వేకువజాము నుంచే ఎక్కడికక్కడ బంద్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వేకువజాము నుంచే ఎక్కడికక్కడ బంద్

వేకువజాము నుంచే ఎక్కడికక్కడ బంద్

Written By news on Saturday, August 29, 2015 | 8/29/2015

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం వేకువజామునే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ ప్రారంభమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో... పార్టీ శ్రేణులు తెల్లవారుజామున 3 గంటల నుంచే అన్ని ప్రాంతాల్లో బస్సులను అడ్డుకున్నారు. షాపులను బంద్ చేయించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో 3.30 గంటల నుంచి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. బస్టాండ్ నుంచి బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఆర్టీసీ డిపో ముందు ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బైఠాయించి బంద్ నిర్వహించాయి.

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఉదయం 4 గంటల నుంచే పట్టణ బంద్ జరిగింది. బస్సులు తిరగకుండా పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనిలో పార్టీ సాంస్కృతిక విభాగం నాయకురాలు వంగపండు ఉషా పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే అనంపురం జిల్లా పుట్టపర్తి బస్ డిపో ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. పాలకొండ ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో బంద్ జరిగింది. చిత్తూరు జిల్లా పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు బంద్ నిర్వహిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైఎస్సార్‌సీపీ బంద్ కారణంగా ఒడిశా, ఏపీ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పార్టీ శ్రేణులు బంద్ నిర్వహించాయి. విశాఖ జిల్లా అరకులో స్వచ్చందంగా బంద్ కొనసాగుతోంది. వ్యాపారస్తులు తమకు తాముగా షాపులు తెరవకుండా బంద్ పాటిస్తున్నారు. పార్టీ శ్రేణులు రహదారిపై ధర్నాకు దిగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉదయం 4 గంటల నుంచే బంద్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే అంజద్, మేయర్ సురేష్ తదితరులు బంద్‌ను పర్యవేక్షించారు. ఒంగోలు ఆర్టీసీ డిపో వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బంద్ నిర్వహించాయి. గుంటూరు, తిరుపతి ఆర్టీసీ బస్ డిపోల నుంచి బస్సులను బయటకు వెళ్లకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు.

నేతల అరెస్ట్
అనంతపురం పట్టణంలో ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు నవీ మహ్మద్, జయరాంనాయక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా చోడవరంలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్ కారణంగా వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. చోడవరం, గోవాడ, అంబేరుపురం జంక్షన్లలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో బస్సులు, ఆటోలు, లారీలు నిలిచిపోయాయి. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్యుతాపురంలో బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపో ముందు బంద్ నిర్వహిస్తున్న 53వ వార్డు పార్టీ అధ్యక్షుడు చిక్కాల రమణ, 30 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

అద్దంకి(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా అద్దంకి బస్టాండ్ వద్ద బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో అద్దంకి బస్టాండ్ వద్దకు తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు చేరుకొని బస్సులను అడ్డుకున్నారు.

అనంతరం బస్టాండ్ ఎదట బైఠాయించారు. కాగా,బస్టాండ్ వద్దకు చేరుకున్న పోలీసులు బైఠాయించిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కందుకూరులో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ బంద్‌లలో పాల్గొని బస్టాండ్ ఎదట బైఠాయించి రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు.  

రైల్వే కోడూరు (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌తో శనివారం ఉదయం కడప-తిరుపతి జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రైల్వే కోడూరు మండలం కుప్పలదొడ్డి వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి బంద్ నిర్వహించారు. తాటిమొద్దులు రోడ్డుపై వేసి నిప్పంటించారు. దీంతో ఇరువైపులా 12 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి.



రాజమండ్రిలో కొనసాగుతున్న బంద్
రాజమండ్రి: రాజమండ్రి నగరంలో ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజామున 4గంటలకే ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీరరాజులు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని డిపోలో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. మెయిన్‌రోడ్డులోని దుకాణాలు, బ్యాంకులు, పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్‌కు సహాకరించాయి.







నెల్లూరులో నిలిచిపోయిన బస్సులు
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్ కారణంగా జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. శనివారం తెల్లవారుజామున 4గంటలకే వైఎస్సార్ సీపీ జిల్లాలోని పలు డిపోలకు వద్దకు చేరుకొని బస్సులను నిలిపి వేశారు. ఈ సందర్భంగా డిపోల ఎదట బైఠాయించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.



పార్వతీపురం(విజయనగరం జిల్లా): విజయనగరం జిల్లా పార్వతీపురంలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేశారు. శనివారం పట్టణంలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ సాంస్కృతిక విభాగం నాయకురాలు వంగపండు ఉషను పురుష పోలీసులే బలవంతంగా ఎత్తుకెళ్లి వ్యాన్ ఎక్కించారు.

బంద్‌లో పాల్గొన్న పార్వతీపురం నియోజకవర్గ ఇంచార్జీ జమ్మాన ప్రసన్నకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్‌కు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. పోలీసులు వామపక్షాల నాయకుడు రెడ్డి శ్రీరామమూర్తితో పాటు ఆపార్టీలకు చెందిన పలువురు నాయకులను అరెస్ట్ చేసి లారీల్లో తరలించారు.






Share this article :

0 comments: