'అనంత’ ఆత్మహత్యలు దేశానికి తెలిశాయి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'అనంత’ ఆత్మహత్యలు దేశానికి తెలిశాయి!

'అనంత’ ఆత్మహత్యలు దేశానికి తెలిశాయి!

Written By news on Saturday, July 25, 2015 | 7/25/2015


'అనంత’ ఆత్మహత్యలు దేశానికి తెలిశాయి!
అందుకే రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి ‘అనంత’కు వచ్చారు: వైఎస్ జగన్

అనంతపురం: ‘‘రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయిందని రాహుల్‌గాంధీ అన్నారట. వారు పెద్దోళ్లు... అవసరంకోసం ఏమైనా మాట్లాడతారు. అవసరం వస్తే దండ వేస్తారు. లేదంటే బండ వేస్తారు. కానీ ఏడాదిగా ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూనే ఉన్నాం. గుంటూరు, మంగళగిరితోపాటు చాలాచోట్ల దీక్షలు చేశాం. మేం చేసిన రైతు భరోసాయాత్రతోనే అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఢిల్లీకి తెలిశాయి. అందుకే విమానం ఎక్కి ఢిల్లీ నుంచి జిల్లాకు వచ్చారు’’ అని  ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై వైఎస్సార్‌సీపీ అధినేత, విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతుభరోసాయాత్ర నాలుగోరోజు శుక్రవారం జగన్ పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో పర్యటించి, ఐదు కుటుంబాలను ఓదార్చారు. రొద్దం మండల కేంద్రంలో రైతులు, డ్వాక్రా మహిళలతో చర్చాగోష్టి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
తెలుగుదేశం ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా మోసం చేయడంతో రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. అనంతపురం జిల్లాలో 80 మందికిపైగా అన్నదాతలు, 20మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు ధైర్యం చెప్పాలని గత నాలుగు నెలల్లో 23 రోజులపాటు భార్య, పిల్లలను వదిలి రైతు భరోసాయాత్ర చేస్తున్నా. రెండు విడతల్లో 25 కుటుంబాలను పరామర్శించా. మూడో విడత సాగుతోంది. రైతులు, చేనేతలు ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారో ప్రభుత్వాలకు చూపించేలా తిరుగుతున్నా. ఈ యాత్రతోనే‘అనంత’ ఆత్మహత్యలు దేశానికి తెలిశాయి. అనంతపురం అనే  ఓ జిల్లా ఉందని రాహుల్‌గాంధీకి జ్ఞానోదయమైంది.

అవసరం ఉందంటే దండ.. లేదంటే బండ
రాహుల్‌గాంధీ చాలా పెద్దవారు. అవసరం కోసం ఏదైనా మాట్లాడతారు. అవసరం లేకపోతే తీసి పక్కనపడేస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చివరి రక్తపుబొట్టు వరకూ కాంగ్రెస్‌పార్టీ కోసం శ్రమించారు. వారి కోసం పోరాడారు. పోరాడుతూనే చనిపోయా రు. వైఎస్ బతికి ఉన్నపుడు గొప్పవారు... జగ న్ కూడా కాంగ్రెస్‌లో ఉన్నంతవరకూ గొప్పవాడే! ఇచ్చిన మాటకోసం ‘ఓదార్పు’ చేసేందుకు పార్టీని వదిలితే జగన్ చెడ్డవాడైపోయాడు... వైఎస్ కూడా చెడ్డవారైపోయారు. చివరకు టీడీపీతో కలిసి మాపై ఒక్కటై కేసులు పెట్టారు.

వైఎస్ పేరు చెప్పకపోతే ఇక్కడ ఏమీ చేయలేరు. అందుకే రాహుల్‌గాంధీ మళ్లీ వైఎస్‌కు దండ వేశారు. అవసరం వస్తే దండ వేస్తారు... లేదంటే బండ వేస్తారు. రాష్ట్రాన్ని విడగొట్టొద్దని అంటే వినకుండా విడగొట్టారు. ఇప్పుడొచ్చి ప్రత్యేకహోదా రాలేదా? పోలవరం కాలేదా? అని మాట్లాడుతున్నారు. వీళ్లలా భయానక రాజకీయాలు నేర్చుకోలేదని చెప్పేందుకు సంతోషిస్తున్నా.

రైతులు పిట్టల్లా రాలుతున్నా చంద్రబాబుకు పట్టలేదు
‘అనంత’లో రైతులు, చేనేతలు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. చంద్రబాబు ఎన్నికలముందు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఇప్పడు చేయలేదు. దీంతో అప్పులబాధ తాళలేక వీరంతా ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. లక్షలమంది ఉపాధికోసం బెంగళూరుకు వలస వెళుతున్నారు. ‘అనంత’లో ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా చంద్రబాబుకు పట్టలేదు. హామీలు అమలు చేసేలా పోరాడుదాం, చంద్రబాబు మెడలు వంచుదాం.

విత్తనాలు కూడా సరఫరా చేయని అన్యాయమైన పరిస్థితులున్నాయి. జిల్లాకు 5.50 లక్షల క్వింటాళ్ల వేరుసెనగ విత్తనం అవసరమైతే.. కేవలం 1.50లక్షల క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారు. టీడీపీ నేతలు వాటిని అమ్ముకుంటూ పట్టుబడిన దారుణస్థితి. దీంతోపాటు ఇసుకను కూడా దోచుకుతింటున్నారు.

ఇష్టాగోష్టిలో రైతులు, డ్వాక్రా మహిళల అభిప్రాయాలు
చంద్రబాబు తొలగిపోతే శనిపోతుంది
సార్! మాది షిరిడిసాయి గ్రూపు. మాకు రూ.1.50 లక్షల అప్పుంది. రుణ మాఫీ అవుతాదని అప్పుచెల్లించలేదు. ఇప్పుడు మీ అబ్బసొమ్మా... బాకీ కట్టండని బ్యాంకోళ్లు అంటాండారు. భిక్షగాళ్లకు వేసినట్లు మూడువేలు ఇస్తున్నారు. తిరుపతికి వెళ్లకుండానే నామాలు పెడుతున్నారు. చంద్రబాబు తొలగిపోతే ఏడేళ్ల శనిపోతుంది.     -  నిర్మల, చోలేమరి

ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పుడే చూశా..
సార్... నాకు రూ.1.40 లక్షల బ్యాంకు అప్పుంది. వడ్డీ రూ.30వేలైంది. రూ.14వేలే మాఫీ అయింది. ఇన్స్యూరెన్స్, ఇన్‌పుట్‌సబ్సిడీ లేదు. గత 45 ఏళ్లలో విత్తనాలు ఇవ్వని ప్రభుత్వాన్ని ఇప్పుడే సూచ్చాండా!      - శ్రీరామిరెడ్డి, రొద్దం

రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేశాడు..
డబ్బులు మాఫీ అవుతాయని ఆశపడి అందరం ఓట్లేసినాం. ఇప్పుడు మూడునామాలు పెట్టిచ్చుకున్నాం. నాకు పింఛన్‌కూడా ఇవ్వలేదు. టీడీపీ వాళ్లకే ఇస్తాండారు. నాకు ఇచ్చినా, ఇవ్వపోయినా లెక్కలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా సెంద్రబాబు సేసినాడు.  - రత్నమ్మ, రాగిమేకలపల్లి,
Share this article :

0 comments: