పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి

పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి

Written By news on Friday, August 7, 2015 | 8/07/2015


పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి
కేంద్ర వ్యవసాయ, ఆర్థిక మంత్రులకు వైఎస్సార్‌సీపీ ఎంపీల విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: పొగాకు రైతులకు న్యాయం చేయడానికి గిట్టుబాటు ధర కల్పించడంలో జోక్యం చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌లకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల సమక్షంలో ఏపీ, తెలంగాణలోని పొగాకు రైతుల సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం తొలుత కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు.

పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నివేదించారు. గిట్టుబాటు ధర కల్పించాలని, వాణిజ్య మంత్రి నిర్మలాసీతారామన్ సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరారు. మధ్య, తక్కువ గ్రేడు పొగాకు కొనుగోలు చేయడానికి పొగాకు బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. రైతుల వద్ద నిల్వ ఉన్న పొగాకు కొనుగోళ్లు చేయాలని కోరారు. పొగాకు రైతులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరప్రసాదరావు, ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, పొగాకు రైతులు అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. పొగాకు రైతుల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన నిధులతో నిల్వల కొనుగోలుకు చర్యలు చేపట్టాలని జైట్లీని కోరామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల ప్రతినిధులు దుగ్గినేని గోపినాథ్, మారెడ్డి సుబ్బారెడ్డి, బంగారుబాబు, వైవీ కృష్ణారావు, బి.ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు. కాగా, శుక్రవారం వాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, పొగాకు రైతు ప్రతినిధులు భేటీ కానున్నారు.
 
ప్రత్యేక హోదా కోసం ఆందోళన..
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో 10న జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానించినట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఏపీ అభివృద్ధిని కోరుకునే అన్ని పార్టీలు ధర్నాకు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.
Share this article :

0 comments: