పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాం

పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాం

Written By news on Sunday, August 30, 2015 | 8/30/2015


ఇంత నీచానికి  ఒడిగడతాడని ఊహించలేదు..
చంద్రబాబు తీరుపై ఎన్టీఆర్ ఆక్రోశం
 

తమ్ముళ్లారా.. చెల్లెళ్లారా.. ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా వినండి. మీ బుద్ధితో ఆలోచించండి. మీ నిర్ణయంతో నన్ను ఆదేశించండి. నాటి నుంచి నేటి వరకూ జరిగిన చరిత్రను మీ ముందు, అంటే ప్రజా న్యాయస్థానం ముందుంచుతున్నాను. మంచేదో చెడేదో; నిజమేదో అబద్ధమేదో; ఆశయమేదో ఆశేదో మీకు తెలియాలనే ఈ ప్రయత్నం. నీతికీ అవినీతికీ మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో న్యాయనిర్ణేతలు మీరే. ఎవరు విజేతలో తేల్చాల్సింది కూడా మీరే ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. దివంగత ఎన్‌టీ రామారావు. వెన్నుపోటు పొడిచి గద్దె దింపిన తన అల్లుడు చంద్రబాబు గురించి ఎన్టీఆర్ చెప్పిన మాటలివి. ఆ సమయంలో ఆయన వెళ్లగక్కిన ఆవేదన ఆయన మాటల్లోనే..

బాబు ఒక చిన్న మిడత..
‘‘224 సీట్లతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రాభవాన్ని ప్రతిఘటించడం చేతకాని వ్యతిరేక శక్తులు కొంతమంది లోలోన (1995లో) గూడుపుఠాణీ ఆరంభించారు. దానికి గురువు, ఈ కుట్రకు కొలువు, మోసానికి మూలస్తంభం చంద్రబాబునాయుడు! నా అల్లుడనబడుతున్నవాడే నా గుండెల్లో చిచ్చుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్‌లో ఉంటూ, మంత్రులపై కూడా పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి, చివరకు టీడీపీ మహా ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఓ చిన్న మిడత. టీడీపీ అధికారంలోకి వచ్చాక, అతను పార్టీలో చేరతానని వస్తే, చేర్చుకోవద్దని కొందరు హితవు చెప్పారు. అయినప్పటికీ... పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాం. తర్వాత పార్టీలో ముఖ్యమైన పదవులన్నీ ఇచ్చాను. అయితే అతడు ప్రజాసేవ కోసం కాక పదవి కోసమే పార్టీలో చేరాడన్న దుర్మార్గాన్ని నేను కనిపెట్టలేకపోయాను. అతడు కడుతున్న ముఠాల గురించి, చేరదీస్తున్న గ్రూపుల గురించి పట్టించుకోలేదు. అతడిలో పదవీ కాంక్ష ఇంతగా గూడుకట్టుకుంటుందని, అతడి వల్ల ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం తప్పుకోవాల్సి వస్తుందని, అతని వల్ల ప్రజాభీష్టమే వ్యర్థమై పోతుందని, ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురవుతుందని, అధికారం కోసం ఇంతటి అల్పమైన నీచమైన దారుణమైన వెన్నుపోటుకు కూడా సిద్ధపడతాడని నేను ఊహించలేకపోయాను.

నా మీద ఒక అభియోగం సృష్టించాడు. కార్యకర్తలకేదో అన్యాయం జరిగిందట. ఏమిటా అన్యాయం? ఎవరికా అన్యాయం? పార్టీ పట్ల శ్రద్ధాభక్తులతో, అంకితభావంతో పనిచేసి ప్రజల విశ్వాసం చూరగొన్న నా కార్యకర్తలెవరికీ, నా తెలుగు తమ్ముళ్లకూ అన్యాయం జరగలేదు. ఒకవేళ ఏదైనా లోటు జరిగితే అది అవకాశవాదులకు మాత్రమే జరిగింది! చంద్రబాబు.. ఆ పెద్దమనిషి.. ఆ మేకవన్నె పులి.. ఆ తేనెపూసిన కత్తి తయారుచేసిన కుట్రదారులకే జరిగింది!! అతడి పక్కన చేరి కుహనా కార్యకర్తలుగా చెలామణి అయి, దళారీలుగా ఉన్నవారికే జరిగింది!!

పేరు చెప్పేందుకూ అనర్హుడే
‘ఇవాళ నేను మాట్లాడుతున్న వ్యక్తి ఓడిపోయి టీడీపీ లోకి వచ్చాడు. నా విధానాలకు పూర్తిగా అంకితమవుతానని మాటిచ్చాడు. కానీ అతని మనసులో ఉన్న దురాశ పోలేదు. నేనిన్ని పదవులిచ్చాను. కానీ ఆయన తనకంటూ ఓ గుంపును తయారు చేసుకున్నాడు. అది నేను గమనించలేదు. ఎవరూ ఊహించని విధం గా(1994 ఎన్నికల్లో) మాకు 214 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో చూసుకుంటే 224 సీట్లు! కాబట్టి వాళ్లేం చేయలేకపోయారు. అదే ఏ 130, 140 సీట్లో వచ్చుంటే వాళ్లేమైనా చేసి ఉండేవాళ్లు. ఎందుకంటే అంతకు ముందే రంగం ఏర్పాటై ఉంది. అందరికీ డబ్బిచ్చాడు ఆయన. ఆయన పేరు చెప్పడం నాకిష్టం లేదు. పేరు చెప్పేందుకు కూడా ఆయన అర్హుడు కాదు. అందరికీ 5 లక్షలు, 10 లక్షలు డబ్బులిచ్చి ‘ఇదిగో ఎన్నికల కోసం మీ అందరికీ డబ్బిస్తున్నాను. మీరంతా నా మనుషులుగా ఉండాలి’ అంటూ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే 224 సీట్లు టీడీపీకీ వచ్చాయో ఆయన ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీఆర్‌నే నాయకుడిగా ఎన్నుకోవాల్సి వచ్చింది. కానీ ఎలాగైనా సీఎం కావాలన్న ఆశ మాత్రం చావలేదు. ఆ ఆశతోనే తన గ్రూపును తయారు చేశాడు. ఇట్స్ ఏ ప్లాన్‌డ్ ట్రెచెరీ!’’

మరో ఔరంగజేబు..
‘‘చరిత్రను చూస్తే.. తండ్రిని జైల్లో పెట్టిన సమ్రాట్లున్నారు. రాజ్యాధికారం కోసం అన్నల్ని చంపిన సోదరుడున్నాడు.. ఔరంగజేబు. అలాంటి దురదృష్టకరమైన ఘటన ఇన్ని వందల ఏళ్ల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అలాంటి చిన్నబుచ్చేతనాన్ని మన జాతి అనుభవించడం అనేది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాళ్లుగా ఉంటూ ఈనాడు జాతికే ద్రోహం చేసి మాయని మచ్చను తెచ్చారు. ప్రజాస్వామ్యానికిది చిన్నతనం. నేను శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లినప్పడు (1995 ఆగస్టు 23 నాటి వెన్నుపోటుకు కొద్ది రోజుల ముందు) అక్కడ ఈ మహానుభావుడే.. ఎవరైతే ఈనాడు జాతికే చిన్నతనం తెచ్చారో, అవమానకరంగా వ్యవహరించారో, తెలుగుజాతిని కించపరిచారో ఆ మహానుభావుడే, ‘రామారావు గారు లేకపోతే మా పార్టీ(తెలుగుదేశం) లేదు. ఆయన వల్లే పార్టీ నడుస్తోంది. మేమాయన వెనకాల ఉంటున్నాం. ఈ ఖ్యాతి, గౌరవం అంతా ఆయనదే. రామారావే మా నాయకుడు’ అన్నాడు. అలా చెప్పిన వాడే 23వ తేదీ సాయంత్రానికల్లా ఎందుకు మారారంటారు?’’

బాబును చరిత్ర క్షమించదు
‘‘అయామ్ ద లయన్. నేనే సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు. ఏ అవమానాన్నీ సహించదు. నాకెలా అవమానం జరిగింది. నా వాళ్లు, నా అన్నవాళ్లు నన్ను ఏ విధంగా మోసం చేశారో ప్రజలకు తెలుసు. అయినా చెప్పడం నా ధర్మం. నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను. నాకేం జరిగినా ప్రజలకు తెలియజెప్పడం నా బాధ్యత. దేవుడు సహా ఎవరూ క్షమించలేని ఘాతుకానికి బాబు ఒడిగట్టాడు. దీన్ని జాతి, చరిత్ర ఎప్పటికీ క్షమించదు..’’ అంటూ ఎన్టీఆర్ తన ఆవేదనను వెళ్లగక్కారు.

గాడ్సేను మించినవాడు..
‘‘ఈ వెన్నుపోటు జరిగింది నాకొక్కడికి మాత్రమే కాదు. ప్రజలకు, మీరు వేసిన ఓటుకు, మీరు నమ్మిన ప్రజాస్వామ్యానికి, మీరు విశ్వసించిన ఆశయాలకు, ఆదర్శాలకు ఇది వెన్నుపోటు! ఇంత నీచానికి ఒడిగట్టిన చంద్రబాబు... ఎన్టీఆర్‌లాగే ఆయన విధానాలే కొనసాగిస్తామని చెబుతుంటే ఎలా ఉందో తెలుసా? చేతులు జోడించి, నమస్కారం చేసి, తుపాకీ పేల్చి గాంధీ మహాత్ముడ్ని పొట్టనబెట్టుకున్న గాడ్సేనే మించిపోయాడనిపిస్తోంది. ఇది సిగ్గుచేటు, క్షమించరాని నేరం. వీళ్లంతా ఇలా ఎందుకు చేశారు. ఎందుకు వెన్నుపోటు పొడిచారు? ఏమిటి ఎన్టీఆర్ చేసిన తప్పు? ఏమిటి ఎన్టీఆర్ చేసిన నేరం?’’


వెన్నుపోటు @ 20ఏళ్లు

అల్లుడని చేరదీస్తే... చెప్పులు వేయించిన చంద్రబాబు   దగ్గరగా ఉంటూ, గద్దె దింపేందుకు ఎత్తులు
పదవి కోసం వైస్రాయ్ హోటల్ కేంద్రంగా రాజకీయ పన్నాగం   శకునినే మించిన పన్నాగాలు పన్ని..
క్యాంపు రాజకీయాలు నడిపి.. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి..   సీఎం పదవిని, తెలుగుదేశం పార్టీని లాక్కుని..
చివరికి ఈ ఆవేదనతో ఎన్టీఆర్ మరణానికి కారణమైన బాబు   ఎన్టీఆర్ పేరును చెరిపేసేందుకు ఎన్నో యత్నాలు
ఇంతా చేసి ఎన్నికలు వచ్చినప్పుడల్లా పబ్బం గడుపుకొనేందుకు ఎన్టీఆర్ నామస్మరణ

 
1995 ఆగస్టు... అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)ను గద్దెదింపడానికి తెరవెనుక కుట్ర జరిగిన నెల. ఆయనకు వెన్నుపోటు పొడిచిన సందర్భం. నిత్యం పక్కనే ఉంటూ ఏమాత్రం అనుమానం రాకుండా ఎన్టీఆర్‌ను గద్దెదింపిన సందర్భం. సరిగ్గా ఇప్పటికి 20 ఏళ్లు. రెండు దశాబ్దాల కిందట ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు... సెప్టెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. నమ్ముకున్న వారే ద్రోహం చేయడంతో ఎన్టీఆర్ తెగ కుమిలిపోయారు. అక్రమంగా, కుట్రపూరితంగా తనను పదవి నుంచి దించివేయడంపై, తనకు జరిగిన అన్యాయంపై, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విధానంపై అప్పట్లో ఎన్టీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలకు వివరించారు. నమ్మక ద్రోహి అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించిన ఏడాది కాలానికే వెన్నుపోటు పొడిచి గద్దె దింపడంతో ఎన్టీఆర్ కుంగిపోయారు. మనోవేదనకు గురై ఆ తర్వాత మూడున్నర నెలలకే ప్రాణాలు విడిచారు. రాష్ట్ర చరిత్రలో ఆగస్టు సంక్షోభంగా కనిపించే ఈ అంశం కొత్త తరానికి కొత్తగా కనిపించవచ్చు. కానీ ఆనాటి సంఘటనలకు బాధ్యులు, జరిగిన కుట్రకు ప్రత్యక్ష, పరోక్ష సాక్షులెందరో ఉన్నారు.

కాంగ్రెస్ వ్యతిరేక నినాదంతో, తెలుగు వారి ఆత్మగౌరవమే సిద్ధాంతంగా 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి, రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. కానీ 1995 ఆగస్టులో చంద్రబాబు తన సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న ఘటన రాజకీయాల్లో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపహాస్యం చేయవచ్చో తెలియజేస్తుంది. 1995 ఆగస్టులో ముఖ్యమంత్రిగా శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఎన్టీఆర్.. తిరిగి హైదరాబాద్ చేరుకోగానే తన ముఖ్యమంత్రి పదవి పోతుందని కనీస మాత్రం కూడా ఊహించలేదు. తమ్ముళ్లారా మేల్కొనండి అంటూ పార్టీ ఎమ్మెల్యేలను పలకరించడానికి చైతన్య రథంపై వైస్రాయ్ హోటల్ సమీపంలోకి రాగానే చంద్రబాబు మనుషులు ఎన్టీఆర్ వాహనంపై చెప్పులు విసురుతూ దాడి చేస్తారని ఆయన కలలో కూడా ఊహించి ఉండరు. అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలో ఆనాడు ఎన్టీఆర్ అవమానాలపాలయ్యారు.

ఎన్టీఆర్ పక్కనే కీలక వ్యక్తిగా ఉంటూనే తెరవెనుక మద్దతుదారులను కూడగడుతూ.. ఎన్టీఆర్‌ను గద్దె దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న విష యం ఆ కుట్రను అమలు పరిచిన రోజునగానీ ప్రజలకు తెలియరాలేదు. దానికి బాబు తెరవెనుక చాలా పెద్ద కథే నడిపారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడానికి బాబు ఏకంగా ఎన్టీఆర్ కుమారులనే పావులుగా వాడుకున్న తీరు ప్రపంచాన్నే విస్మయపరిచింది. ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా వాడుకున్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిని సాకుగా చూపి, ఆమె రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారంటూ ఒక ముద్ర వేసి చంద్రబాబు తన ఎత్తుగడను అమలుచేశారు.
 ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆనాటి అంజయ్య ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ తన కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబుకు ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత 1982లో తెలుగుదేశం ఏర్పాటు, 1983లో ఎన్నికలు జరిగిపోయాయి. సొంత మామ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు.. సొంత మామమీదే పోటీ చేస్తానంటూ కాంగ్రెస్ పక్షాన చంద్రబాబు సవాలు చేశారు. తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించడంతో చంద్రబాబుకు ఎటూ పాలుపోలేదు. దాంతో మామ ఎన్టీఆర్ పంచన చేరాలని నిర్ణయించారు. ఈ మేరకు కుటుంబం నుంచి ఎన్టీఆర్‌పై ఒత్తిడి తెచ్చారు. మొదట్లో పార్టీలో చేర్చుకోవద్దని భావించిన ఎన్టీఆర్... ఆ తర్వాత ఒత్తిళ్లు పెరగడంతో సరేనన్నారు. చంద్రబాబు చేరికను పర్వతనేని ఉపేంద్ర తదితరులు వ్యతిరేకించినా ఎన్టీఆర్ అంగీకరించలేదు. తెలుగుదేశంలో చేరిన చంద్రబాబు... మెల్లమెల్లగా మామకు దగ్గర కావడానికి ప్రయత్నించారు.
 
దుర్మార్గుడు.. మేకవన్నె పులి.. తేనెపూసిన కత్తి.. గాడ్సేనే మించినవాడు.. అభినవ ఔరంగజేబు.. గూడుపుఠాణీకి గురువు.. కుట్రకు కొలువు.. మోసానికి మూలస్తంభం.. వెన్నుపోటుదారుడు..తన అల్లుడని చేరదీసిన పాపానికి వెన్నుపోటు పొడిచి, ముఖ్యమంత్రి పదవిని, తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు గురించి ఆరోజుల్లో ఎన్టీఆర్ అన్న మాటలివి.
 
సమయాన్ని వాడుకుని..
1985 ఆగస్టులో ఎన్టీఆర్‌ను గద్దె దింపడానికి తొలిసారి ప్రయత్నాలు జరిగాయి. పార్టీలో సీనియర్ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు పార్టీలో తిరుగుబాటు చేసి ఎన్టీఆర్‌ను గద్దెదింపి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయం చంద్రబాబుకు కలిసొచ్చింది. ఈ సమయాన్ని వాడుకుని ఎన్టీఆర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. నాదెండ్ల భాస్కరరావు శాసనసభలో బల నిరూపణ చేసుకోవాల్సిన సందర్భం రాగా... ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలను బెంగళూరు, మైసూరు పట్టణాలకు తరలించి క్యాంపులు నిర్వహించిన దశలో చంద్రబాబు తన శక్తియుక్తులను ప్రదర్శించారు. తర్వాత బల నిరూపణ చేసుకోలేక నాదెండ్ల రాజీనామా చేయడం, తిరిగి ఎన్టీఆర్ సీఎం కావడానికి అవకాశం వచ్చినా.. ఆయన శాసనసభను రద్దు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. అంతే ఆరోజు నుంచి చంద్రబాబు పార్టీలో చక్రం తిప్పడం ప్రారంభించారు. ఆ ఎన్నికలు పూర్తికాగానే ఎన్టీఆర్ కేబినెట్‌లో రెవెన్యూ, ఆర్థిక శాఖల వంటి కీలక పదవులతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. ఇలా ఎన్టీఆర్‌కు దగ్గరగా ఉంటూనే తనదైన వర్గాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్టీఆర్ తన పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చంద్రబాబుకు ఏనాడూ రుచించలేదు. అందుకే సందర్భం రాగానే దగ్గుబాటిని చంద్రబాబు పూర్తిగా తొక్కేశారు. 1994 ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ అప్పటివరకు తనకు సేవలు అందిస్తూ వచ్చిన లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు. గుంటూరులో జరిగిన ఒక బహిరంగ సభా వేదిక ద్వారా లక్ష్మీపార్వతిని తన భార్యగా స్వీకరిస్తున్నట్టు ప్రక టించారు. ఆ ఎన్నికల సమయంలో చంద్రబాబు సూచించిన కొందరికి టికెట్లు దక్కకపోవడం, పార్టీలో లక్ష్మీపార్వతి సూచించిన వారికి టికెట్లు వస్తున్నాయన్న విషయాన్ని చంద్రబాబు బాగా ఉపయోగించుకున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న చంద్రబాబు తనకు సంపూర్ణ మద్దతుదారులుగా ఉన్న వారిని లక్ష్మీపార్వతి వద్దకు పంపి... ఆమె ద్వారా టికెట్లు సంపాదించేలా చేసుకున్నారు.

ఆ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించి, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఏ కార్యక్రమానికి హాజరైనా వెంట లక్ష్మీపార్వతి ఉండేవారు. దీంతో ప్రభుత్వంలో, పార్టీలో లక్ష్మీపార్వతి పాత్ర ఎక్కువ అవుతోందని, ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు అంతా తానై నడిపించినా ఇపుడు ప్రాధాన్యత తగ్గుతోందంటూ ఆమెను నియంత్రించాలనే ప్రచారాన్ని చంద్రబాబు ప్రారంభించారు. చంద్రబాబు వెన్నంటి నిలిచిన కొన్ని వార్తా పత్రికలు, టీ వీ చానళ్లు కూడా ఈ ప్రచార బాధ్యతను భుజాన వేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లక్ష్మీపార్వతి పాత్రపై చంద్రబాబు అనుకూల నేతలు విలేకరుల సమావేశాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతోపాటు 1994 ఎన్నిక ల్లో టీడీపీ విజయం సాధించిన తరువాత చంద్రబాబు వర్గంగా ముద్రపడ్డ పలువురికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అలాంటి వారికి సహజంగా ఎన్టీఆర్‌పై ఉన్న ఆగ్రహం కూడా చంద్రబాబుకు ఆయుధంగా పనికొచ్చింది.
 
ఎన్టీఆర్ లేని సమయం చూసి
సీఎం హోదాలో ఎన్టీఆర్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లినపుడు చంద్రబాబు తన పథకాన్ని అమలు మొదలుపెట్టారు. ఎన్టీఆర్ అక్కడ ఉండగానే హైదరాబాద్‌లో క్యాంపు రాజకీయానికి శ్రీకారం చుట్టారు. 1984లో ఎన్టీఆర్‌ను నాదెండ్ల పదవీచ్యుతుణ్ణి చేసినపుడు మైసూరులో క్యాంపు నడిపిన అనుభవం ఉన్న బాబు.. తాను సీఎం అయ్యేందుకు అప్పటి మంత్రి బొజ్జల  సమీప బంధువు పి.ప్రభాకరరెడ్డికి చెందిన హోటల్ వైస్రాయ్‌ను ఉపయోగించుకున్నారు. బాబు తొలుత క్యాంపు మొదలుపెట్టినప్పుడు ఐదు నుంచి పది మంది కంటే ఎమ్మెల్యేలు ఆయన పంచన చేరలేదు. తొలుత వారితో సచివాలయంలో తాను ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించే కార్యాలయంలోనే మంతనాలు జరిపి క్యాంపునకు తరలించారు. ఈ విషయం టీవీల్లో, పత్రికల్లో రాగానే జిల్లాల్లో ఉన్న మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకుని తొలుత ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. అక్కడి నుంచి సచివాలయానికి వచ్చారు. అయితే చంద్రబాబుకు నమ్మిన బంట్లుగా ఉన్న పత్రికల ప్రతినిధులు, ఆయన నియమించుకున్న కొందరు ఈవెంట్ మేనేజర్లు.. సచివాలయానికి వచ్చిన వారికి క్యాంపు గురించి వివరించి, చంద్రబాబు క్యాంపులో 25 మంది ఎమ్మెల్యేలున్నారని ఒక్కరొక్కరుగా అందరూ చేరిపోతున్నారని చెబుతూ మైండ్ గేమ్ ఆడారు. 10 మంది ఉంటే 50 మంది ఉన్నారని నమ్మించి ఎక్కువ మందిని క్యాంపునకు చేర్చడంలో తమ వంతు సహకారం అందించారు. తాము ఎక్కడ వెనుకబడి పోతామో అనే భయంతో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బాబు గూటికి చేరడం మొదలైంది.
 
ప్రచారం చేయించుకుని..
ఈ తతంగం జరుగుతున్నప్పుడు కొంతమంది ఎన్టీఆర్ వెన్నంటి ఉంటామన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లో ఉన్న ఇంట్లో ఉండేవారు. ఆయన ఇంటి నుంచి ఎమ్మెల్యే లు బయటకురాగానే వారిపై నిఘా పెట్టి వారు ఇంటికి చేరగానే మాట్లాడాల్సి ఉందంటూ వైస్రాయ్ హోటల్‌కు తరలించడం వంటివి చకచకా జరిగిపోయాయి. చంద్రబాబు కుట్రకు ఎమ్మెల్యేలు బలవుతున్నారని భావించిన ఎన్టీఆర్.. తన చైతన్య రథంపై వైస్రాయ్ హోటల్‌కు బయలుదేరారు. అప్పటికి కూడా బాబు వెంట 50 నుంచి 60 మందికి మించి ఎమ్మెల్యేలు లేరు. కానీ బాబుకు అనుకూలంగా పనిచేసిన(ఎల్లో మీడియా) పత్రికల్లో ఆయన వెంట 120 మంది చేరిపోయారని, సంఖ్య 140కి చేరిందని ప్రచారం చేస్తూ.. ఎన్టీఆర్ వెంట ఉన్న ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచారు. ఎన్నికల్లో గెలిచి ఏడాది కాకముందే పదవి పోతుందంటూ ప్రచారం కల్పించడంతో కొందరు వైస్రాయ్ క్యాంపులో చేరారు. వైస్రాయ్‌కు వెళ్లిన తర్వాత అక్కడ అంత మంది ఎమ్మెల్యేలు లేరని తెలుసుకుని వెనుదిరగాలని భావించినా బయటకు రానివ్వలేదు. ఇక లక్ష్మీపార్వతి, పరిటాల రవిలతో పాటు మరికొందరిని వెంటబెట్టుకుని బయలుదేరిన ఎన్టీఆర్ వాహన శ్రేణి ట్యాంక్‌బండ్ చివరన ఉన్న వైస్రాయ్ సమీపానికి చేరగానే బాబు మనుషులు ఎదురుదాడికి దిగారు. ఎన్టీఆర్ వాహనంపై రాళ్లు, చెప్పులు విసురుతూ దాడికి తెగబడ్డారు.

అయినా ఎన్టీఆర్ అక్కడి నుంచే పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యేలను వేడుకున్నారు. కానీ ఎమ్మెల్యేలంతా అప్పటికే వైస్రాయ్‌లో బందీ అయ్యారు. ‘తమ్ముళ్లారా మీరు చెప్పినట్టే చేసుకుందామ’ంటూ ఆవేదన పూర్వకంగా వేడుకున్నా బాబు మనుషులు దాడి కొనసాగిస్తుండటంతో ఎన్టీఆర్ వెనుదిరిగారు. ఆయన వెనుదిరిగిన మరుసటి రోజే బాబు ఎమ్మెల్యేలను ర్యాలీగా రాజ్‌భవన్‌కు తీసుకెళ్లి, తమకే బలం ఉందని ఎమ్మెల్యేలతో గవర్నర్ ముందు పరేడ్ చేయించారు. అసలు ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్‌కు వచ్చివెళ్లిన విషయం కూడా ఆ పరేడ్‌లో పాల్గొన్న చాలా మంది ఎమ్మెల్యేలకు అప్పటివరకు తెలియని పరిస్థితి.
 
పార్టీ కోసం డ్రామా..
సీఎం గద్దెనెక్కడానికి ముందే టీడీపీని చేతుల్లోకి తీసుకోవడానికి చంద్రబాబు పెద్ద డ్రామా నడిపించారు. పార్టీలో సర్వప్రతినిధుల సభ(మహానాడు) ఆమోదించి తీర్మానం చేస్తే తప్ప పార్టీ అధ్యక్షుడిని తొలగించడానికి వీలులేదు. కానీ బాబు తన వర్గీయులతో హైదరాబాద్‌లోని కాచిగూడలో బసంత్ టాకీస్‌లో మినీ మహానాడును ఏర్పాటు చేసి అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలగిస్తూ తీర్మానం చేయించి.. తనను అధ్యక్షుడిగా ఎంపిక చేయించుకున్నారు. ఈ తతంగానికి ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ, పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రత్యక్ష సాక్షులు, పాత్రధారులు కూడా. ఈ సమయంలో వారంతా చంద్రబాబుకు తమ వంతు సహకారం అందించారు. అదే ఏడాది సెప్టెంబర్ 1న చంద్రబాబు ఏపీ సీఎంగా పదవి చేపట్టారు.
Share this article :

0 comments: