రిషితేశ్వరికి న్యాయం జరిగేదాకా పోరాడతాం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రిషితేశ్వరికి న్యాయం జరిగేదాకా పోరాడతాం..

రిషితేశ్వరికి న్యాయం జరిగేదాకా పోరాడతాం..

Written By news on Friday, August 7, 2015 | 8/07/2015


రిషితేశ్వరికి న్యాయం జరిగేదాకా పోరాడతాం..
వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ స్పష్టీకరణ
నాగార్జున  వర్సిటీలో పర్యటన
ఇన్‌చార్జ్ వీసీ, రిజిస్ట్రార్‌లతో భేటీ
* ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
 సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మృతి చెందిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరికి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు స్పష్టం చేశారు.

రిషితేశ్వరి మృతిపై విచారణ జరిపేందుకు పార్టీ నిజనిర్ధారణ కమిటీ  గురువారం వర్సిటీలో పర్యటించింది. ఇన్‌చార్జ్ వీసీ సాంబశివరావు, రిజిస్ట్రార్ రాజశేఖర్, వర్సిటీ నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్ రాంబాబులతో  కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. రిషితేశ్వరి మృతి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపల్ బాబూరావుపై చర్యలు తీసుకోకుండా, అధ్యాపకుడు డేవిడ్‌రాజును తొలగించడమేమిటని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే  రోజా ఇన్‌చార్జ్ వీసీని ప్రశ్నించారు. ప్రిన్సిపల్ మద్యం తాగి చిందులేస్తే పట్టించుకోలేదని, అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే రిషితేశ్వరి మృతి చెంది ఉండేదా? అని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వీసీ, రిజిస్ట్రార్లను నిలదీశారు.
 
ప్రిన్సిపల్‌పై పోలీసులకు ఫిర్యాదు
అధికారులు సమాధానాలు దాటవేయడంతో ఆగ్రహించిన నాయకులు ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకునే వరకూ కదిలేది లేదని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ తప్పు ఉన్నట్లు తమ విచారణలో తేలిందని రాంబాబు చెప్పడంతో ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ నేతలు పట్టుబట్టారు. దీంతో ఇన్‌చార్జ్ వీసీ.. రిజిస్ట్రార్ రాజశేఖర్ చేత ప్రిన్సిపాల్ బాబూరావుపై పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇప్పించారు. అక్కడే ఉన్న పెదకాకాని సీఐ శేషారావుకు ఫిర్యాదు కాపీని అందించారు.
 
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు షేక్ మహ్మద్ ముస్తాఫా, ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్, మేకా ప్రతాప అప్పారావు, గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గిడ్డి ఈశ్వరి , గౌరు చరిత, కళావతి, పుష్పశ్రీవాణి, రక్షణ నిధి, నిజనిర్థారణ కమిటీ సభ్యులు వంగవీటి రాధా, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, గురజాల, వినుకొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు జంగా కృష్ణమూర్తి, బొల్లా బ్రహ్మనాయుడు తదితరులు హాజరయ్యారు.
 
రిషితేశ్వరి మృతి చెందిన ఇందిరా ప్రియదర్శిని బాలికల హాస్టల్‌ను వైఎస్సార్‌సీపీ మహిళా ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, గిడ్డి ఈశ్వరి, గౌరు చరిత, ఉప్పులేటి కల్పన, కళావతి, పుష్పశ్రీవాణిలు సందర్శించారు. అక్కడి విద్యార్థినులు, వార్డెన్‌తో మాట్లాడారు. నిజనిర్ధారణలో తేలిన అంశాలను రాష్ట్ర గవర్నర్‌కు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదించనున్నట్లు మహిళా ఎమ్మెల్యేలు తెలిపారు.  
 
మీ అక్కకో, చెల్లికో ఇలా జరిగితే
ఊరుకుంటారా?: రిషితేశ్వరి లైంగిక వేధింపులు భరించలేక మానసిక క్షోభతో ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం ఆమె డైరీని చూస్తే అర్థమవుతోందని  రోజా చెప్పారు. సీఎం చంద్రబాబు తన అక్కకో, చెల్లికో లేక కోడలికో ఇలా జరిగితే కేసు పెట్టకుండా సెటిల్‌మెంట్‌లు చేస్తారా? అని ప్రశ్నించారు. ఆమె నాగార్జున వర్సిటీలో మీడియాతో మాట్లాడారు. తహసీల్దార్ వనజాక్షిని కొడితే ఆమెను పిలిచి సెటిల్ చేశారని, ఇప్పుడు రిషితేశ్వరి కుటుంబానికి రూ.10 లక్షలు, 500 గజాల స్థలం ఇచ్చి సెటిల్ చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు దృష్టిలో ఒక ఆడపిల్ల ప్రాణం ఖరీదు ఇంతేనా అని మండిపడ్డారు.
Share this article :

0 comments: