కరువు ప్రాంతాలుగా అన్ని మండలాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కరువు ప్రాంతాలుగా అన్ని మండలాలు

కరువు ప్రాంతాలుగా అన్ని మండలాలు

Written By news on Thursday, August 6, 2015 | 8/06/2015


కరువు ప్రాంతాలుగా అన్ని మండలాలు
* ప్రకటన కోరుతూ వైఎస్సార్‌సీపీ నేత పార్థసారథి డిమాండ్
* ఏడాది పొడవునా ‘ఉపాధి’ పథకాన్ని అమలు చేయాలి
* కరువుతో రైతులు అల్లాడుతుంటే బాబు విదేశీ పర్యటనలా..

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు విలయతాండవం చేస్తున్నందున అన్ని మండలాల్నీ కరువు ప్రాంతాలుగా ప్రకటించి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో వందరోజుల ఉపాధికి బదులుగా ఏడాది పొడవునా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని(ఎన్‌ఆర్‌ఈజీఎస్) అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అంతేగాక కేంద్రం లేదా రాష్ట్రప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామాల్లో సహాయక పనులు చేపట్టాలని కోరారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్న రైతులను విస్మరించి సీఎం చంద్రబాబు విదే శాల్లో విహార యాత్రలకు వెళ్లడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి అని, ఆయనకేమాత్రం వ్యవసాయంపై శ్రద్ధ లేదని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో ఖరీఫ్ వ్యవసాయ రుణాలకు సంబంధించి ఏటా మే 15 నాటికి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరగాల్సి ఉండగా జూన్ చివరినాటికిగానీ నిర్వహించలేదని, దీనినిబట్టి ఆయనకు రైతులపై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం సాగర్ నుంచి నీరు విడుదల కాకుండా కృష్ణా డెల్టా రైతులకు అన్యాయం చేస్తున్నా, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని యథేచ్ఛగా చేస్తూ రాయలసీమకు నష్టం కలిగిస్తున్నా చంద్రబాబు పట్టించుకోవట్లేదని విమర్శించారు.
 
బాబొస్తే కరువొస్తుందనేది నిజమైంది
బాబొస్తే జాబొస్తుందని ఎన్నికల్లో చెప్పారని, ఇపుడు ఎవరికీ జాబు రాకపోయినా.. బాబొస్తే కరువొస్తుందనేది నిజమైందని పార్థసారథి వ్యంగ్యంగా అన్నారు. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో ఆరేళ్లు కరువొచ్చిందని, ఇపుడు ఆయన రావడంతోనే తిరిగి కరువు ప్రారంభమైందని చెప్పారు.
Share this article :

0 comments: