రమ కేసు పెట్టించారన్నారు.
 
సమ్మెపై దృష్టి సారించండి
 సీఎం చంద్రబాబు తన సెటిల్‌మెంట్లు, దందాలు పక్కనబెట్టి రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెపై దృష్టిసారించి వారి సమస్యలను తక్షణం పరిష్కరించాలని బొత్స డిమాండ్ చేశారు. ఇప్పటికే వారి సమ్మె నాలుగో రోజుకు చేరుకోవడంతో ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: