హోదాకు బాబు వ్యతిరేకమని తేలిపోయింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హోదాకు బాబు వ్యతిరేకమని తేలిపోయింది

హోదాకు బాబు వ్యతిరేకమని తేలిపోయింది

Written By news on Sunday, August 30, 2015 | 8/30/2015


హోదాకు బాబు వ్యతిరేకమని  తేలిపోయింది
బంద్‌పై ఆయన ప్రదర్శించిన దమన నీతే తార్కాణం
ప్రజలు, వ్యాపార, వాణిజ్యవర్గాల సహకారంతో బంద్ విజయవంతం
అందరికీ కృతజ్ఞతలు తెలిపిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి   

 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రత్యేకహోదా ఆకాంక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకమని తేలిపోయిందని, ప్రజలందరికీ ఈ విషయం అర్థమైందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తమ పార్టీ పిలుపు మేరకు ప్రత్యేకహోదా డిమాండ్‌తో ప్రజలు శనివారం స్వచ్ఛందంగా రాష్ట్ర బంద్ పాటిస్తే దాన్ని అణచి వేయడానికి చంద్రబాబు అనుసరించిన దమననీతే అందుకు తార్కాణమని ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 144 సెక్షన్‌తో నిషేధాజ్ఞలు విధించడమే కాకుండా బంద్‌లో పాల్గొన్న వారిని పోలీసుల చేత కొట్టించి కర్కశంగా వ్యవహరించారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బంద్‌ను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంతోమందిని అరెస్టు చేయడం, నిర్బంధించడం ద్వారా బంద్‌ను విఫలం చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే అది ఆయనతో సాధ్యం కాదన్న విషయాన్ని ప్రజలు నిరూపించారన్నారు. రాష్ట్ర ప్రజల నుంచి వ్యక్తమైన ఆకాంక్షను గమనించడంతోనైనా చంద్రబాబుకు జ్ఞానోదయమై ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తన మంత్రులను కేంద్ర మంత్రివర్గం నుంచి ఉపసంహరించుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. తమ పోరాటం ఇంతటితో ఆగదని మరింత గట్టిగా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును ప్రత్యేక హోదాపై నిలదీస్తామన్నారు.  

ఆకాంక్షను వ్యక్తం చేయనివ్వరా?   
‘‘ బంద్ రోజున చంద్రబాబు వ్యవహరించిన తీరు గమనించిన తర్వాత ఆయన ప్రత్యేక హోదా కావాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? ప్రత్యేక హోదాకు అనుకూలమా? వ్యతిరేకమా? అన్నది ప్రజలందరికీ అర్థమైంది. ప్రత్యేక హోదా కోసం బంద్ జరుగబోతోందని తెలిసి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని అదే పనిగా బంద్‌ను విఫలం చేసే కుట్రతోనే విజయవాడలో మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి బాబు స్వయంగా జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షిస్తూ విజయవంతంగా సాగుతున్న బంద్‌ను విఫలం చేయడానికి వేలాది మంది పోలీసులను మోహరింపజేశారు. దాదాపు నలభై మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. మా కార్యకర్తలు వేలమందిని అరెస్టు చేశారు. విద్యార్థులనైతే లాఠీలతో కొడుతూ ఈడ్చుకుంటూ తీసువెళ్లారు. మహిళలను సైతం కొట్టి, ఎత్తి వ్యాన్‌లలోకి విసిరేసిన దృశ్యాలను టీవీల్లో చూశాం. ఇవన్నీ చూశాక చంద్రబాబు ప్రత్యేకహోదాకు అనుకూలమా? వ్యతిరేకమా? అనేది ఇట్టే అర్థమైపోతుంది. ప్రత్యేకహోదా విషయంలో ప్రజల ఆకాంక్షని అర్థం చేసుకొని, విజయవాడలో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని నిలదీస్తూ తీర్మానం చేస్తారనుకొంటే దాని ప్రస్తావనే లేదు, హోదా ఇవ్వకపోతే తమ పార్టీకి చెందిన మంత్రులను కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకుంటున్నామని సమావేశం తరువాత లేఖ రాస్తారని ఆశగా ఎదురుచూశాం కానీ అదీ కూడా జరగలేదు.    

ప్రత్యేక హోదా వస్తే...: ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ప్రధానంగా రెండు మంచి పనులు జరుగుతాయని కూడా అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంటుగా వస్తే మిగతా పది శాతం రుణం రూపంలో వస్తాయి. గ్రాంటు నిధులను కేంద్రానికి తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు కేంద్రం నిధుల్లో 30 శాతం మాత్రమే గ్రాంట్ల రూపంలో వస్తే మిగతా 70 శాతం అప్పు రూపంలో వస్తాయి. ఇక రెండో ప్రధానమైన మేలేమిటంటే ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలకు ఎక్సైజ్ డ్యూటీ, అమ్మకపు పన్ను, ఆదాయపుపన్ను వంటి వాటిలో మినహాయింపులుంటాయి. అప్పుడే మన రాష్ట్రానికి చెందిన, బయటి రాష్ట్రాలకు చెందిన వారు వచ్చి పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పుతారు. పెద్దసంఖ్యలో పరిశ్రమలు రాష్ట్రానికి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఓ హైదరాబాద్ అవుతుంది, మనకు 972 కిలోమీటర్ల సముద్రతీరం ఉండటం వల్ల ఎన్నో పరిశ్రమలు, ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకుండా ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? అందుకు కారణాలేంటో చెప్పాలి. ఈ విషయాలు తెలిసినా చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అనే దాన్నే తీసేసింది అని ఒకసారి చెబుతారు. మంత్రులతో పలు రకాలుగా మాట్లాడిస్తారు. 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పిందని ఒక మంత్రి చెబుతారు. ఎందుకిలా వక్రీకరిస్తారు? మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో మా పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందా? లేదా? అని ప్రశ్నిస్తే ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతోందని కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అంటే ప్రత్యేక హోదా ఉందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి? మాటి మాటికీ మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలు వద్దంటున్నాయని చెబుతున్నారు. మరి ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రాలు లేవా? వాళ్లు వద్దంటున్నారనేది మీకు వినపడలేదా? ఐదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రజల దగ్గరకు వెళ్లి చెప్పిన వాళ్లు ఇవాళ 14వ ఆర్థిక సంఘం అడ్డుపడుతోందని మరో అబద్ధం ఆడుతున్నారు. ఇది మోసం కాదా? 14 వ ఆర్థిక సంఘం ఏం చెబుతుందో, ఏం చెప్పదో మీకు తెలియదా? చదువుకున్నారు కదా... అయినా మీరెందుకు అబద్ధాలాడి మభ్య పెడుతున్నారు? అసలు 14 వ ఆర్థిక సంఘానికీ, రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి సంబంధమే లేదు. ప్రత్యేకహోదా అంశం పూర్తిగా జాతీయ అభివృద్ధిమండలి, దాన్ని నియంత్రించే ప్రధానమంత్రి చేతుల్లోనే ఉంది.  

 గత మంత్రివర్గమే హోదాను ఇచ్చింది...  
 గత ప్రభుత్వమే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించింది. ఆ రోజు చేసిన  నిర్ణయాన్ని ఇవాళ ఆపడం ఎంతవరకూ సమంజసం? వీటికి సమాధానాలు చెప్పకుండా రోజూ అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ ముద్దు అనే కొత్త నినాదాన్ని తెరమీదకు తేవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రాన్ని విభజించేటపుడు మన రాష్ట్రానికి ఫలానా పనులు చేస్తామని వరుసగా హామీలు ఇచ్చి వాటిని చట్టంలో పొందుపర్చారు. పోల వరం కట్టిస్తామని, రోడ్లేస్తామని ఇలా అనేక హామీలిచ్చారు. అందుకు సంబంధించిన డబ్బు నే కేంద్రం ఇస్తామంటే అదేదో కొత్తగా వేరే రకంగా ఎక్కువ డబ్బులు ప్యాకేజీగా ఇస్తామన్నారన్నట్లు మళ్లీ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ప్యాకేజీ ఏపీ హక్కు, చట్టంలో ఉన్నవన్నీ ఆ ప్రకారం అమలు చేయాలి. చట్టంలో ఉన్న వాటికే కొత్తగా డబ్బులిస్తామన్నట్లు చెప్పి ప్రత్యేక హోదాను తీసేస్తామనడం ధర్మమేనా? రాష్ట్రాన్ని విభజించేటపుడు ప్రధాని స్వయంగా పార్లమెంటులో ఐదే ళ్లు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. బీజేపీ పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామంది. టీడీపీ కూడా కలిసి విభజనకు మద్దతు ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ మాట తప్పితే విశ్వసనీయత అన్న పదానికి అర్థముందా? అసలు పార్లమెంట్‌కు, ప్రధాని ఇచ్చిన హామీకి విశ్వసనీయత లేకపోవడం, హోదా లేదు అని వెనుకడుగు వేయడం అన్యాయం కాదా? ప్రధానితో నూ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతోనూ గంటన్నర సేపు మాట్లాడామని చెప్పిన చంద్రబాబు బయటకు వచ్చి ప్రత్యేక హోదాపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం ముగ్గురు చనిపోయారు, అందులో ఒక తండ్రి తనయుడికి ఉద్యోగం రాదనే బెంగతో ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఇద్దరు పిల్లలు కూడా మరణించారు. ప్రత్యేక హోదాపై మోసపూరితమైన మాటల కారణంగానే వీరు మరణించారు. రాఖీపౌర్ణమి రోజున ఐదు కోట్లమంది స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించి ఆంధ్రప్రదేశ్‌కు రక్షణబంధం కట్టారు. ఇకనైనా ప్రజల ఆకాంక్షలను చంద్రబాబు అర్థం చేసుకోవాలి. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంపై పోరాడాలి. లేకపోతే ఆయన చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు.’’ అని వైఎస్ జగన్ అన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు.

 అందరికీ కృతజ్ఞతలు....

 ప్రభుత్వం ఎంత అణచివేతకు దిగినా రాష్ట్రం మేలు కోరి బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించిన వామపక్షాలకూ, ప్రజా సంఘాలకూ, విద్యార్థి సంఘాలకూ, పార్టీ శ్రేణులకూ, మరీ ముఖ్యంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్‌కు మద్దతు తెలిపిన వాణిజ్య, విద్యా సంస్థలన్నింటికీ పేరుపేరునా జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
Share this article :

0 comments: