నిర్లక్ష్యమే నిజం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిర్లక్ష్యమే నిజం!

నిర్లక్ష్యమే నిజం!

Written By news on Friday, August 7, 2015 | 8/07/2015


నిర్లక్ష్యమే నిజం!
ఏఎన్‌యూ : ‘యూనివర్సిటీ కళాశాలలు, వసతి గృహాల్లో పరిస్థితులపై పలుమార్లు విద్యార్థినులు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇదే రిషితేశ్వరి మరణానికి కారణమైంది..’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  బృందం ఆరోపించింది. తప్పులు చేసిన కొందరిని రక్షించేందుకు యూనివర్సిటీ, ప్రభుత్వ అధికారులు వర్సిటీ వ్యవస్థను, సమాజాన్ని బదనాం చేస్తున్నారని మండిపడింది. రిషితేశ్వరి మృతి ఘటనలో వాస్తవాలు వెలికి తీసేందుకు ఆ పార్టీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్రస్థాయి నాయకులతో కూడిన బృందం గురువారం ఏఎన్‌యూలో పర్యటించింది.

పరిపాలనా భవన్‌లోని వీసీ కార్యాలయంలో ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.ఆర్.ఎస్.సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్‌తో వైఎస్సార్ సీపీ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆర్‌కే రోజా, కె.పార్థసారధి మాట్లాడుతూ వర్సిటీలో మహిళల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మృతురాలు రాసుకున్న డైరీ చదివితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. డైరీ మొత్తాన్ని యూనివర్సిటీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. యాంటీ ర్యాగింగ్ చట్టం ప్రకారం ప్రిన్సిపాల్‌ను ఎందుకు అరెస్టు చేయించలేదని మండిపడ్డారు.  ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. వర్సిటీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

 నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రిషితేశ్వరి ఘటనలో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ తప్పులు ఉన్నాయని ఆయన్నెందుకు ఏ1 ముద్దాయిగా చేర్చలేదని ప్రశ్నించారు. బాపట్ల, మాచర్ల ఎమ్మెల్యేలు కోనరఘపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థిని మృతికి కారకులైన వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిం చటం దురదృష్టకరమన్నారు. నిజనిర్ధారణ కమిటీ సభ్యుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ బాబురావు అరాచకాలను ప్రశ్నించినందుకే  దళిత అధ్యాపకుడు డేవిడ్‌రాజును విధుల నుంచి తొలగించారని మండిపడ్డారు.

 పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అధికారులు కులాలవారీగా వివక్ష కనబరచటం సరికాదన్నారు. ఏఎన్‌యూ నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్ ఆచార్య సి.రాంబాబును విచారణకు సంబంధించిన పలు అంశాలపై వైఎస్సార్ సీపీ బృందం ప్రశ్నించింది. విద్యార్థులకు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఫారాన్ని చూపాలని డిమాండ్ చేశారు.  ఆయన ఫీడ్‌బ్యాక్ ఫారాన్ని తెప్పించి వైఎస్సార్ సీపీ బృందానికి ఇచ్చారు. బృందం పట్టు వీడక పోవటంతో  రిషితేశ్వరి మృతికి పరోక్షంగా కారణమైన బాబురావుపై యాంటీ ర్యాగింగ్ చట్టం కింద చర్యలు తీసు కోవాలని పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అందరి సమక్షంలో లేఖ రాశారు.

అనంతరం రోజా,  వైఎస్సార్ సీపీ మహిళా ఎమ్మెల్యేలు యూనివర్సిటీలోని బాలికల వసతి గృహాలను సందర్శించి విద్యార్థినులతో చర్చించారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు షేక్ మహ్మద్ ముస్తఫా, ఉప్పలేటి కల్పన, జలీల్‌ఖాన్, మేకా ప్రతాప అప్పారావు,  గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, గిడ్డి ఈశ్వరి, గౌరు చరిత, కళావతి, పుష్పశ్రీవాణి, రక్షణ నిధి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నిజనిర్ధారణ కమిటీ సభ్యులు వంగవీటి రాధా, లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, గురజాల నియోకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు, వైఎస్సార్ సీపీ యువజన, మహిళా, విద్యార్థి, మైనార్టీ, ఎస్టీ  విభాగాల  జిల్లా అధ్యక్షులు కావటి మనోహర్ నాయుడు, యేళ్ల జయలక్ష్మి, పానుగంటి చైతన్య, సయ్యద్‌మాబు, మొగిలి మధు, వైఎస్సార్ సీపీ  జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవెళ్ల రేవతి, తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కత్తెర సురేష్ పాల్గొన్నారు.

 ప్రభుత్వ తీరుపై ధ్వజం.. సాక్షి, గుంటూరు :  అనంతరం రోజా విలేకరులతో మాట్లాడుతూ  ఎంఎల్‌ఏ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కనీసం వర్సిటీకి వచ్చి రిషితేశ్వరి వ్యవహారంపై ఆరా తీయలేదంటే టీడీపీ నేతలకు మహిళలపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందన్నారు.  హోం శాఖ నిద్ర పోతోందని ఆరోపించారు.  బాబు  పవర్  తన వద్ద పెట్టుకుని పదవి చిన్నరాజప్పకు ఇచ్చారనారు.

 కఠినంగా శిక్షించాలి..  ప్రిన్సిపాల్ బాబురావు లాంటి వ్యక్తుల వల్ల విద్యార్థినులు ప్రాణాలు కోల్పోవడంతోపాటు యూనివర్సిటీ విలువలు దిగజారుతున్నాయి. ప్రెషర్స్‌డే పార్టీని యూనివర్సిటీలో కాకుండా హాయ్‌ల్యాండ్‌లో ఏర్పాటు చేసి మందేసి, చిందు వేయించిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోకపోవడం వల్లనే రిషితేశ్వరి మృతి చెందింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపి దోషులను శిక్షించాలి.
                   -  కొలుసు పార్థసారధి, మాజీమంత్రి

 ప్రిన్సిపాల్‌పై చర్యలేవీ..  
 కళాశాల ప్రారంభమైన నెల రోజుల్లో ప్రెషర్స్ డే ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఐదు నెలల తర్వాత ఎక్కడో బయట ఏర్పాటు చేసి చిందులు వేస్తున్నా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణం.        
- ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు , ఎమ్మెల్సీ

 నివేదిక దారుణం..  రిషితేశ్వరి డైరీలోని పేజీలన్నీ మీడియాలో ప్రదర్శించినప్పటికీ వర్సిటీ నిజనిర్ధారణ  కమిటీ దాన్ని చూడకుండా నివేదిక ఇవ్వడం దారుణం.   
            -  వంగవీటి రాధా, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు

 అనుమానాలున్నాయి..  బాబురావు తప్పు చేశాడని నిర్ధారించినప్పటికీ  చర్యలు తీసుకోకపోవడం అనుమానాలు కలుగుతున్నాయి.
 -  గొట్టిపాటి రవికుమార్,  అద్దంకి ఎంఎల్‌ఏ
Share this article :

0 comments: