మాజేరుకు బాసట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాజేరుకు బాసట

మాజేరుకు బాసట

Written By news on Wednesday, August 5, 2015 | 8/05/2015


మాజేరుకు బాసట
విషజ్వరాలు ప్రాణాలను హరిస్తుంటే బెంబేలెత్తి పోతున్న చల్లపల్లి మండలం కొత్తమాజేరు వాసులకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వారికి బాసటగా నిలిచారు. జ్వరమరణాలకు గురైనవారి కుటుం బాలను తక్షణం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల తరఫున పోరాటాలకు సిద్ధమని స్పష్టం చేశారు.

- చల్లపల్లి మండలంలో పర్యటించిన వైఎస్ జగన్
- విషజ్వర మృతుల కుటుంబాలకు పరామర్శ
- గోడు వెళ్లబోసుకున్న బాధితులు
- తక్షణం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జగన్
మచిలీపట్నం :
 చల్లపల్లి మండలం కొత్తమాజేరులో విషజ్వరాల బారిన పడి రెండున్నర నెలల వ్యవధిలో 18 మంది మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. కొత్త మాజేరులోని తాగునీటి చెరువు పక్కన ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మృతుల కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఒక్కొక్క పేరు చదువుతూ.. మృతులు ఎన్ని రోజుల పాటు జ్వరం బారినపడ్డారు.. ఎక్కడ వైద్యం చేయించుకున్నారు.. ఎంత ఖర్చు చేశారు.. ప్రభుత్వ సాయం అందిందా.. వైద్యశాఖ మంత్రి గ్రామానికి వచ్చారా, లేదా అనే వివరాలను బంధువుల నుంచి సేకరించారు. మృతులంతా విషజ్వరం బారిన పడే చనిపోయారని, ఎంత డబ్బు ఖర్చుచేసినా ప్రాణాలు దక్కలేదని ప్రతి ఒక్కరూ చెప్పారు.
 
ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుంది : జగన్
బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించిన జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ‘ప్రభుత్వం స్పందించదు. వైద్యశిబిరంలో ఇచ్చిన మందులు పనిచేయవు. మృతుల కుటుంబాలకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి సాయం అందించలేదు.’ అని విమర్శించారు. ఈ సందర్భంగా బాధితులు ప్రభుత్వం వైద్యం శిబిరం ఏర్పాటుచేసిన తర్వాత కూడా మరణాలు సంభవించాయని వివరించారు. ఒకేరోజు గంటల వ్యవధిలోనే జంధ్యం జయలక్ష్మి, ఆమె భర్త శ్రీరాములు మరణించారని, దీంతో శ్రీరాములు తల్లి నాగేశ్వరమ్మ, కుమార్తె సీతమ్మ అనాథలుగా మిగిలారని గ్రామస్తులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. చేనేత పనిచేసే శ్రీరాములు తల్లి, కుమార్తెను పోషించేవారని, ఆయన మరణంతో ఆ ఇద్దరికీ దిక్కు లేకుండా పోయిందని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ‘వీళ్ల ఉసురు ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుంది.’ అన్నారు.
 
చెరువు పరిశీలన
కొత్తమాజేరు చేరుకున్న జగన్ 18 మంది మరణించడానికి గల కారణాలు, గ్రామంలో నెలకొన్న పరిస్థితులను తహశీల్దార్ స్వర్ణమేరి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఉన్న వాస్తవాలను తెలియజేయాలని, ఎవరికీ భయపడవద్దని చెప్పారు. చెరువులోని నీరు కలుషితం కావటం వల్లే విషజ్వరాలు ప్రబలాయని, ఈ విషయంపై ముందస్తుగానే హెచ్చరించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), కొక్కిలిగడ్డ రక్షణనిధి, మేకా వెంకటప్రతాప్ అప్పారావు, ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు రాధాకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని), పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, సింహాద్రి రమేష్‌బాబు, దూలం నాగేశ్వరరావు, జోగి రమేష్, ఉప్పాల రాంప్రసాద్, ఉప్పాల రాము, కాజ రాజ్‌కుమార్, తలశిల రఘురామ్, తాతినేని పద్మావతి, ఆయా మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
రుణమాఫీ జరగలేదు
చల్లపల్లి మీదుగా ఘంటసాల మండలం లంకపల్లికి చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి ఘంటసాల మండల అధ్యక్షుడు వేమూరి వెంకట్రావు, సర్పంచి మాడెం నాగరాజు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కనుమూరి బుజ్జి అనే మహిళ మాట్లాడుతూ ‘బాబూ నీకు ఓటేశామనే కారణంతో బ్యాంకులో బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రూ.10వేల రుణాన్ని మాఫీ చేయలేదు.’ అని వివరించారు. రైతులకూ పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అధికారాన్ని దక్కించుకునేందుకు చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో అమలుకాని హామీలు ఇచ్చారని, రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని, రాబోయే రోజులు మనవేనని భరోసా ఇచ్చారు.
Share this article :

0 comments: