రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చిత్తశుద్ధితో పార్టీ వైఎస్సార్‌సీపీ ఒక్కటే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చిత్తశుద్ధితో పార్టీ వైఎస్సార్‌సీపీ ఒక్కటే

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చిత్తశుద్ధితో పార్టీ వైఎస్సార్‌సీపీ ఒక్కటే

Written By news on Tuesday, September 1, 2015 | 9/01/2015


బాబు మాటలన్నీ అబద్ధాలే
ధ్వజమెత్తిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
  •    ప్రత్యేక హోదాపై సీఎం ప్రకటనలోని అంశాలు ప్రతిలో లేవు
  •      ప్రకటన ప్రతిలోని అంశాలు, సీఎం ఉపన్యాసం వేర్వేరుగా ఉన్నాయి
  •      ఆ రెండూ ఒకటే అంటే నేను రాజీనామా చేస్తా
  •      లేకుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా?
  •      చంద్రబాబు చెప్పిందే ప్రజల్లోకి వెళ్లాలనేలా సభ నిర్వహిస్తున్నారు
  •      మాపై వేసే అభాండాలకు సమాధానం చెప్పే అవకాశమే ఇవ్వలేదు
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలన్న విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటన చేస్తున్న సందర్భంలో చెప్పినవన్నీ అబద్ధాలేనని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై సభలో ఎమ్మెల్యేలకు పంపిణీ చేసిన ప్రకటన ప్రతిలోని అంశాలు, చంద్రబాబు ఉపన్యాసం రెండూ వేర్వేరుగా ఉన్నాయని తప్పుబట్టారు. ప్రకటనలో లేని అంశాలు, అర్ధసత్యాలు, అబద్ధాలు, వక్రీకరణలతో ఆయన ప్రసంగం సాగుతున్నందుకే తాము అభ్యంతరం తెలిపామని చెప్పారు. సభలో చంద్రబాబు వేసే అభాండాలకు సమాధానం చెప్పే అవకాశమే ఇవ్వలేదని ఆక్షేపించారు. సోమవారం శాసనసభ అర్ధంతరంగా వాయిదా పడిన అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటన ప్రతిని ఈ సందర్భంగా జగన్ చూపిస్తూ... ఇందులో ఉన్న అంశాలే బాబు ప్రసంగంలో ఉన్నాయేమో చెప్పండి.. రెండూ ఒకటే అంటే నేను రాజీనామా చేస్తా... లేకుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా? అని సవాలు విసిరారు. చంద్రబాబు చెప్పిందే ప్రజల్లోకి వెళ్లాలని, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదనే కుట్రతో సభను నిర్వహిస్తున్న తీరును తాము ఇవాళ బహిర్గతం చేశామని చెప్పారు. స్పీకర్ కూడా ఈ కుట్రలో భాగస్వామి అయ్యే పరిస్థితి ఉండటం బాధ కలిగిస్తోందన్నారు. చంద్రబాబు మాట్లాడ్డం, ఇతరులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం కొన్ని పత్రికలు ఆయన ప్రసంగాలను పెద్దబ్యానర్లుగా చేసి రాయడం  రాజకీయ కుట్రలో భాగమని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...

సభలో కుటిల నీతి... :సాధారణంగా ప్రశ్నోత్తరాల సమయం 9 గంటలకు, 10 గంటలకు జీరో అవర్ ఉంటుంది. ఎపుడైనా ప్రశ్నోత్తరాల సమయం కొంత పొడిగిస్తే అది 12 గంటల వరకూ లేదా మరికొంత సమయం పొడిగించి ముగిస్తారు. ఆ తరువాతే 347, 317 నిబంధనల కింద ప్రస్తావనలు వస్తాయి. ఇది ప్రొసీజర్. గతంలో ఏ స్పీకర్ అయినా ఈ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన సందర్భం ఎక్కడైనా ఉందా? కానీ ఇక్కడ జరిగింది.ఆ తర్వాత 1.20, 1.30 గంటల ప్రాంతంలో చంద్రబాబు లేస్తారు. మైక్ పట్టుకుని అబద్ధాలు చెప్తారు, అభాండాలు వేస్తారు.  సమాధానం చెప్పడానికి మాకు ఒక్క నిమిషం కూడా మైక్ ఇవ్వరు. సరిగ్గా 2 గంటలకు సభ ముగించేస్తారు.చంద్రబాబు చెప్పేదే రావాలి... మిగిలిన వారు ఏం మాట్లాడినా బయటకు రాకూడదనే కుటిల నీతితో సభలో వ్యవహరించారు. రాజకీయాలు స్ట్రెయిట్‌గా  చేయాలి. సభలో మీ వాదనేమిటో వినిపించండి, నా విధానమేమిటో నేనూ చెబుతాను. ఇద్దరి వాదనలూ ప్రజలు తెలుసుకుంటారు, అవీ ముక్కు సూటి రాజకీయాలంటే.

లోక్‌పాల్‌కు అడ్డుపడకూడదనే...
 లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు రకరకాల తేదీలతో అబద్ధాలు చెప్పారు. అసలారోజుల్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తుకు చేసుకుంటే... రాష్ట్రాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ఏకమై ఉన్న రోజులవి. చంద్రబాబు కూడా రాష్ట్రాన్ని విడగొట్టే విషయంలో వారితో కలిసిపోయారు. వారంతా కలిసి పోయినపుడు ఇక అవిశ్వాస తీర్మానానికి బలమెక్కడుంటుంది? ఏ రోజైతే మేము అవిశ్వాసం వెనక్కి తీసుకున్నామని చంద్రబాబు చెప్పారో ఆరోజు పార్లమెంటులో లోక్‌పాల్ బిల్లు పెట్టారని గుర్తుకు తెచ్చుకుంటే మంచిది. ఆరోజు కనుక మేం అవిశ్వాసం నోటీసును అలాగే ఉంచితే... జగన్ లోక్‌పాల్‌కు వ్యతిరేకమని అభాండం వేసేవారు. వాస్తవానికి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చిత్తశుద్ధితో పోరాటం చేసిన వ్యక్తిని నేనే. పోరాడిన పార్టీ వైఎస్సార్‌సీపీ ఒక్కటే అని చెప్పడానికి గర్విస్తున్నాను. అదే చంద్రబాబు తెలంగాణలో సీట్ల కోసం రాష్ట్రాన్ని అమ్మేశాడు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా చంద్రబాబు వరంగల్‌కు వెళ్లి నా వల్లే తెలంగాణ వచ్చిందని గొప్ప గా చెప్పుకున్నారు. ఆరోజు తామే తొలుత తెలంగాణ రాష్ట్రానికి  రాజ్యసభలో ఓట్లేశామని చెప్పి టీడీపీ ఫ్లోర్‌లీడర్లు బయటకు వచ్చి రెండు వేళ్లు చూపించి మరీ చెప్పారు.  అయినా ఇవాళ్టి అంశం రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం.దీనిపై తీర్మానం పెట్టాలని ముం దుగా మేమే నోటీసిచ్చాం. మనం చేయబోయే తీర్మానానికి బలం చేకూరాలంటే, కేంద్రంపై ఒత్తిడి పెరగాలంటే కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను ఉపసంహరించుకోవాలని కోరాం. ప్రత్యేకహోదాకోసం మొన్న 29న బంద్ చేస్తుంటే... దాన్ని విఫలం చేయాలని చంద్రబాబు చూశారు. వేలాదిమందిని అరెస్టు చేయడంతోపాటు మహిళలను విద్యార్థులను ఇష్టమొచ్చినట్లు కొట్టారు. చంద్రబాబూ... ప్రత్యేక హోదాకు మీరు అనుకూలమా? వ్యతిరేకమా? తేల్చిచెప్పండి.
చంద్రబాబువల్లే మరణాలు
చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ సృష్టించిన అయోమయంవల్లనే రాష్ట్రంలో ముగ్గురు చనిపోయారు. చంద్రబాబును పక్కనే పెట్టుకుని అరుణ్ జైట్లీ మాట్లాడిన మాటల్లో ప్రత్యేక హోదా గురించి ఒక్క మాటా లేదు. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయని 14వ ఆర్థిక సంఘం అభ్యంతరం చెబుతోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. చంద్రబాబు ఢిల్లీలో ఓరకంగా, విజయవాడలో మరోరకంగా మాట్లాడి కన్ఫ్యూజన్ సృష్టించడంతో ప్రత్యేక హోదా రాదని ముగ్గురు చనిపోయారు.అబద్ధాలు వక్రీకరణలతో రాజకీయాలు చేయవద్దు. ముఖ్యమంత్రి స్టేట్‌మెంట్ కాపీల్లో ఒక్క చోట కూడా ప్రసంగంలోని అంశాల్లేవని విజ్ఞులైన జర్నలిస్టులు గుర్తించాలి. మంగళవారం సభలో చంద్రబాబు మళ్లీ స్టేట్‌మెంట్ ఇస్తే... తర్వాత మాకు అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా మేం సమాధానం చెప్పి తీరుతాం. చంద్రబాబు గంట మాట్లాడినా, రెండు గంటలు మాట్లాడినా మేం కూడా మాకిచ్చే సమయంలో సమాధానాలిస్తాం.
Share this article :

0 comments: