మాటిస్తున్నా.. అండగా ఉంటాం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాటిస్తున్నా.. అండగా ఉంటాం!

మాటిస్తున్నా.. అండగా ఉంటాం!

Written By news on Thursday, August 27, 2015 | 8/27/2015


మాటిస్తున్నా.. అండగా ఉంటాం!వరంగల్ జిల్లా మల్లికుదురులో వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న షర్మిల
వరంగల్ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల
ఏ ఆపదొచ్చినా ఒక్క పిలుపు చాలు.. మీ కష్టాలు మా కష్టాలతో సమానం
మీరంతా మా కుటుంబంలోని సభ్యులే.. మూడో రోజు 7 కుటుంబాలకు పరామర్శ
హన్మకొండలో అమరవీరుల కీర్తి స్థూపానికి, వైఎస్ చిత్రపటానికి నివాళులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘‘ఏ కష్టమొచ్చినా మేమున్నాం. వైఎస్సార్ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుంది. ఏ ఆపదలోనైనా మీకు ఆసరాగా ఉంటాం.

మీ కష్టాలు మా కష్టాలతో సమానం. అవసరం వచ్చినప్పుడు మాకు చెప్పండి. మీరూ మా కుటుంబంలో సభ్యులే...’’ అంటూ వైఎస్సార్ తనయ, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల భరోసానిచ్చారు. వరంగల్ జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా బుధవారం మూడోరోజు స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటానని మాటిచ్చారు. కుటుంబాల్లోని సభ్యులందరినీ పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకున్నారు.
మడికొండ గ్రామంలో మద్దెల గట్టయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న షర్మిల. చిత్రంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు
వైఎస్సార్ కుటుంబం ఎప్పటికీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల ఉదయం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మల్కాపూర్ నుంచి బయలుదేరారు. పీచర, మల్లికుదురు, మడికొండ, సింగారం, మామునూరులో కుటుంబాలను పరామర్శించారు. 82.5 కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో దారిపొడవునా ప్రజలు షర్మిలకు అభివాదం చేస్తూ స్వాగతం పలికారు.

సింగారంలోని మహిళలు బోనాలతో షర్మిలను తమ ఊరికి ఆహ్వానించారు. హన్మకొండలోని వరంగల్ జిల్లా కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల కీర్తి స్తూపానికి, అక్కడే ఉన్న వైఎస్సార్ చిత్రపటానికి షర్మిల, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాళులర్పించారు. గురువారం వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాల్లోని ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు.
 
అన్నా.. అమ్మను బాగా చూసుకో!
వైఎస్ మృతిని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన ఎడపెల్లి వెంకటయ్య కుటుంబా న్ని పరామర్శించేందుకు షర్మిల ధర్మసాగర్ మండలం పీచరకు వెళ్లారు. వెంకటయ్య భార్య రాజమ్మ, కుమారుడు రవీందర్, ఇతర కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. వారింట్లో గంటసేపు గడిపారు. ‘‘బోర్లలో నీళ్లు ఉన్నాయా? వ్యవసాయం ఎలా ఉంది’’ అని వారిని అడిగారు. వ్యవసాయం లాభసాటిగా లేదని, కుటుంబం గడవటం చాలా ఇబ్బందిగా ఉందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.

రాజమ్మ విలపించడంతో షర్మిల ఆమెను దగ్గరకు తీసుకుని.. ‘‘అమ్మా.. ఇక్కడ కష్టంగా ఉంటే నాతో వస్తావా? తీసుకెళ్తా.. గుం డె ధైర్యంతో ఉండాలమ్మా..’’ అంటూ ఓదార్చా రు. ‘‘అన్నా.. అమ్మను బాగా చూసుకొండ న్నా.. మీకు రాజన్న కుటుంబం అండగా నిలుస్తుంది’’ అని రవీందర్‌కు చెప్పారు. ఏ కష్టం వచ్చినా తనకు ఫోన్ చే యాలని సూచించారు.
 
కుటుంబం ఎలా గడుస్తోంది..
ధర్మసాగర్ మండలం మల్లికుదురులోని మర్రి లక్ష్మి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ‘‘కుటుంబం ఎలా గడుస్తోంది? గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయా? వ్యవసాయ పనులు ఎలా సాగుతున్నాయి’’ అని షర్మిల వారిని అడిగారు. తమది నిరుపేద కుటుంబమని వైఎస్ దయతోనే ప్రస్తుత ఇంటిని నిర్మించుకున్నామని మర్రి ఐలయ్య తెలిపారు. తర్వాత మడికొండలోని మద్దెల గట్టయ్య కుటుంబాన్ని కలిశారు.

గట్టయ్య భార్య వరలక్ష్మి, కూతురు కోమల, కుమారులు కుమారస్వామి, అశోక్‌కుమార్ వారి కుటుంబీకులను పేరుపేరునా పలకరించారు. ఇదే ఊరిలో దోమ లింగయ్య ఇంటికి షర్మిల వెళ్లారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మడికొండకే చెందిన వస్కుల సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సింగారంలోని కాకర్ల రాజయ్య కుటుంబాన్ని పలకరించారు. ‘ధైర్యంగా ఉండండి.. మీకు ఏ కష్టమొచ్చినా నా వద్దకు రండి. అండగా ఉంటాను..’ అని వారికి భరోసా ఇచ్చారు.

వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన పరామర్శ యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, నాడెం శాంతికుమార్, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, జె.అనిల్‌కుమార్, షర్మిల సంపత్, జి.శివకుమార్, జె.నాగరావు, కె.నాగభూషణం, అంకసాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 
చదివిస్తా.. వైద్యం చేయిస్తా..
హన్మకొండ మండలం మామునూరులోని ఎర్ర భాస్కర్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ‘ఆరోగ్యం ఎలా ఉంది. ఏం పని చేస్తున్నారు’ అని భాస్కర్ భార్య లతను ఆప్యాయంగా పలకరించారు. ‘‘పెద్ద కొడుకుకు పోలియో వచ్చింది. చిన్న కొడుకు ఎల్‌కేజీ చదువుతున్నాడు. కూలీ పనిచేసుకుంటూ వాళ్లను సాకుతున్న. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన పదో రోజు ఆ బాధతో ఆయన ఉరివేసుకున్నడు..’’ అని లత కన్నీరు పెట్టుకుంది.

దీంతో చలించిన షర్మిల.. ‘‘నీ చిన్న కొడుకు మంచిగా చదువుకుంటే డాక్టర్ అయ్యే వరకు ఖర్చులన్నీ భరిస్తా. నీ పెద్ద కొడుకుకు వైద్యం చేయిస్తా. నీకు పని కల్పిస్తా..’’ అని ఆమెకు హామీ ఇచ్చారు. భాస్కర్ సోదరుడికి ఆటో కోసం సాయం చేస్తానని, భాస్కర్ రెండో సోదరుడు వినయ్ చదువులో రాణిస్తే ఉద్యోగం వచ్చేలా మాట సాయం చేస్తానని చెప్పారు. లత పెద్ద కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డికి సూచించారు.
బుధవారం వరంగల్ జిల్లా మడికొండలో దోమ లింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న షర్మిల
Share this article :

0 comments: