
మునికోటి కుటుంబానికి వైఎస్ జగన్ ఓదార్పు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆత్మత్యాగం చేసిన ముని కామకోటికి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తిరుపతిలో మంగళవారం నివాళులర్పించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో రాష్ట్ర ప్రజల గొంతుకను వినిపించిన జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా ఇక్కడికి వచ్చి మునికామకోటి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.
తిరుపతి కార్పొరేషన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఆత్మబలిదానం చేసిన బెంగళూరు బీ.మునికామకోటి అలియాస్ బీఎంకే కోటి కుటుంబాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా మధ్యాహ్నం తిరుపతిలోని మంచాల వీధికి చేరుకున్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన కోటి కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా రావడంతో ఆయన చూసిన జనం ‘‘కోటి అమర్ రహే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, జగన్‌తోనే ప్రత్యేక హోదా’’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కోటి ఆత్మ త్యాగం ఊరికే పోకూడదని, కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం వచ్చేలా పోరాడాలని, ప్రత్యేక హోదా మీతో (జగన్)నే సాధ్యం కావాలని, మీ పోరాటానికి తామంతా సిద్ధంగా ఉన్నామంటూ.. మంచాల వీధి ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. ఈ క్రమంలో మధ్యాహ్నం బీఎంకే కోటి ఇంటికి జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. అక్కడ కోటి తమ్ముడు మురళి, వదిన లక్ష్మీ, మామ రామచంద్రయ్య, అక్క రాజ్యలక్ష్మీని ఆప్యాయంగా పలకరించారు. వారిని ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కోటిని కాపాడబోయి గాయాలపాలైన శేషాద్రిని పరామర్శించి, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామని ఓదార్చారు. అనంతరం రాజన్న పార్కు వద్ద ఉన్న బీఎంకే కోటి భార్య దాక్షాయణి(38), ఆమె తండ్రి గణపతి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఓదార్చారు.
‘ఏం తల్లీ..ఏమి చేస్తున్నావ్, ఎలా ఉంటున్నావ్, కుటుంబ నేపథ్యం ఏమిటి? అంటూ పలకరించారు. వైఎస్ జగన్ ఓదార్పు మాటలతో దాక్షాయణి కన్నీటి పర్యంతమైంది. దీంతో ఆయన స్పంది స్తూ ‘కోటి చేసిన త్యాగం ఊరికే పోదు, ఆ త్యాగానికి తగిన ప్రతిఫలం ప్రత్యేక హోదా సాధిస్తామ’ని అన్నారు. మీకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తామని ధైర్యం కల్పించారు. నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి అన్నలకు చెప్పండి, అండగా ఉంటారు..’ అం టూ ఆమెను ఓదార్చారు. ఈ కార్యక్రమం లో వైఎస్‌ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బియ్యపు మధుసూదన్ రెడ్డి, పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి పాల్గొన్నారు.
కోటి చేసిన త్యాగం ఊరికే పోదు. ప్రత్యేకహోదా సాధనతోనే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది. కోటి మాదిరి ప్రాణాలను బలి చేసుకోవద్దు. కేంద్రం, సీఎం చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచి ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదా సాధిస్తాం.
0 comments:
Post a Comment